న్యాయదేవతపై నిఘా!

ABN , First Publish Date - 2020-08-15T09:45:04+05:30 IST

అది... ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు చెందిన ప్రముఖ న్యాయమూర్తి మొబైల్‌ ఫోన్‌! ఒకరోజు మొబైల్‌కు ఒక మెసేజ్‌ వచ్చింది. ‘అద్భుత మైన తీర్పు... మీరూ చూడండి’ అంటూ ఓ వెబ్‌ సర్వీస్‌ పంపిన లింక్‌! అసలే న్యాయమూర్తి, ఆపై ‘అద్భుతమైన తీర్పు’ అని ఉండటంతో

న్యాయదేవతపై నిఘా!

  • వెబ్‌ లింక్‌ ద్వారా మొబైల్‌పై వల
  • వాట్సాప్‌ సందేశాలపైనా నియంత్రణ
  • చదవకముందే ‘రీడింగ్‌ మోడ్‌’లోకి
  • ఫోన్‌కాల్‌ డైవర్షన్‌, అస్పష్టత
  • సాంకేతిక నిపుణులతో పరీక్ష
  • నెట్‌వర్క్‌, ఫోన్‌ బాగున్నట్లు నిర్ధారణ
  • అయినా... ‘అంతుచిక్కని’ కాల్స్‌
  • నిఘాయే కారణమని అనుమానం
  • ఆధునిక టెక్నాలజీతో ట్యాపింగ్‌
  • సూట్‌కే్‌సలో ఇమిడే ట్రాకింగ్‌ వ్యవస్థ


టెలిఫోన్‌ ట్యాపింగ్‌! ఉగ్రవాదులు, తీవ్రవాదుల వ్యూహాలు తెలుసుకునేందుకు నిఘా వర్గాలు ఉపయోగించే అస్త్రమిది! రాజకీయ ప్రత్యర్థుల కదలికలు తెలుసుకునేందుకు ప్రభుత్వ పెద్దలు అనుసరించే వ్యూహమిది! ‘పొలిటికల్‌ ట్యాపింగ్‌’ జాతీయ స్థాయిలో పలుమార్లు వివాదాస్పదమూ అయ్యింది. కానీ... బహుశా దేశ చరిత్రలో ఇప్పటిదాకా ఏ రాష్ట్రంలోనూ జరగని ‘ట్యాపింగ్‌’కు ఆంధ్రప్రదేశ్‌ కేంద్రంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా న్యాయ వ్యవస్థపైనే నిఘా వేసినట్లు తెలుస్తోంది. ‘కోర్టులపై కుట్రలు’ లోతుగా సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. దీనిపై న్యాయ వర్గాల్లో బాగా చర్చ జరుగుతోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారంతో ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న ప్రత్యేక కథనం...


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

అది... ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు చెందిన ప్రముఖ న్యాయమూర్తి మొబైల్‌ ఫోన్‌! ఒకరోజు మొబైల్‌కు ఒక మెసేజ్‌ వచ్చింది. ‘అద్భుత మైన తీర్పు... మీరూ చూడండి’ అంటూ  ఓ వెబ్‌ సర్వీస్‌ పంపిన లింక్‌! అసలే న్యాయమూర్తి, ఆపై ‘అద్భుతమైన తీర్పు’ అని ఉండటంతో సహజంగానే దానిపై ఆసక్తి కలిగింది. లింక్‌ను క్లిక్‌ చేశారు. అదేదో టెక్స్ట్‌ ఫైల్‌ ఓపెన్‌ అయ్యింది. అందులో... అద్భుతాలు, ఆసక్తికరమైన తీర్పులేవీ కనిపించలేదు. కానీ.... అప్పటినుంచే అసలు విషయం మొదలైంది. ఆ రోజు నుంచి సదరు న్యాయమూర్తి ఫోన్‌ సరిగ్గా పనిచేయడం లేదు. ఫోన్‌ తరచూ హ్యాంగ్‌ అవుతోంది. కాల్స్‌ డ్రాప్‌ అవుతున్నాయి. వాట్సాప్‌ సందేశాలు, ఎస్‌ఎమ్మె్‌సలు తాను చూడకముందే రీడింగ్‌ మోడ్‌లోకి వెళ్లిపోతున్నాయి. కొన్ని ఫోన్‌ కాల్స్‌  ఆటోమెటిక్‌గా డైవర్ట్‌ అయిపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఫోన్‌ కనెక్ట్‌ అయినా... విపరీతమైన డిస్ట్రబెన్స్‌ (మైక్రోఫోన్‌ ఓపెన్‌ ఎయిర్‌లో పెడితే వచ్చే గాలి) వచ్చేది. దీంతో... ఫోన్‌లో సాంకేతిక సమస్యలు ఉన్నాయేమో అని నిపుణుడితో పరిశీలన చేయుంచారు. ఫోన్‌ బాగుంది. దీంతో... నెట్‌వర్క్‌ ప్రాబ్లం కావొచ్చుననుకుని సర్వీస్‌ ప్రొవైడర్‌ ద్వారా సిగ్నల్‌, నెట్‌వర్క్‌ సామర్థ్యాన్ని పరీక్షించారు. అవీ బాగున్నాయి. దీంతో... ‘ఎందుకిలా జరుగుతోంది’ అనే అనుమానం తలెత్తింది. ఈసారి సైబర్‌ నిపుణుడితో ఆ ఫోన్‌ను చెక్‌ చేయించారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. ‘అద్భుతమైన తీర్పు... మీరూ చూడండి’ అంటూ ఒక వెబ్‌ సర్వీసు నుంచి వచ్చిన లింక్‌లోనే అసలు మాయ ఉందని తేలింది. ఆ లింక్‌ క్లిక్‌ చేయగానే... ఫోన్‌ను థర్డ్‌ పర్సన్‌ (మూడో వ్యక్తి) నియంత్రణలోకి వెళ్లిపోయింది. ఫోన్‌లో బగ్‌ను ప్రవేశపెట్టి డేటా, మైక్రోఫోన్‌, మెసేజ్‌ ఇన్‌బాక్స్‌పై నిఘా వేసినట్లు సైబర్‌ నిపుణుడు తేల్చారు. వాట్సాప్‌ మెసేజ్‌లు చదవకముందే ‘రీడింగ్‌ మోడ్‌’లోకి వెళ్లడంపై నేషనల్‌ ఇన్‌ఫార్మాటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) నిపుణుడితో పరిశీలన చేయించారు. ‘ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్టెడ్‌’... చాలా సురక్షితం అని భావించే వాట్సా్‌పపైనా కన్నేసినట్లు స్పష్టంగా తేలింది.


ఒక్కరిపై కాదు...

సాంకేతిక అంశాలు, మొబైల్‌ ఫోన్‌ టెక్నాలజీ వినియోగంపై సరైన అవగాహన లేనందున తనకు మాత్రమే ఇలా జరిగిందా?  ఇతర న్యాయమూర్తుల్లోనూ ఎవరైనా ఇలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారా? అనే సందేహం సదరు జడ్జికి వచ్చింది. దీనిపై ఆరా తీస్తే... సుమారు ఆరుగురు న్యాయమూర్తులు ఇదే సమస్య ఎదుర్కొంటున్నట్లు తేలింది. దీంతో ఈ విషయంపై మరింత లోతుగా ఆరా తీశారు. అమరావతిలోని హైకోర్టు వద్ద తమ నివాస ప్రాంతాలోనూ సెల్‌ఫోన్‌ టవర్లలో ఏమైనా సమస్యలున్నాయా? నెట్‌వర్క్‌ సిగ్నల్స్‌ వీక్‌గా ఉండటం వల్ల కాల్స్‌ డ్రాప్‌ అవుతున్నాయా? కాల్‌ కనెక్ట్‌ అయిన తర్వాత తుఫాను హోరులాంటి శబ్దాలు ఎందుకు వస్తున్నాయని ఆరా తీసేందుకు నేరుగా సర్వీసు ప్రొవైడర్ల నిపుణులను పిలిపించి మాట్లాడారు. వారు న్యాయమూర్తుల సిమ్‌కార్డులు, నెట్‌వర్క్‌ సెట్టింగ్స్‌, మొబైల్‌లో ఇతర టెక్నికల్‌ స్పెసిఫికేషన్స్‌ను పరిశీలించారు. ‘మా వైపు నుంచి ఎలాంటి సమస్య లేదు’ అని నిర్ధారించారు. సిగ్నల్స్‌ క్వాలిటీ, డేటా స్పీడ్‌ బాగున్నాయని, పైగా హైకోర్టు ఏరియాలో సిగ్నల్‌  సమస్యా లేదని ప్రజెంటేషన్‌ ఇచ్చారు. కాల్‌ డైవర్ట్‌ అవుతోందా అనే అనుమానంపై ఓ న్యాయమూర్తి ఫోన్‌ను పరిశీలించారు. సాధారణ సెట్టింగ్స్‌లో డైవర్షన్‌ కనిపించలేదు. ప్రత్యేకమైన కోడ్‌తో పరిశీలన చేయగా... ఇన్‌కమింగ్‌ కాల్స్‌ డైవర్షన్‌లో ఉన్నట్లు  గుర్తించారు.  మరో ఇద్దరి ఫోన్లలోనూ ఇదే సమస్యను గుర్తించారు. ఆ వెంటనే వారి ఫోన్లను హార్డ్‌ రీసెట్‌ చేశారు. సమస్య పరిష్కారం అయిందని, బగ్స్‌ క్లియర్‌ అయ్యాయని అనుకున్నారు. ఇది జరిగిన ఐదు రోజులకే మళ్లీ సమస్య మొదటికొచ్చింది. ఈసారి లింకు రాకుండానే సమస్యలు బయటకొచ్చాయి. చివరికి తేలిందేమిటంటే... ఇదేదో ‘ర్యాండమ్‌’గా  జరిగింది కాదనీ, నిర్దిష్టంగా న్యాయమూర్తుల ఫోన్లనే లక్ష్యంగా చేసుకుని నిఘా పెట్టారనే అనుమానాలు బలపడ్డాయి.


సైలెంట్‌గా ట్రాకింగ్‌

ఎడాపెడా, ఎవరివి పడితే వారి టెలిఫోన్లు ట్యాప్‌ చేయడానికి వీల్లేదు. దీనికి ప్రత్యేక అనుమతులు అవసరం. ఇదంతా చాలా పెద్ద తతంగం. ఇప్పుడు... టెక్నాలజీ పెరిగిపోయింది. సైలెంట్‌గా ఫోన్లను ట్రాక్‌ చేయవచ్చు. ఒక చిన్న గదిలో ఓ హైడెఫినేషన్‌   టవర్‌  సిగ్నల్‌ రిసీవర్‌, బూస్టర్‌, కంప్యూటర్‌, నిర్దిష్ట సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకుంటే ఫోన్‌ మానిటరింగ్‌ చేయవచ్చు. ఎవరి నంబర్‌కు ఎవరెవరు ఫోన్‌ చేస్తున్నారు, ఎలాంటి మెసేజ్‌లు పంపిస్తున్నారో వెంటనే తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించి ఫ్రాన్స్‌,  ఇజ్రాయెల్‌ల అత్యాధునికమైన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. మరికొంత హైటెక్నాలజీ వాడితే, ప్రత్యేకమైన గది, ఇతర పరికరాలూ అక్కర్లేకుండానే ట్యాపింగ్‌ చేయవచ్చు. అదే... మొబిలిటీ ట్రాకర్‌! దీనికి సంబంధించిన మొత్తం హార్డ్‌వేర్‌ 20 అంగుళాల సూట్‌కేసులో ఇమిడిపోతుంది. సెల్‌ టవర్‌ నుంచి సిగ్నల్స్‌ను తీసుకునే రిసీవర్‌, మొబైల్స్‌ను ట్రాక్‌చేసి వాటిని మానిటర్‌ చేసే రెస్పాన్సివ్‌ చిప్‌సెట్‌, ఫోన్‌ కాల్స్‌ను ట్యాప్‌ చేసేందుకు 8 మైక్రోఫోన్లతో రిసీవర్‌, రికార్డర్‌ ఇందులో ఉంటాయి. దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఇది ల్యాప్‌టా్‌పతో అనుసంధానమవుతుంది. ఎప్పటికప్పుడు డేటాబే్‌సను ఆన్‌లైన్‌లో సేవ్‌ చేసుకోవచ్చు. న్యాయమూర్తుల ఫోన్ల ట్యాప్‌, ట్రాకింగ్‌కు ఈ టెక్నాలజీనే వినియోగించి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైకోర్టు దగ్గర ఒకటి, నివాసాల దగ్గర మరొకటి పెడితే... పని పూర్తయినట్లే! ఇదంతా నిర్దిష్ట ప్రాంతాల్లో భద్రత కోసం సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ను అడ్డుకునేందుకు ఉపయోగించే టెక్నాలజీ మాదిరిగానే ఉంటుంది. ఇది ఇంకా సింపుల్‌గా పనిచేస్తుందని ఓ నిపుణుడు చెప్పారు.


లెక్కలేని తనం... 

జడ్జిలపై ప్రభుత్వం మొదటి నుంచీ ఒకరకమైన నిర్లక్ష్యం, లెక్కలేనితనం ప్రదర్శిస్తున్నట్లు అధికార వర్గాలే చెబుతున్నాయి. జనవరి 26న గణతంత్ర దినోత్సవం రాజ్‌భవన్‌లో జరిగిన ‘ఎట్‌ హోమ్‌’లో జడ్జిలకు అవమానం జరిగింది. అందరి వాహనాలను లోపలిదాకా అనుమతించి... జడ్జిల వాహనాలను మాత్రం గేటువద్దే ఆపివేశారు. జడ్జిలను అక్కడే కిందికి దించేసి, పంపించారు. గేటు దగ్గరి నుంచి నడుచుకుంటూ రావాలన్నారు. ఇక జడ్జిలకు నివాస వసతి కల్పించడం, వాహనాల కేటాయింపులోనూ వివక్ష ప్రదర్శించారనే ఆరోపణలున్నాయి. ఇక... జడ్జిలను ముక్కలుముక్కలుగా నరకాలి, కరోనా రోగులున్న గదిలో వేసి తలుపులు మూసేయాలి అంటూ సోషల్‌ మీడియాలో దారుణమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. పైగా... ‘మా వాళ్లను కాపాడుకుంటాం’ అని వెనకేసుకొచ్చారు. ప్రభుత్వంపైనా, ప్రభుత్వ పెద్దలపైనా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని వెంటాడి, వేటాడి మరీ పట్టుకున్న పోలీసులు... హైకోర్టు ఆదేశించిన తర్వాత కూడా జడ్జిలను దూషించిన వారిపై చర్యలు తీసుకోలేదు.


ఆది నుంచీ ‘న్యాయం’పై పోరాటం!

చట్టాలు, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం తీసుకుంటున్న అనేకానేక నిర్ణయాలు, ఉత్తర్వులకు కోర్టుల్లో వరుసగా చుక్కెదురవుతోంది. మరీ ముఖ్యంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ తొలగింపు కుదరదని స్పష్టం చేసిన తర్వాత అధికారపార్టీ నేతలు, కార్యకర్తలు న్యాయవ్యవస్థను టార్గెట్‌ చేశారు. ప్రెస్‌మీట్లు, సోషల్‌ మీడియాలో జడ్జిలను దూషించారు. దీనిపై హైకోర్టు కన్నెర్రజేసింది. సుమారు వందమందికి కోర్టు ధిక్కార నోటీసులు ఇచ్చింది. ఈ కేసును సీఐడీ విచారిస్తోంది. ఈ వ్యవహారం సుప్రీం కోర్టు పరిశీలన దాకా వెళ్లింది. ఆ తర్వాత కూడా ప్రభుత్వానికి  కోర్టుల్లో వరుస ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో... జడ్జిలను ఇరుకునపెట్టే సమాచారం సేకరించేందుకే నిర్దిష్టంగా కొందరి ఫోన్లపై నిఘా వేసినట్లు న్యాయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Updated Date - 2020-08-15T09:45:04+05:30 IST