ఉప్పొంగిన ఉత్సాహం

ABN , First Publish Date - 2022-08-17T05:58:48+05:30 IST

జిల్లా వ్యాప్తంగా జాతీయ భావం ఉప్పొంగింది. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మంగళవారం సామూహికంగా జాతీయ గీతం జనగణమనను ఆలపించారు. సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు ఉదయం 11:30 గంటలకు నిమిషం పాటు జాతీయ గీతాలపన కార్యక్రమం నిర్వహించారు.

ఉప్పొంగిన ఉత్సాహం
సిరిసిల్లలో సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొన్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఎస్పీ రాహుల్‌హెగ్డే

 - జిల్లాలో సామూహికంగా జాతీయ గీతాలాపన 

- జనగణమనతో మార్మోగిన పల్లెలు, పట్టణాలు

సిరిసిల్ల, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా జాతీయ భావం ఉప్పొంగింది. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మంగళవారం సామూహికంగా జాతీయ గీతం జనగణమనను ఆలపించారు. సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు ఉదయం 11:30 గంటలకు నిమిషం పాటు  జాతీయ గీతాలపన కార్యక్రమం నిర్వహించారు. సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పట్టణాలు, పల్లెల్లోని ప్రధాన కూడళ్లు జనగళమున  జనగణమనతో మార్మోగాయి.  అమరుల త్యాగాల స్ఫూర్తిని మది నిండా నింపుకొని ఉత్సాహంగా ఆలపించారు.    మున్సిపల్‌, పోలీస్‌ శాఖ సహకారంతో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సామూహికంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. సిరిసిల్లలో కొత్త చెరువు బండ్‌ పార్కు వద్ద   కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఎస్పీ రాహుల్‌హెగ్డే,  మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, డీఈవో రాధాకిషన్‌, నర్సింగ్‌ కళాశాల విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌, ఆర్డీవో శ్రీనివాసరావు, ఏవో గంగయ్య, ప్రభుత్వ శాఖల అధికారులు గీతాలాపనచేశారు. అంబేద్కర్‌ చౌరస్తా వద్ద జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, అదనపు ఎస్పీ చంద్రయ్య, సీఐలు, జడ్పీ సీఈవో గౌతంరెడ్డి, సెస్‌ చైర్మన్‌ ప్రవీణ్‌, తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, విద్యార్థులు, కౌన్సిలర్లు విద్యానగర్‌ చౌరస్తా వద్ద మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి, కౌన్సిలర్లు, స్వశక్తి సంఘాల మహిళలు, గాంధీచౌక్‌ వద్ద వివిధ పాఠశాలల విద్యార్థులు భారీ జాతీయ పతాకంతో గీతాలాపన చేశారు.  రైతు బందు సమితి కో ఆర్డినేటర్‌ గడ్డం నర్సయ్య,  కౌన్సిలర్లు, అధికారులు, వ్యాపారులు సామూహిక గీతాలాపనలో పాల్గొన్నారు. వివిధ వార్డుల్లో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, కౌన్సిలర్లు గీతాలాపన చేశారు. జిల్లా కేంద్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రధాన కూడళ్ల వద్దకు వచ్చి గీతాలాపన చేశారు. గీతాలాపనతో వజ్రోత్సవ సందడి కనిపించింది. 

వేములవాడలో..

 వేములవాడ:  పోలీసు శాఖ, వేములవాడ పురపాలక సంఘం ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని  పలు చోట్ల జాతీయ గీతాలపన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా  రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం ముందుభాగంలో, తెలంగాణ చౌక్‌, కోరుట్ల బస్టాండ్‌, అమరవీరుల స్తూపం తదితర ప్రధాన కూడళ్లలో  జాతీయ గీతాలాపనలో పాల్గొన్నారు.  రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం వద్ద మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రామతీర్థపు మాధవి, డీఎస్పీ కే.నాగేంద్రచారి, మున్సిపల్‌ కమిషనర్‌ శ్యాంసుందర్‌రావు, పట్టణ సీఐ  వెంకటేశ్‌, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఉదయం 11.30 గంటలకు జాతీయ గీతాన్ని ఆలాపించారు.   అనంతరం డీఎస్పీ నాగేంద్రచారి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రామతీర్థపు మాధవి మాట్లాడుతూ స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరమని, ఈ వేడుకలకు ప్రతి ఒక్కరూ తరలిరావడం ఆనందంగా ఉందని అన్నారు. సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొనడానికి వీలుగా ఆలయ పరిసరాలు, జాత్రాగ్రౌండ్‌లోని దుకాణాల యజమానులు తమ దుకాణాలను కొంతసేపు మూసి ఉంచారు. రూరల్‌ సీఐ బన్సీలాల్‌, ఎస్సైలు వెంకట్రాజం, శ్రీనివాస్‌, మున్సిపల్‌ మేనేజర్‌ సంపత్‌రెడ్డి, ఏఈ నర్సింహచారి, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, పాత్రికేయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

 

దేశ చరిత్రలో అద్భుత ఘట్టం 

స్వతంత్ర భారత వజ్రోత్సవాలు, సామూహిక గీతాలాపన దేశ చరిత్రలో ఒక అద్భుత ఘట్టమని  కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని, వేడుకలు నిర్వహించడం గర్వంగా ఉందని అన్నారు. స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన పోరాట యోధుల్ని స్మరించుకోవడం మన బాధ్యతన్నారు. స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని భవిష్యత్‌ తరాలకు తెలియజేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 22 వరకు స్వతంత్ర భారథ వజ్రోత్సవాలకు రూపకల్పన చేశారన్నారు. 

మహానీయులను స్మరించుకోవాలి

స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన మహానీయులను స్మరించుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యతని  ఎస్పీ  రాహుల్‌హెగ్డే అన్నారు. జిల్లాలో నిర్వహిస్తున్న వజ్రోత్సవాల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారన్నారు. జాతీయ గీతం, జాతీయ పతాకం, చిహ్నాలను గౌరవించుకుంటూ భారత్‌ను గొప్ప దేశంగా ముందుకు తీసుకవెళ్లేందుకు ప్రతీ ఒక్కరు సంకల్పంగా తీసుకోవాలని అన్నారు. 




Updated Date - 2022-08-17T05:58:48+05:30 IST