బడిబస్సులపై కన్ను

ABN , First Publish Date - 2022-08-20T05:16:50+05:30 IST

బడిబస్సుల భద్రతలో ఇంకా డొల్లతనం కనబడుతోంది. పాఠశాలలు ప్రారంభమై ఇప్పటికి 45 రోజులు దాటుతున్నా ఇంకా ఫిట్‌నెస్‌ లేకుండా బస్సులు తిప్పుతూ పిల్లల ప్రాణాలతో యాజమాన్యాలు చెలగాటం ఆడుతున్నాయి.

బడిబస్సులపై కన్ను

ప్రత్యేక తనిఖీలకు సిద్ధమైన రవాణాశాఖ అధికారులు

ఇంకా 225 బస్సులకు నో ఫిట్‌నెస్‌

దొరికితే కేసుల నమోదుకు ఆదేశం 

యాజమాన్యాలకు  హెచ్చరికలు జారీ

ఒంగోలు(క్రైం), ఆగస్టు 19: బడిబస్సుల భద్రతలో ఇంకా డొల్లతనం కనబడుతోంది. పాఠశాలలు ప్రారంభమై ఇప్పటికి 45 రోజులు దాటుతున్నా ఇంకా ఫిట్‌నెస్‌ లేకుండా బస్సులు తిప్పుతూ పిల్లల ప్రాణాలతో యాజమాన్యాలు చెలగాటం ఆడుతున్నాయి. గతనెల 5 లోపు అన్ని పాఠశాలల బస్సులు ఫిట్‌నెస్‌ చేయించుకొని రోడ్ల మీద తిరగాల్సి ఉంది. అయితే ఇంకా 225 బస్సులు ఫిట్‌నెస్‌ చేయించుకోలేదు. మొత్తం 1,319 బస్సులు ఉండగా ఇప్పటికి 1,094 మాత్రమే చేయించుకున్నారు. మిగిలినవి రోడ్ల మీద తిరుగుతున్నాయా? లేక కాలం చెల్లితే పక్కన పెట్టారా? అనే అంశంపై రవాణాశాఖకు స్పష్టత కరువైంది. దీంతో వాటి విషయమై ఆరాతీస్తున్నారు. పదిహేనేళ్లు నిండితే బస్సుల కాలం చెల్లినట్లు లెక్క. ఈ మేరకు ఒంగోలు రవాణాశాఖ కార్యాలయంలో స్కూలు బస్సుల యజమానులతో ఇటీవల సమావేశం ఏర్పాటుచేశారు. బస్సులు అన్నీ ఫిట్‌నెస్‌ చేయించారా లేదా అని అడిగారు. ఈ సందర్భంగా ఇంకా 80 బస్సులు మాత్రమే ఫిట్‌నెస్‌ లేకుండా తిరుగుతున్నాయని, మిగిలినబస్సులు కాలం చెల్లినవిగా రవాణా శాఖ అధికారులు అంచనాకు వచ్చారు. అయితే యజమానులు రవాణా శాఖకు తమ వద్ద ఉన్న బస్సులను కాలం చెల్లినవిగా భావిస్తూ వాటిని రోడ్లపైన తిప్పడం లేదని రాతపూర్వంకంగా ఇవ్వాలి. కానీ అలాంటిదేమీ జరగలేదు. దీంతో రవాణా శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలకు సన్నద్ధమయ్యారు. ఫిట్‌నెస్‌ లేకుండా బస్సులు తిరిగితే కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు.  సంబంధిత పాఠశాల యజమానులకు కూడా బస్సులు తిప్పకూడదని హెచ్చరికలు జారీచేశారు. అలాంటి బస్సులు రోడ్లపైన కనబడితే కఠిన చర్యలకు సిద్ధమయ్యారు.


ప్రత్యేక డ్రైవ్‌ చేపడతాం

 కృష్ణవేణి, డీటీసీ

స్కూలు బస్సులపై ప్రత్యేక కార్యాచరణకు సిద్ధమయ్యాం. ఫిట్‌నెస్‌ లేకుండా బస్సులు   రోడ్ల మీదకు వస్తే కేసులు నమోదు  చేస్తాం. ఇంకా 225 బస్సులు ఫిట్‌నెస్‌ లేకుండా ఉన్నాయి. వాటిలో 80మాత్రమే తిరుగుతున్నట్లు, మిగిలినవి కాలం చెల్లినవిగా తేలింది. అయితే యజమానులు అవి కాలంచెల్లినవంటూ మా కార్యాలయంలో రాత పూర్వకంగా ఇవ్వాలి. అలాంటప్పుడే అవి కాలం చెల్లినవిగా భావిస్తాం. 


Updated Date - 2022-08-20T05:16:50+05:30 IST