‘ఫేస్‌లెస్‌ అసెస్‎మెంట్‌’తో పన్ను చెల్లింపుదారులకు ఊరట

ABN , First Publish Date - 2020-08-04T06:05:43+05:30 IST

ఆదాయపు పన్ను అసె్‌సమెంట్‌ ప్రక్రియను ఆదాయపు పన్ను విభాగం మరింత పారదర్శకం చేసింది. ఆదాయపు పన్ను

‘ఫేస్‌లెస్‌ అసెస్‎మెంట్‌’తో పన్ను చెల్లింపుదారులకు ఊరట

  • అధికారిని కలవక్కర్లేదు
  • వేధింపులకు తావులేదు
  • యాదృచ్ఛిక పద్ధతిలో కేసుల కేటాయింపు
  • ఐటీ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ మహాపాత్రో

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఆదాయపు పన్ను అసె్‌సమెంట్‌ ప్రక్రియను ఆదాయపు పన్ను విభాగం మరింత పారదర్శకం చేసింది. ఆదాయపు పన్ను చెల్లింపుదారులు దాఖలు చేసే రిటర్న్‌లను పరిశీలించి పన్ను చెల్లింపులపై వారికి నోటీసులు జారీ చేయడం, వారు దాఖలు చేసే పత్రాలను స్వీకరించడం మొదలైన అన్ని ప్రక్రియలను ఆన్‌లైన్‌ ద్వారా చేసే వెసులుబాటు కల్పించింది. పన్ను రిటర్న్‌లను పరిశీలించే అధికారి, పన్ను చెల్లింపుదారు భౌతికంగా కలవాల్సిన అవసరమే ఉండదు. ఇందుకోసం ‘ఫేస్‌లెస్‌ అసె్‌సమెంట్‌ స్కీమ్‌’ను ప్రవేశపెట్టినట్లు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ జేబీ మహాపాత్రో తెలిపారు. 2019 సెప్టెంబరులో ప్రభుత్వం ఈ పథకాన్ని నోటిఫై చేసింది. ప్రయోగాత్మక ప్రాతిపదికన అక్టోబరులో అమల్లోకి తీసుకువచ్చింది. ఫేస్‌లెస్‌ ఈ-అసె్‌సమెంట్‌ పథకం ద్వారా రిటర్న్‌ల మదింపులో పారదర్శకత వస్తుంది. వేధింపులు ఉండవు. అసె్‌సమెంట్‌ అధికారిని కలవాల్సిన అవసరం ఉండదు. సమయం ఆదా అవుతుంది. నోటీసులు జారీ చేయడం నుంచి పన్ను చెల్లింపుదారు అవసరమైన పత్రాలను దాఖలు చేయడం వరకూ ఎలక్ర్టానిక్‌ విధానంలోనే జరుగుతుందని మహాపాత్రో తెలిపారు. ఈ పథకం ప్రధాన లక్ష్యం మానవ ప్రమేయాన్ని తగ్గించడం. అవకతవకలకు పాల్పడిన పన్ను చెల్లింపుదారులందరిపైనా ఒకే విధంగా చట్టాన్ని అమలు చేయడం, అసె్‌సమెంట్‌ను కచ్చితంగా చేయడమేనని అన్నారు. మానవ వనరులను గరిష్ఠంగా వినియోగించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. 


అన్నీ యాదృచ్ఛిక ఎంపికే

స్ర్కూటినీ చేసే రిటర్న్‌ల ఎంపిక, పరిశీలించే అసెసింగ్‌ అధికారి అందరినీ యాదృచ్ఛికంగా ఎంపిక చేస్తారు. స్ర్కూటినీ చేయడానికి ఎంపిక చేసే కేసులను ఆటోమేటిక్‌ విధానంలో కృత్రిమ మేధ టెక్నాలజీ సాయంతో ఎంపిక చేస్తారు. ఆయా పన్ను చెల్లింపుదారులకు నేషనల్‌ ఈ-అసె్‌సమెంట్‌ కేంద్రం (ఎన్‌ఈఏసీ) నోటీసులు పంపుతుంది. ఈ రిటర్నులను పరిశీలించడానికి ప్రాంతీయ ఈ-అసె్‌సమెంట్‌ కేంద్రం ఎంపిక కూడా ర్యాండమ్‌గా జరుగుతుంది. అంటే గోవాకు చెందిన పన్ను చెల్లింపదారు రిటర్న్‌లను మరో రాష్ట్రంలోని ప్రాంతీయ ఈ-అసె్‌సమెంట్‌ కేంద్రం పరిశీలిస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రాంతీయ ఈ-అసె్‌సమెంట్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అసె్‌సమెంట్‌ అధికారి ఎవరో పన్ను చెల్లింపుదారుకు, పన్ను చెల్లింపుదారు ఎవరో అధికారికి తెలియదు. అన్నీ ఉత్తర ప్రత్యుత్తరాలు ఎలక్ర్టానిక్‌ విధానంలోనే జరుగుతాయి. 


58,000 కేసుల ఎంపిక

దేశవ్యాప్తంగా ఫేస్‌లెస్‌ అసె్‌సమెంట్‌ పథకం కింద 58,000 కేసులను పరిశీలన చేపట్టారు. హైదరాబాద్‌లోని ప్రాంతీయ ఈ-అసె్‌సమెంట్‌ కేంద్రానికి 4,600 కేసులను అప్పగించారని, పన్ను అసె్‌సమెంట్‌ ప్రక్రియను తదుపరి స్థాయికి తీసుకువెళ్లడంలో హైదరాబాద్‌ కేంద్రం కీలకపాత్ర పోషిస్తోందని మహాపాత్రో తెలిపారు. దేశవ్యాప్తంగా 58,000 పైగా కేసులు ఈ పథకం కింద పరిశీలించగా.. 8701 కేసుల్లో అదనంగా పన్ను చెల్లింపు లేకుండానే పరిష్కారమయ్యాయని, 296 కేసుల్లో మాత్రమే అదనపు పన్ను చెల్లింపు చేయాల్సి వచ్చిందన్నారు. అన్ని పత్రాలు, రిటర్న్‌లు సమర్పించిన వారికి ఎటువంటి వేధింపులు లేకుండా అసె్‌సమెంట్‌ జరుగుతుందని, పన్ను చెల్లింపుదారులకు ఊరట లభిస్తుందని మహాపాత్రో అన్నారు. 

Updated Date - 2020-08-04T06:05:43+05:30 IST