ఉన్నత విద్యలో ముఖ హాజరు

ABN , First Publish Date - 2022-08-11T08:33:57+05:30 IST

ఉన్నత విద్యలో ముఖ హాజరు

ఉన్నత విద్యలో ముఖ హాజరు

డిగ్రీ, ఇంజనీరింగ్‌, పీజీ విద్యార్థులకు అమలు

యాప్‌ రూపకల్పనకు ఆదేశాలు.. త్వరలో అమల్లోకి కొత్త విధానం


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఉన్నత విద్యలో ఫేసియల్‌ రికగ్నైజేషన్‌ అంటెండెన్స్‌(ముఖ ఆధారిత హాజరు) విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది. ఇందుకు అవసరమైన మొబైల్‌ యాప్‌ రూపకల్పన, నిర్వహణకు టెండర్లు పిలిచింది. త్వరలోనే యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి అమలుచేసేందుకు సన్నాహాలు చేస్తోంది. దీంతో ఇప్పటివరకూ మాన్యువల్‌ విధానంలో ఉన్న హాజరు ఆన్‌లైన్‌లోకి మారనుంది. ఈ విధానం డిగ్రీ, ఇంజనీరింగ్‌, పీజీ కోర్సులకు అమలుచేయబోతున్నారు. గతంలో బయోమెట్రిక్‌ విధానం తీసుకురావాలని ప్రయత్నించారు. ఇప్పుడు దాని స్థానంలో ఫేసియల్‌ విధానం తెస్తున్నారు. ఇకపై దీని ఆధారంగానే ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకాన్నీ అమలు చేసే వీలుంది. ప్రస్తుతం కనీస హాజరుపై నిబంధనలున్నప్పటికీ హాజరు మాన్యువల్‌ కావడంతో దాదాపుగా అందరూ కనీస హాజరు పరిధిలోకి వస్తున్నారు. అనేక చోట్ల విద్యార్థులు సక్రమంగా తరగతులకు హాజరు కాకపోయినా హాజరు వేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త విధానాన్ని  అమలులోకి తీసుకురానుంది. 


ఎలా వేస్తారంటే...

విద్యార్థి ముఖం ఏ కోణంలో కనిపించినా హాజరు నమోదయ్యేలా ముందుగా ప్రతి విద్యార్థిని పలు కోణాల్లో ఫొటోలు తీసి యాప్‌లో ఉంచుతారు. అనంతరం ప్రతిరోజూ మొదటి క్లాస్‌లో లెక్చరర్‌ యాప్‌లో లాగిన్‌ అయిన తర్వాత మొత్తం తరగతి గదిని మూడు కోణాల్లో ఫొటోలు తీస్తారు. ఆ ఫొటోల్లో విద్యార్థుల ముఖాలన్నీ రికార్డు కాగానే వారి హాజరు పడుతుంది. ఒకవేళ ఆ సమయంలో ఫోన్‌కు ఇంటర్నెట్‌ అందకపోయినా, ముందుగా ఫొటోలు తీసుకుని, తర్వాత యాప్‌లో అప్‌లోడ్‌ చేయగానే ఆటోమేటిక్‌గా ఆ ముఖాల ఆధారంగా హాజరు పడుతుంది. దీంతో పాటు మాన్యువల్‌ విధానాన్ని కూడా కొనసాగిస్తారు. దీనికోసం కళాశాల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో డ్యాష్‌బోర్డులు రూపొందించి పర్యవేక్షిస్తారు. ప్రభుత్వ కళాశాలలతో పాటు, ప్రైవేటులోనూ తప్పనిసరిగా దీనిని అమలుచేస్తారు. రాష్ట్రంలో లక్షన్నర మంది ఇంజనీరింగ్‌, సుమారు 1.6 లక్షల మంది డిగ్రీ విద్యార్థులున్నారు. వీరితో పాటు పీజీ కోర్సుల విద్యార్థులు అంతా కలిపి సుమారు 4 లక్షల మంది ఉండొచ్చని అంచనా. వారందరికీ కొత్త హాజరు విధానాన్ని అమలు చేయబోతున్నారు. 

Updated Date - 2022-08-11T08:33:57+05:30 IST