విపత్తులోనూ విపరీతబుద్ధులు!

ABN , First Publish Date - 2020-07-16T06:07:04+05:30 IST

ఊరుమ్మడి కష్టం వచ్చినప్పుడు పొరపొచ్చాలు మాని అంతా ఒకటి అవుతారు. కరువూ కాటకం కాటు వేసినప్పుడు, వాగూవరదా ముంచుకువచ్చినప్పుడు పాతపగలు వాయిదా పడతాయి...

విపత్తులోనూ విపరీతబుద్ధులు!

‘‘సంప్రాప్తే, సన్నిహితే కాలే’’ కూడా ఆంక్షలను, వ్యూహాలను మాత్రమే జపం చేసే నేతలు లోకాన్నేమి రక్షిస్తారు?


కరోనా పై పోరాటాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నించింది. కొంత మార్గదర్శనం అందించింది. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. తరువాత నిర్వ్యాపకమై, నిందను రాష్ట్రాలపై మోపడం మొదలుపెట్టింది. వచ్చే సాధారణ ఎన్నికలకు ఈ కరోనా స్థితిని ఎట్లా ఆలంబన చేసుకోవాలి లేదా; జమిలి ఎన్నికలను రెండేళ్లలోనే నిర్వహిస్తే, అందుకు చేసుకోవలసిన సన్నాహాలు ఏమిటి? ప్రస్తుత విపత్కర పరిస్థితిని ఆసరా చేసుకుని మరిన్ని కీలకమైన తీవ్రచర్యలు ఎట్లా తీసుకోవచ్చు? ఉద్వేగపూరిత అంశాలను ఏవి ముందుకు తేవాలి? – వంటి అంశాలపై కూడా వ్యూహకర్తలు యోచిస్తున్నారా? యోచిస్తున్నారో లేదో తెలియదు కానీ, రానున్న ఒకటి రెండు మాసాల్లో పతాకస్థాయికి వెళ్లే కరోనా వ్యాప్తి విషయంలో ఏమి విరుగుడు చేయాలన్నదానిపై మాత్రం ఏ ఆలోచనా జరగడం లేదు. 


ఊరుమ్మడి కష్టం వచ్చినప్పుడు పొరపొచ్చాలు మాని అంతా ఒకటి అవుతారు. కరువూ కాటకం కాటు వేసినప్పుడు, వాగూవరదా ముంచుకువచ్చినప్పుడు పాతపగలు వాయిదా పడతాయి. అమాయకులు చెప్పుకునే మంచిమాటలు అవి. లోకంలో మంచివాళ్లదే మెజారిటీ అనుకుందాం. కానీ, పుడకలతో కూడా పోని పాడుబుద్ధుల మనుషులు మనకు తెలుసు. చావుల నడుమ కూడా అంగడిబేరాలు చేసే వాళ్లు, గృహదహనాల కాంతిలో సంబరాలు చేసుకునే వారు కూడా మనకు తెలుసు. వాళ్లు తక్కువ మందే అయినా వారి చేతిలో రకరకాల రాజ్యాలున్నాయని మనకు తెలుసు. 


పక్కవారి మీద బాధ్యతతో కాకపోయినా, ప్రళయవేళ అనివార్యమైన వైరాగ్యంతో అయినా, మనుషులు స్వార్థ తాపత్రయాన్ని వదలాలి కదా, జీవితపు క్షణికత సకల ప్రలోభాలను తుత్తునియలు చేయాలి కదా, అట్లా జరగడం లేదు. ఒక క్రిమి కూడా కాని క్రిమి, మానవజాతినంతటినీ చుట్టబెట్టి, కోట్లాది మరణాలను సృష్టించి, కలయికలకీ, కదలికలకీ ఆస్కారం లేని నిర్బంధ జీవితాన్ని రచించినప్పుడు, మానవ సమాజాలను శాసిస్తున్న శక్తులకు మరొక ధ్యాస ఉండకూడదు. ఆ విషక్రిమికి వృద్ధులను, దీర్ఘరోగులను ఆహారంగా విసిరేయడం కాక, ఒక ప్రాణం కూడా పోనివ్వకుండా మానవకుడ్యం నిర్మించగలగాలి. పేర్చుకున్న నిల్వలను కరిగించి, యుద్ధకాలంలో పంచగలగాలి. ఆరోగ్యం నుంచి వ్యాపారాన్ని తుడిచిపెట్టగలగాలి.


కానీ, యుద్ధం జరుగుతున్నదో లేదో తెలియదు. యెన్ని బళ్ల కళేబరాల తరువాత బకుడి ఆకలి తీరుతుందో తెలియదు. సమస్తాన్నీ స్తంభింపజేసి, గురిచూసి బరిమీద నిలవవలసిన నేతలు, విధికి, అనివార్యతకు జేజేలు పలికి, తిరిగి యథావిధి ఏలుబడి సాగిస్తున్నారు. ప్రపంచాధినేతలు సామ్రాజ్యదాహాన్ని వదలలేదు. బక్కదేశాల మీద ఉక్కుపిడికిలి సడలించలేదు. ఇరుగుపొరుగుల దేశాలు హద్దులపై పిడిగుద్దుల యుద్ధాలు చేసుకుంటున్నాయి. అదును చూసి ఆక్రమణలు చేయాలని కొన్ని, ఇదే అదునుగా దేశంలోపల ప్రత్యర్థుల మీద పైచేయి కావాలని మరికొన్ని వ్యూహరచన చేస్తున్నాయి. వైరస్‌ పేరు చెప్పి విపరీతాధికారాలను భుక్తం చేసుకోవడం, మనుషుల అంతరాంతరంగాలలోకి చొరబడే సాధనాలను రూపొందించడం– ఈ జబ్బు ముగిశాక, మరో కొత్త జబ్బు మానవజీవితాన్ని ఆవరించేట్టు కనిపిస్తున్నది. 


కరోనా యుద్ధం మొదలుగాక ముందే అమెరికాకు ఓటమి ఎదురయింది. ఇది ప్రపంచవ్యాప్త ఉపద్రవమైనా, దాని మీద పోరాటానికి ఒక ప్రపంచస్థాయి నాయకత్వం ఏదీ లేదు. కరోనాపై పోరులో అమెరికాను ఎవరూ నేతగా గుర్తించడం లేదు. గతంలో పోలియో, మశూచి వంటి వ్యాధుల సందర్భంగా, అగ్రరాజ్యాలుగా ఉన్న అమెరికా, సోవియెట్‌ యూనియన్‌ రెండూ సహకరించుకుని, ప్రపంచవ్యాప్తంగా వాటిని నిర్మూలించడానికి పనిచేశాయి. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన సమయానికే, హెచ్‌ఐవి ప్రమాదం వచ్చింది. దానిపై యుద్ధం చేసే బాధ్యతను అమెరికా తనంతట తానే స్వీకరించింది. ఇటీవలి స్వైన్‌ఫ్లూ, ఎబోలా వంటి వ్యాధుల విషయంలో కూడా కొద్దిపాటి తేడాతో అమెరికాయే చొరవ చూపింది, సహాయాలు చేసింది. కానీ, కరోనా సమయానికి– అమెరికా నాయకత్వస్థానంలో లేదు. అందుకు విదూషక ట్రంప్‌ నాయకత్వం మాత్రమే కారణం కాదు. ఏకధ్రువప్రపంచం, ఏకైక ప్రపంచ అగ్రరాజ్యం అని చెప్పుకున్నట్టుగా– ఇప్పుడు పరిస్థితి లేదు. చాలా మారింది. అనేక గ్లోబల్‌ శక్తిపీఠాలు ఏర్పడ్డాయి. సాంకేతికంగా, ఇప్పటికీ అమెరికాయే పెద్ద సైనిక శక్తీ, ఆర్థిక శక్తీ అయి ఉండవచ్చు. కానీ, నాయకత్వ శక్తి మాత్రం కాదు. అగ్రస్థాయి లేదన్నట్టుగానే ట్రంప్‌ ప్రవర్తన కూడా ఉండింది. వైద్య, ఆరోగ్య సామగ్రిని ఇతర దేశాలనుంచి, అదీ చైనా నుంచి దిగుమతి చేసుకోవలసిన పరిస్థితి అమెరికాది. కెనడా తెప్పించుకుంటున్న మాస్కులు, పిపిఇలను దారిమళ్లించి, అధికధర చెల్లించి అమెరికా రప్పించుకుంది. నిన్నమొన్నటి దాకా ముక్కుమీద ముసుగు కూడా కప్పని అమెరికా అధ్యక్షుడు, కరోనా కాలంలో ప్రజాదరణను గణనీయంగా కోల్పోయాడు. వచ్చే నవంబర్‌లో ఎన్నికలకు వెడుతున్న అమెరికాలో, ప్రతిపక్ష అభ్యర్థి పరిస్థితి ప్రస్తుతానికి మెరుగుగా ఉందంటున్నారు. తిరిగి ఆదరణను పెంచుకోవడానికి చైనా వ్యతిరేకతపైన, వలస ఉద్యోగులను, వలస విద్యార్థులను తిప్పిపంపడం పైన ట్రంప్‌ ఆధారపడుతున్నారు. ట్రంప్‌ని మళ్లీ గెలిపించాలా, ఈ సారి ఇంకొకరికి అవకాశమివ్వాలా అని తర్జన భర్జన పడుతున్నాడు పుతిన్‌. జిన్‌పింగ్‌, పుతిన్‌ మాదిరిగా ఇష్టమొచ్చినంత కాలం అధికారంలో ఉండే ఏర్పాట్లు చేసుకోవడం గురించి ప్రపంచంలో చాలా మంది నేతలకు ఊహలు కలుగుతున్నాయి.


చావెజ్‌ కాలంలోనే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న వెనెజులా, అనంతర అధ్యక్షుడు మదురో హయాంలో మరిన్ని కష్టాలను ఎదుర్కొంటున్నది. ఎన్నికలలో మదురో గెలుపును గుర్తించబోమని, అమెరికా ఆంక్షలను మరింత పెంచింది. మదురో ప్రత్యర్థిని ప్రోత్సహిస్తున్నది. కరోనా కాలం మదురో కూడా ఉపయోగపడింది. ఎవరి చేతిలో ప్రభుత్వ యంత్రాంగం ఉన్నదో, ఎవరు శాసించగలుగుతున్నారో ప్రజలకు స్పష్టంగా తెలిసిన తరువాత, తటస్థంగా ఉండిపోయిన అనేకులు మదురో వ్యతిరేకతను తగ్గించుకున్నారు. కరోనా కాలంలో, పాత వైరాన్ని పక్కనబెట్టి ఉదారంగా ఉండవలసింది పోయి, అమెరికా, వెనెజులాకు అందవలసిన వైద్య, ఔషధ దిగుమతులను కూడా అడ్డుకుంటున్నది. వెనెజులా నుంచి ఎవరూ చమురు కొనగూడదు. చమురు కొంటే, ఆ చమురు రవాణా చేసే ఓడలకు బీమా దొరకదు. అసలు ఏ రవాణా నౌకా అందుబాటులో ఉండదు. వెనెజులా నుంచి, వెనెజులాకు వెళ్లడానికి నౌకలే దొరకకుండా అడ్డుకుంటున్నది అమెరికా. వెనెజులా విషయంలోనే కాదు, ఇరాన్‌పై కూడా అమెరికా వైఖరి ఇదే. కరోనా తీవ్రత అతి ఎక్కువగా ఉన్నదేశాలలో ఇరాన్‌ ఒకటి. అమెరికా ఆంక్షల కారణంగా ఆ దేశానికి అంతర్జాతీయ మార్కెట్‌ అందుబాటులో లేకుండా పోయింది. వెనెజులాకు రష్యా, ఇరాన్‌కు చైనా సహాయంగా ఉంటున్నాయి. లేకపోతే, ఆ దేశాలు మరింత సంక్షోభాన్ని చవిచూసేవి. క్యూబా మీద ద్వేషం కూడా అమెరికా పాతజబ్బుల్లో ఒకటి. తన దేశంలో ఉన్న వైద్యులను 30 దేశాలకు సహాయంగా పంపి, కరోనా పోరాటంలో ఒక యోధురాలి వలె పనిచేస్తున్నది క్యూబా. డాక్టర్లను పంపడం మానవఅక్రమరవాణాగా భావించాలని అమెరికా ఫిర్యాదు చేస్తోంది. 


సుమారు వంద దేశాల్లో కరోనా సందర్భాన్ని ఏదో ఒక అత్యవసర పరిస్థితి ప్రకటనకు ఉపయోగించుకున్నారు. హంగేరీ లో అయితే, దాదాపు సైనికపాలన వంటి స్థితి, డిక్రీ ద్వారా పాలన. చట్టసభల ఆమోదం అక్కరలేదు, కోర్టుల నిర్ధారణా అక్కరలేదు. కరోనా వ్యాప్తి సమయంలో, భయాందోళనలో చైనా ప్రధానభూభాగం నుంచి తమ దగ్గరకు తరలివస్తారని హాంకాంగ్‌ ప్రజలు ఆందోళన చెందారు. ఎవరినీ అనుమతించవద్దని కోరారు. కరోనా ఉద్రిక్తసందర్భాన్ని ఉపయోగించుకుని చైనా హాంకాంగ్‌ ప్రజలకు వ్యతిరేకంగా నల్లచట్టాన్ని తెచ్చింది. చైనాతో అంతంత మాత్రం సంబంధాలున్న భారత్‌ నల్లచట్టం విషయంలో మాత్రం అభ్యంతరం చెప్పలేదు. గాల్వన్‌లోయలో భారత–చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ, ఉభయులకూ నష్టాన్ని కలిగించింది, అంతకంటె, ఎక్కువగా ఉభయదేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ లోగా భారత్‌–నేపాల్‌ సంబంధాలూ దెబ్బతినడం మొదలయింది. పొరపాటు వ్యూహమో, ఆదమరచి ఉండడమో కానీ, ఛాబహార్‌ ఓడరేవు నుంచి రైలుమార్గం నిర్మాణం ప్రాజెక్టును ఇరాన్‌ భారతదేశం నుంచి చైనాకు మళ్లించింది. మరొక మిత్రదేశం కూడా మనకు దూరమయిందా?


బయటిప్రపంచంతో సంబంధాలను తన వాక్చాతుర్యంతో, వ్యక్తిత్వ ప్రభతో నిర్వహించగలననుకునే నరేంద్రమోదీ, ఎందువల్ల అకస్మాత్తుగా ఒంటరిగా కనిపిస్తున్నారు? ఇంతకీ కరోనా కాలంలో భారత్‌ ఏమి చేస్తున్నది? పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమించినవారి మీద వరుస కేసులు, స్త్రీపురుష వృద్ధ విచక్షణ లేకుండా నిర్బంధాలు, కరోనా చికిత్సకు అవరోధంగా ఉన్నదని చెబుతున్నా కశ్మీర్‌లో ఇంటర్నెట్‌ సేవలను కూడా నియంత్రించడం, ప్రతిపక్షరాష్ట్రాలపై నిఘా, వీలయితే అధికార ఫిరాయింపులు, ఏ చర్చా లేకుండానే కీలకనిర్ణయాలు– ఇవి మాత్రమేనా? కాదు, కరోనా పై పోరాటాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నించింది. కొంత మార్గదర్శనం అందించింది. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. తరువాత నిర్వ్యాపకమై, నిందను రాష్ట్రాలపై మోపడం మొదలుపెట్టింది. వచ్చే సాధారణ ఎన్నికలకు ఈ కరోనా స్థితిని ఎట్లా ఆలంబన చేసుకోవాలి లేదా; జమిలి ఎన్నికలను రెండేళ్లలోనే నిర్వహిస్తే, అందుకు చేసుకోవలసిన సన్నాహాలు ఏమిటి? ప్రస్తుత విపత్కర పరిస్థితిని ఆసరా చేసుకుని మరిన్ని కీలకమైన తీవ్రచర్యలు ఎట్లా తీసుకోవచ్చు? ఉద్వేగపూరిత అంశాలను ఏవి ముందుకు తేవాలి? – వంటి అంశాలపై కూడా వ్యూహకర్తలు యోచిస్తున్నారా? యోచిస్తున్నారో లేదో తెలియదు కానీ, రానున్న ఒకటి రెండు మాసాల్లో పతాకస్థాయికి వెళ్లే కరోనా వ్యాప్తి విషయంలో ఏమి విరుగుడు చేయాలన్నదానిపై మాత్రం ఏ ఆలోచనా జరగడం లేదు. 


‘‘సంప్రాప్తే, సన్నిహితే కాలే’’ కూడా ఆంక్షలను,

వ్యూహాలను మాత్రమే జపం చేసే నేతలు లోకాన్నేమి రక్షిస్తారు?




కె. శ్రీనివాస్

Updated Date - 2020-07-16T06:07:04+05:30 IST