ఫేస్‌బుక్‌లో పరిచయం.. ఇంటికి పిలిచి నిర్బంధం

ABN , First Publish Date - 2022-07-02T17:37:35+05:30 IST

ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తిని ఇంటికి పిలిచింది. అతడు రాగానే మరికొందరితో కలిసి నిర్బంధించి బెదిరించారు. అతడి బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి

ఫేస్‌బుక్‌లో పరిచయం.. ఇంటికి పిలిచి నిర్బంధం

రూ. 1,02,254 వారి ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్‌

హైదరాబాద్/ఘట్‌కేసర్‌: ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తిని ఇంటికి పిలిచింది. అతడు రాగానే మరికొందరితో కలిసి నిర్బంధించి బెదిరించారు. అతడి బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి రూ. 1,02,254 వారి ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నారు. ఈ ఘటన ఘట్‌కేసర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గత నెల 27న జరిగింది. ఘట్‌కేసర్‌ అడిషనల్‌ సీఐ జంగయ్య తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని మియాపూర్‌, జనప్రియ కాలనీకి చెందిన ఎడ్ల శ్రీపాల్‌రెడ్డికి, భద్రాది-కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచకు చెందిన పల్లపు రోజా అలియాస్‌ మానస(25)తో ఫేస్‌ బుక్‌లో పరిచయం ఏర్పడింది. గత నెల 27న ఆ యువతి శ్రీపాల్‌రెడ్డికి ఫోన్‌ చేసి హైదరాబాద్‌కు వస్తున్న కలవాలని  చెప్పగా... శ్రీపాల్‌ రెడ్డి ఘట్‌కేసర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో పోచారం శివాలయం వద్దకు వెళ్లాడు.

రోజా, ఆమెతో సహజీవనం చేస్తున్న భద్రాది-కొత్తగూడెంకు చెందిన కందలు వంశీ(25), పోచారం శివాలయం వద్ద ఉంటున్న సాగి వర్మ(26), పల్లపు దేవి(25) అదేరోజు రాత్రి అక్కడికి వచ్చారు. శ్రీపాల్‌రెడ్డితో మాటామాట కలిపి నిర్భందించారు. డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేయాలని లేదంటే చంపేస్తామని బెదిరించి అతడి అకౌంట్‌ నుంచి రూ. 1,02,254లను వారి ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నారు. బాధితుడు గత నెల 28న ఘట్‌కేసర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు గత నెల 30న కుషాయిగూడలో అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 1,60,254 స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను రిమాండ్‌కు తరలించామని సీఐ తెలిపారు. 

Updated Date - 2022-07-02T17:37:35+05:30 IST