కంటి చూపు మెరుగుపడాలంటే ఏం చేయాలి..?

ABN , First Publish Date - 2020-02-16T17:08:48+05:30 IST

నా వయసు నలభై పైచిలుకు. ఈ మధ్య దృష్టిదోషం పెరుగుతోంది. కంటి చూపు మెరుగుపడాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

కంటి చూపు మెరుగుపడాలంటే ఏం చేయాలి..?

ఆంధ్రజ్యోతి(16-02-2020)

ప్రశ్న: నా వయసు నలభై పైచిలుకు. ఈ మధ్య దృష్టిదోషం పెరుగుతోంది. కంటి చూపు మెరుగుపడాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

- రమణి, పెబ్బేరు 

జవాబు: సాధారణంగా నలభై పైబడిన తరువాత కంటి చూపులో తేడాలు వస్తుంటాయి. ఆహారంలోని పలురకాల విటమిన్లు, ఖనిజాలు (మినరల్స్‌) కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. లుటీన్‌, జియాగ్జాంథిన్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆకుకూరలు, గుడ్లు, బ్రోకలీ, స్వీట్‌ కార్న్‌ ఎక్కువగా తీసుకోవడం ద్వారా... వయసుతో పాటు వచ్చే కంటి వ్యాధుల్ని అదుపులో ఉంచవచ్చని పరిశోధనల్లో తేలింది. విటమిన్‌-సి, విటమిన్‌-ఇ నేత్ర ఆరోగ్యానికి ఎంతో అవసరం. విటమిన్‌-ఎ, బీటా కెరోటిన్‌ అధికంగా ఉండే క్యారెట్లు, ఆకుకూరలు, గింజలు రెటీనాకు రక్షణ కవచంలా పనిచేస్తాయి. జింక్‌ అధికంగా లభించే మాంసాహారం, పాలు, బీన్స్‌... ఆహారంలో భాగం చేసుకుంటే కంటి ఆరోగ్యాన్ని చల్లగా కాపాడుకోవచ్చు. రోజుకు కనీసం అరగంట సేపు వ్యాయామం చేయడం వల్ల.. రక్తప్రసరణ బాగుంటుంది. దీంతో కంటికి చేరే రక్తంలో ఆక్సిజన్‌ పరిమాణం పెరుగుతుంది. అదేపనిగా చదవడం, కంప్యూటర్‌ చూడడం వల్ల కళ్లు మంట పెట్టకుండా ఉండాలంటే ఒకటే మార్గం... పదిహేను ఇరవై నిమిషాలకోసారి 30 సెకెన్ల పాటు కళ్ళు మూసుకోవడం... ఏవైనా దూరంగా ఉన్న వస్తువును చూడడం తదితర నేత్ర వ్యాయామాలు చేయాలి. 

డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, 

వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com

(పాఠకులు తమ సందేహాలను 

sunday.aj@gmail.com కు పంపవచ్చు)

Updated Date - 2020-02-16T17:08:48+05:30 IST