మరోమారు ట్రంప్ పోస్ట్‌ను తొలగించిన ఫేస్‌బుక్, ట్విట్టర్

ABN , First Publish Date - 2020-08-06T21:47:30+05:30 IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ చేసిన మరో వీడియోను ప్రముఖ సోషల్ మీడియా సంస్థలు

మరోమారు ట్రంప్ పోస్ట్‌ను తొలగించిన ఫేస్‌బుక్, ట్విట్టర్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ చేసిన మరో వీడియోను ప్రముఖ సోషల్ మీడియా సంస్థలు ఫేస్‌బుక్, ట్విటర్‌లు తొలగించాయి. వీడియోలో వివరాలు తప్పుగా ఉండడం వల్లే తొలగించాల్సి వచ్చినట్టు రెండు సంస్థలు వెల్లడించాయి. ట్రంప్ ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పిల్లలకు రోగనిరోధక శక్తి ఉందని.. వారు తిరిగి స్కూళ్లకు వెళ్లిపోవచ్చని చెప్పుకొచ్చారు. ఈ వీడియోనే ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాలలో పోస్ట్ చేశారు. దీంతో వీడియోలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తమ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి రెండు సంస్థలు పోస్ట్‌ను తొలగించాయి. ట్విట్టర్‌లో ట్రంప్ క్యాంపెయిన్ టీంకు చెందిన టీమ్‌ట్రంప్ అకౌంట్‌ ఈ వీడియోను పోస్ట్ చేయగా.. ట్రంప్ అకౌంట్ ఆ వీడియోను షేర్ చేసింది. దీంతో టీంట్రంప్ అకౌంట్‌ ఆ ట్వీట్‌ను తొలగించేంతవరకు అకౌంట్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు ట్విట్టర్ పేర్కొంది. అయితే ఈ పోస్ట్‌ల తొలగింపుపై ట్రంప్ క్యాంపెయిన్ టీం అధికారి కోర్ట్‌నీ పారెల్లా స్పందించారు. పిల్లలు కరోనా బారిన పడటానికి తక్కువ అవకాశాలున్నాయని ట్రంప్ ఆ వీడియోలో చెప్పారని.. అందులో తప్పులేదని కోర్ట్‌నీ తెలిపారు. ట్రంప్‌ విషయంలో సోషల్ మీడియా సంస్థలు పక్షపాతం చూపుతున్నాయని.. ఈ సంస్థలేమీ నిజాలకు మధ్యవర్తులు కాదని మండిపడ్డారు. ఇదిలా ఉంటే.. అమెరికాలో ఇప్పటివరకు 2.4 లక్షలకు పైగా పిల్లలు కరోనా బారిన పడ్డారు. మరోపక్క అమెరికా వ్యాప్తంగా 4,973,741 కరోనా కేసులు నమోదుకాగా.. 161,608 మంది మృత్యువాతపడ్డారు. కాగా.. ఫేస్‌బుక్, ట్విట్టర్ సంస్థలు ఇప్పటికే అనేక సార్లు ట్రంప్ పోస్ట్ చేసిన వీడియోలను తొలగించాయి.

Updated Date - 2020-08-06T21:47:30+05:30 IST