ప్రైవేటు ఆస్పత్రుల్లో కంటితుడుపు తనిఖీలు

ABN , First Publish Date - 2022-09-27T07:53:13+05:30 IST

ప్రైవేటు ఆస్పత్రుల్లో జరుగుతున్న ప్రత్యక్షచర్యలపై రాజకీయ ఒత్తిళ్లు మొదలైనట్లు సమాచారం.

ప్రైవేటు ఆస్పత్రుల్లో కంటితుడుపు తనిఖీలు
మిర్యాలగూడ డాక్టర్స్‌కాలనీలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు

 లోపాలు బయటపడినా  ప్రత్యక్ష చర్యలు నిల్‌

 నివేదికతో సరిపెడుతున్న తనిఖీ బృందాలు

మిర్యాలగూడ అర్బన్‌, సెప్టెంబరు 26: ప్రైవేటు ఆస్పత్రుల్లో జరుగుతున్న ప్రత్యక్షచర్యలపై రాజకీయ ఒత్తిళ్లు మొదలైనట్లు సమాచారం. తొలిదఫా చేపట్టిన క్షేత్రస్థాయి తనిఖీల్లో డీఎంహెచ్‌వో పాల్గొనగా, సోమ వారం మిర్యాలగూడ డాక్టర్స్‌కాలనీలో జరిగిన తనిఖీల్లో  పాల్గొన్న ద్వితీయ శ్రేణి అధికారులు నామ మాత్రంగా తనిఖీలు నిర్వహించడం చర్చనీయాం శంగా మారింది. స్థానిక డిప్యూటీ డీఎంహెచ్‌వో పర్యవేక్షణలో రెండు బృందాలు 27ఆస్పత్రుల్లో తనిఖీలు చేశాయి. ఈ సందర్భంగా పలు ఆస్పత్రుల్లో లోపాలను అధికారులు గుర్తించినప్పటికీ తక్షణ చర్యలు తీసు కోలేదు. పలువురు వైద్యులు తమ రిజిస్ట్రేషన్లను రెన్యూవల్‌ చేయించుకోకుం డానే వైద్యసేవలు అందిస్తున్నట్లుగా తనిఖీ బృందాలు గుర్తించాయి. అలాగే ఆస్పత్రుల అనుసంధానంతో పనిచేస్తున్న డయాగ్నస్టిక్‌ సెంటర్లు, ఎక్స్‌– రే ల్యాబ్‌ల్లో విద్యార్హతలేని పారమెడికల్‌ సిబ్బందితో పరీక్షలు పరీక్షలు చేయిస్తున్నట్లుగా నిర్ధారించారు. కొందరు ఆర్‌ఎంపీలు భవనాలను లీజుకు తీసుకొని విజిటింగ్‌ డాక్టర్లతో ఓపీ, ఐపీ సేవలు అందిస్తున్న తీరు తనిఖీలో బయటపడింది. ఈనెల 22న నిర్వహించిన తొలిదఫా తనిఖీలో విస్తుపోయే నిజాలు వెలుగు చూడగా, రెండు ఆస్పత్రులు, ఐదు ల్యాబ్‌లను సీజ్‌ చేశారు.  రాష్ట్ర మెడికల్‌ కౌన్సిల్‌ నిబంధనలు విరుద్ధంగా ఉన్న  ఆరు ఆస్పత్రులకు అధికారులు  షోకాజ్‌ నోటీలు జారీచేశారు. అయితే సోమవారం చేపట్టిన తనిఖీలు మాత్రం అందుకు భిన్నంగా కొనసాగడం విశేషం.  కళ్లఎదుట లోపాలను గుర్తించిన తనిఖీ బృందాలు తక్షణ చర్యలకు సాహసించకపోవడం వెనుక ఆంతర్యమేమిటన్న ప్రశ్నలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఏదో అంతర్గత శక్తి అధికారుల చర్యలకు అడ్డుకట్ట వేసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి. కనీస సదుపాయాలు, విద్యార్హత కలిగిన సిబ్బంది లేకుండా ఆస్పత్రులు, ల్యాబ్‌లు యథేచగా కొనసాగిస్తూ రోగుల నుంచి వేలాది రూపాయల బిల్లు వసూలు చేస్తున్న వైద్యమాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

నివేదికతో సరి

డాక్టర్స్‌కాలనీలో సుమారు 93 వరకు ప్రైవేటు ఆస్పత్రులను నడిపి స్తున్నారు. అందులో కొన్ని ప్రభుత్వ వైద్యులకు చెందిన ఆస్పత్రులు  కూడా ఉన్నాయి. వీటన్నింటిని అధికారులు తమ తనిఖీలో గుర్తించారు. అలాగే ఆస్పత్రుల్లో నెలకొన్న అపరిశుభ్ర వాతావరణ పరిస్థితులు, ల్యాబ్‌లో జరుగుతున్న దోపిడీ తదితర అంశాలతోపాటు కొందరు గైనిక్‌ డాక్టర్లు నార్మల్‌ డెలివరీ చేయకుండా సిజేరియన్లనకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని  గుర్తించినప్పటికీ తక్షణ చర్యలు తీసుకునేందుకు అధికారులు సాహసం చేయలేదు. ఆస్పత్రుల పేర్లు, అందులో గుర్తించిన లోపాలపై మాత్రమే నివేదిక తయారు చేశారు. ఈ నివేదికను ఉన్నతాధికారులకు అందజేసి వారి సలహా మేరకే  చర్యలు ఉంటాయని, ప్రత్యక్ష చర్యలు తీసుకునే అధికారం తమ  చేతుల్లో లేదని తనిఖీ బృందాలు వెల్లడించడం గమ నార్హం. ఈ తతంగమంతా చూస్తుంటే తనిఖీలతో సరిపెట్టి శాఖాపరమైన చర్యలకు కాలయాపన చేయాలన్న ఉద్ధేశంతో అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తనిఖీ బృందాల్లో డిప్యూటీ డీఎంహెచ్‌వో కేస రవి, మెడికల్‌ ఆఫీసర్లు ఉపేందర్‌, శ్రీనాథ్‌, సీహెచ్‌వో వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. 




Updated Date - 2022-09-27T07:53:13+05:30 IST