వలపు వల!

ABN , First Publish Date - 2021-08-01T05:26:47+05:30 IST

ఏదో సమయంలో కొత్తనెంబరు నుంచి ఒక వాట్సప్‌ సమాచారం వస్తుంది. స్నేహానికైనా, ప్రేమకైనా మరే ఇతర అవసరాలకైనా మంచి అమ్మాయి కావాలా అని అందులో ఉంటుంది.

వలపు వల!

చిక్కితే విలవిల..

ఫేస్‌బుక్‌, వాట్సప్‌ల ద్వారా వలవేస్తున్న సైబర్‌ నేరగాళ్లు

న్యూడ్‌ చాటింగ్‌ అంటూ కవ్వింపులు

అటుపై వీడియోలు బయటపెడతామంటూ బెదిరింపులు

అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు


 మా వద్ద అందమైన అమ్మాయిలు ఉన్నారు.. మీకు మీట్‌ కావాలా.. డేట్‌ కావాలా..? అంటూ ముగ్గులోకి దింపుతారు. అటుపై న్యూడ్‌ చాటింగ్‌లు అంటూ కవ్విస్తారు.. చివరికి వీడియోలు బయటపెడతాం.. అడిగినంత డబ్బివ్వాలంటూ  బెదిరిస్తారు.. ఇవీ ఇప్పుడు సైబర్‌ కేటుగాళ్లు ఎంచుకున్న నయా దందా..! ఇటువంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వాట్సప్‌కు వచ్చే తెలియని లింక్‌లపై క్లిక్‌ చేసి మోసాలకు గురికావద్దని సూచిస్తున్నారు.

 

గుంటూరు(తూర్పు), జూలై31: ఏదో సమయంలో కొత్తనెంబరు నుంచి ఒక వాట్సప్‌ సమాచారం వస్తుంది. స్నేహానికైనా, ప్రేమకైనా మరే ఇతర అవసరాలకైనా మంచి అమ్మాయి కావాలా అని అందులో ఉంటుంది. కొంతమంది వీటిని పట్టించుకోరు.. మరికొందరు వీటిని ఓపెన్‌ చేసి సదరు వ్యక్తికి కాల్‌ చేస్తారు. అవతలివైపు నుంచి అందమైన గొంతుతో అమ్మాయి మాట్లాడుతుంది. దీంతో వారు నిజమనే నమ్ముతారు.  ఆ తరువాత వారు కొంతసొమ్మును డిపాజిట్‌ చేయమని అడిగి బ్యాంకు ఖాతా వివరాలను పంపుతారు. సొమ్మును డిపాజిట్‌ చేయగానే వాట్సప్‌కు కొంతమంది అమ్మాయిలు ఫొటోలు పంపుతారు. వారిలో ఒకరిని ఎంపికచేసుకుని చాట్‌ చేసుకోవచ్చని ఆఫర్‌ కూడా ఇస్తారు. దీంతో చాటింగ్‌తో సంభాషణ మొదలై, న్యూడ్‌ చాటింగ్‌ వరకు సదరు ముఠా తీసుకెళ్తుంది. ఆ తరువాత నుంచి అడిగినంత డబ్బులు ఇవ్వాలని లేదంటే వీడియోలను ఫేస్‌బుక్‌, వాట్సప్‌లలో పెడతామంటూ బెదిరింపులకు దిగుతారు. ఇదీ ఇప్పుడు నడుస్తున కొత్త రకం మోసం...!


ఇలా ఎంచుకుంటారు..

ఓ వ్యక్తికి సమాచారం పంపే ముందు సదరు ముఠావ్యక్తులు పూర్తి సమాచారాన్ని సేకరిస్తారు. అది ఎలాగంటే.. మనం సోషల్‌ మీడియాలో ఎటువంటి వాటి కోసం వెతుకుతుంటామో మనకు కూడా అటువంటి వాటి గురించిన సమాచారం, లేదా వీడియోల లింక్‌లు మన ఫోనుకు వస్తుంటాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా ఇది సాధ్యమవుతుంది. దీనినే సైబర్‌ కేటుగాళ్లు కూడా ఉపయోగిస్తుంటారు. ఎవరైతే అశ్లీల వెబ్‌సైట్‌లను వెతుకుతుంటారో అటువంటివారికే ఈ ముఠా వలవేస్తుంది. అటువంటివారే లింకులపై ఎక్కువగా స్పందిస్తుంటారు. 


పెరుగుతున్న బాధితులు

లాక్‌డౌన్‌ సమయంలో ఇంటివద్దనే ఉండటంతో ఎక్కువమంది మొబైల్‌ ఫోన్లకే పరిమితమయ్యారు. దీంతో ఎక్కువమంది వీరి బారినపడ్డారు. యువతేకాదు అన్ని వయసుల వారి వలలో పడ్డారు.  చాలామంది డబ్బుల చెల్లించి డౌన్‌లోడ్‌ చేసుకోవలసిన యాప్‌లను కూడా వేరే సాఫ్ట్‌వేర్‌ల ద్వారా ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకుంటారు. వీటినే క్రాక్‌డ్‌ యాప్స్‌ అంటారు. వీటిని వాడటం ద్వారా మన పూర్తి సమాచారం హ్యాకింగ్‌కు గురవుతుంది. వీటిని సైబర్‌ కేటుగాళ్లు తమ అస్త్రంగా వాడుకుంటున్నారు. ఇప్పటికే ఇలా చిక్కుకుని చాలామంది విషయాన్ని బయటకు చెప్పలేక, ముఠానుంచి ఎటువంటి బెదిరింపులు వస్తాయో తెలియక కుమిలిపోతున్నారు.


 అప్రమత్తంగా ఉండాలి...

వాస్తవానికి మన ఫోను, డెబిట్‌, క్రెడిట్‌ కార్డు సమాచారం అంతా మన దగ్గరే ఉంటాయి కదా అనుకుంటాం. కానీ మనం వాడే సాప్ట్‌వేర్‌ ఇతర సాంకేతికతను ఉపయోగించి సదరు డేటాను సైబర్‌ కేటుగాళ్లు తస్కరిస్తుంటారు. వారి బారిన పడకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు... 

ఫేస్‌బుక్‌లో పరిచయం లేని వ్యక్తులనుంచి వచ్చే ఫ్రెండ్‌ రిక్వెస్టులను ఆమోదించకూడదు. 

వాట్సప్‌లో వచ్చే అనధికార లింక్‌ అసలు ఓపెన్‌ చేయకూడదు.

మనకు అవసరమైన ప్రతి యాప్‌ను ప్లేస్టోర్‌ నుంచి మాత్రమే డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

అపరిచిత వ్యక్తులు వీడియోకాల్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించకూడదు.

ఎవరైనా వీరి బారిన పడితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి.


ఫిర్యాదు చేయండి..

సైబర్‌ కేటుగాళ్ల వలలో పడితే వెంటనే ఫిర్యాదు చేయాలని పోలీసులు చెబుతున్నారు. న్యూడ్‌ చాటింగ్‌ వంటి విషయాల్లో నష్టపోయిన బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేస్తున్నారు. చాలామంది ఇటువంటి నేరాలపై సైబర్‌ పోలీసులకు మాత్రమే ఫిర్యాదు చేయాలనుకుంటూ ఉంటారు. కానీ ఏ పోలీస్‌స్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు చెబుతున్నారు. ఇటువంటి మోసాలు జరిగినపుడు 90176 66667 అనే వాట్సప్‌ నెంబరుకు ఫిర్యాదు చేసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. దీనితోపాటు 72191 09619 అనే నెంబరుకు నేరుగా ఫోనుచేసి ఫిర్యాదు చేయవచ్చు. ఇటువంటి మోసాల్లో డబ్బులు నష్టపోతే ఫిర్యాదు చేసేందుకు కేంద్రం హెల్ప్‌లైన్‌ నెంబరును అందుబాటులోకి తీసుకొచ్చింది. మీ అకౌంట్‌ నుంచి డబ్బు మాయం అవగానే వెంటనే 155260 అనే హెల్ప్‌లైనుకు  ఫోను చేసి సమాచారం ఇవ్వాలి. దీంతో మన డబ్బును కాపాడుకోవచ్చు. అమాయకుల నుంచి కొల్లగొట్టిన సొమ్మును సైబర్‌ నేరస్తులు ఒక బ్యాంకు నుంచి మరో బ్బాంకుకు మారుస్తారు. ఇలా ఐదు బ్యాంకుల ఖాతాలకు మార్చినప్పటికి హెల్ప్‌లైన్‌కు రూపొందించిన సిస్టమ్‌ ద్వారా అధికారులు వెనక్కి రప్పించగలిగారు.   

Updated Date - 2021-08-01T05:26:47+05:30 IST