ఢిల్లీ హైకోర్టులో ఫేస్‌బుక్‌కు చుక్కెదురు

ABN , First Publish Date - 2021-04-22T20:52:39+05:30 IST

వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీపై దర్యాప్తుకు ఆదేశిస్తూ సీసీఐ జారీ చేసిన ఆదేశాలను

ఢిల్లీ హైకోర్టులో ఫేస్‌బుక్‌కు చుక్కెదురు

న్యూఢిల్లీ : వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీపై దర్యాప్తుకు ఆదేశిస్తూ సీసీఐ జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు గురువారం తోసిపుచ్చింది. సీసీఐ ఆదేశాలు అసమంజసమైనవి కాదని తెలిపింది. సీసీఐ ఆదేశించిన దర్యాప్తును అడ్డుకోవడానికి ఫేస్‌బుక్, వాట్సాప్ దాఖలు చేసిన ఈ పిటిషన్లలో పస లేదని వివరించింది. 


జస్టిస్ నవీన్ చావ్లా మాట్లాడుతూ, వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీపై సుప్రీంకోర్టులోనూ, ఢిల్లీ హైకోర్టులోనూ జరుగుతున్న విచారణల ఫలితం కోసం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) వేచి చూడటం వివేకంతో కూడిన నిర్ణయమే అయినప్పటికీ, ఆ విధంగా వేచి చూడకపోవడం వల్ల దాని ఆదేశాలు ఆమోదయోగ్యం కానివిగా, లేదా, అధికార పరిధి లేకుండా జారీ చేసినవిగా కాబోవని వివరించారు. 


సీసీఐ ఆదేశాల మేరకు జరిగే దర్యాప్తును అడ్డుకోవడానికి ఫేస్‌బుక్, వాట్సాప్ దాఖలు చేసిన పిటిషన్లలో పస లేదని హైకోర్టు తెలిపింది. ఇదిలావుండగా, సీసీఐ వినిపించిన వాదనలో, వ్యక్తిగత గోప్యతను వాట్సాప్ కొత్త పాలసీ ఉల్లంఘిస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోందని, ఈ అంశంపై తాను దర్యాప్తు జరపడం లేదని తెలిపింది. వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ మితిమీరిన డేటాను సేకరించడానికి దారి తీస్తుందని తెలిపింది. లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రకటనలు ఇవ్వడం కోసం, మరింత మంది యూజర్లను సంపాదించడం కోసం వినియోగదారుల వెంటపడటానికి దోహదపడుతుందని పేర్కొంది. ఇది ఆధిపత్య స్థితిని దుర్వినియోగపరచడమవుతుందని వెల్లడించింది. అధికార పరిధి విషయంలో పొరపాటు జరగలేదని వివరించింది. తన నిర్ణయాన్ని సవాలు చేస్తూ వాట్సాప్, ఫేస్‌బుక్ దాఖలు చేసిన పిటిషన్లు విచారణార్హత లేనివని, అపార్థాలతో కూడుకున్నవని పేర్కొంది. 


వాట్సాప్ సేకరించిన సమాచారాన్ని ఫేస్‌బుక్‌తో షేర్ చేసుకోవడం పోటీ నిరోధక చర్య లేదా ఆధిపత్య స్థితిని దుర్వినియోగపరిచే చర్య అవుతుందా? లేదా? అనే విషయాన్ని నిర్ణయించడం దర్యాప్తు పూర్తయిన తర్వాత మాత్రమే సాధ్యమవుతుందని సీసీఐ వాదించింది. వ్యక్తి ఉన్న ప్రదేశం, ఎటువంటి డివైస్ వాడుతున్నారు? ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఎవరు? ఎవరితో మాట్లాడుతున్నారు? వంటి సమాచారాన్ని సేకరించడం వల్ల కస్టమర్ ప్రొఫైల్‌ను సృష్టించడానికి దారి తీస్తుందని పేర్కొంది. లక్ష్యాన్ని నిర్దేశించుకుని కస్టమర్లకు ప్రకటనలను పంపడం ద్వారా ఆదాయాన్ని సంపాదించడానికి వీలవుతుందని పేర్కొంది. ఈ చర్యలన్నీ వినియోగదారును వెంటాడటమే అవుతాయని పేర్కొంది. 


ఫేస్‌బుక్, వాట్సాప్ వినిపించిన వాదనలలో, స్వీయ విచారణకు స్వీకరించేందుకు గల అధికారాలను సీసీఐ దుర్వినియోగపరిచిందని ఆరోపించాయి. సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు ఇప్పటికే ప్రైవసీ పాలసీపై విచారణ జరుపుతున్నాయని, అయినప్పటికీ సీసీఐ దర్యాప్తునకు ఆదేశించిందని తెలిపాయి. ఈ విషయంలో సీసీఐ జోక్యం చేసుకోకుండా ఉంటే బాగుండేదని పేర్కొన్నాయి. 


వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీపై మీడియా కథనాలను సీసీఐ జనవరిలో స్వీయ విచారణకు చేపట్టింది. దీనిపై దర్యాప్తు జరపాలని మార్చి 24న ఆదేశాలు జారీ చేసింది. 


Updated Date - 2021-04-22T20:52:39+05:30 IST