ఫేస్‌బుక్‌కు భారీ నష్టం..మూడో స్థానానికి పడిపోయిన జూకర్‌బర్గ్

ABN , First Publish Date - 2021-10-05T16:32:47+05:30 IST

వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు ఒకే సారి నిలిచిపోవడం వెనుక కుట్ర ఏమైనా దాగుందా?

ఫేస్‌బుక్‌కు భారీ నష్టం..మూడో స్థానానికి పడిపోయిన జూకర్‌బర్గ్

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు ఒకే సారి నిలిచిపోవడం వెనుక కుట్ర ఏమైనా దాగుందా? సేవలు పునరుద్ధరించడానికి దాదాపు ఏడు గంటల సమయం ఎందుకు పట్టింది? సోషల్ మీడియా దిగ్గజాలు హ్యాక్ కావడమే ఇందుకు కారణమా? మరోవైపు 7 గంటలపాటు వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు నిలిచిపోవడంతో మార్క్‌ జుకర్‌బర్గ్‌‌కు 7 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. దీంతో ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు జూకర్‌బర్గ్ బ్లూమ్ బెర్గ్ ఇండెక్స్‌లో మూడో స్థానానికి పడిపోయారు. 


సోమవారం రాత్రి 9 గంటలకు నిలిచిపోయిన వాట్సాప్, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ సేవలు తిరిగి అందుబాటులోకి రావడానికి దాదాపు 7 గంటల సమయం పట్టింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఉదయం 4 గంటల సమయంలో వాట్సాప్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. తమ సేవలు పునరుద్ధరిస్తున్నామని రాత్రి తొమ్మిదిన్నర సమయంలోనే ఫేస్‌బుక్‌ ప్రకటించినా.. ఈ సేవలు అందుబాటులోకి రావడానికి సుదీర్ఘ సమయం పట్టింది. 


సోషల్ మీడియా దిగ్గజాలు పని చేయకపోవడానికి హ్యాకింగ్ కారణమన్న అనుమానాలను కొట్టి పారేయలేమని అమెరికాలోని సైబర్ నిపుణులు అంటున్నారు. ఫేస్‌బుక్‌ యాప్‌ను తెరిస్తే ‘సమ్‌థింగ్‌ వెంట్‌ రాంగ్‌.. ప్లీజ్‌ ట్రై అగైన్‌’ అని సందేశం వచ్చింది. వాట్సాప్‌లో మెసేజ్‌ను టైప్‌ చేసి సెండ్‌ చేస్తే బఫరింగ్‌ కొనసాగింది. ఇన్‌స్టాగ్రామ్‌ను తెరిచే ప్రయత్నం చేస్తే.. ‘కుడ్‌ నాట్‌ రిఫ్రెష్‌ ఫీడ్‌’ అనే సందేశం ప్రత్యక్షమైంది. ఎన్నడూలేని విధంగా ఈ మూడు యాప్‌ల సేవలు గంటల కొద్దీ స్తంభించడంపై సర్వత్రా నెటిజెన్లు విస్మయం వ్యక్తంచేశారు.


అయితే హ్యాకింగ్ వ్యవహారంపై సంస్థ ఎలాంటి ప్రకటన చేయలేదు. వెబ్‌సైట్‌, యాప్‌, సర్వర్‌ కనెక్షన్‌లకు సంబంధించిన సమస్యల వల్లే ఈ మూడు యాప్‌లు మొరాయించి ఉండొచ్చని డౌన్‌ డిటెక్టర్‌ వ్యాఖ్యానించింది. ఫేస్‌బుక్‌ వెబ్‌పేజీలను తెరిచే ప్రయత్నం చేయగా డొమైన్‌ నేమ్‌ సిస్టమ్‌ ఎర్రర్‌ అని చూపించిందని ఓ వార్తాసంస్థ కథనాన్ని ప్రచురించింది. డొమైన్‌ నేమ్‌ సిస్టమ్‌ అనేది వినియోగదారులను వారు కోరిన వెబ్‌ చిరునామాకు చేర్చే సాంకేతిక వ్యవస్థ అని పేర్కొంది. బహుశా ఇది విఫలమైనందు వల్లే ఫేస్‌బుక్‌ వెబ్‌పేజీ తెరుచుకోకపోయి ఉండొచ్చని అంచనా వేసింది. 

Updated Date - 2021-10-05T16:32:47+05:30 IST