వైసీపీ పాలనలో ముస్లింలకు తీవ్ర అన్యాయం

ABN , First Publish Date - 2022-08-10T04:18:26+05:30 IST

వైసీపీ మూడేళ్ల పాలనలో ముస్లిం మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, అభివృద్ధి, సంక్షేమంలోను పాతికేళ్లు వెనుకబడిపోయామని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్‌ ఫరూక్‌ షుబ్లీ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

వైసీపీ పాలనలో ముస్లింలకు తీవ్ర అన్యాయం
సమావేశంలో మాట్లాడుతున్న ముస్లిం మైనార్టీల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్‌ ఫరూక్‌ షుబ్లీ

మైనార్టీ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేసిన ప్రభుత్వం   

ప్రభుత్వ మోసపూరిత విధానాలను ప్రజలు తెలుసుకోవాలి

మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు  మహమ్మద్‌ ఫరూక్‌ షుబ్లీ


మదనపల్లె రూరల్‌, ఆగస్టు 9: వైసీపీ మూడేళ్ల పాలనలో ముస్లిం మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, అభివృద్ధి, సంక్షేమంలోను పాతికేళ్లు వెనుకబడిపోయామని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు  మహమ్మద్‌ ఫరూక్‌ షుబ్లీ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మంగళవారం అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని శుభం కల్యాణమండపంలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా నేడు సీఎం జగన్‌ మైనార్టీలను మోసం చేస్తున్నాడని ఆరోపించారు. ముస్లిం మైనార్టీ కార్పొరేషన్‌లో ముస్లింల సంక్షేమం కోసం కేటాయించే నిధులు కేవలం ప్రచారానికి మాత్రమే అన్నారు. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదన్నారు.  సీఎం జగన్‌ అమలు చేస్తున్న నవరత్నాల పథకాలలో నిధులనే కాకుండా, మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు కేటాయించే నిధులు కూడా ముస్లిం మైనార్టీల కార్పొరేషన్‌ నిధుల్లో చూపించడం దారుణమన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా చేయలేదన్నారు. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలను ఇచ్చిన సీఎం జగన్‌ నేడు వాటిని నిలబెట్టుకోలేదన్నారు.

    గత టీడీపీ ప్రభుత్వం పేద ముస్లిం వధూవరులకు దుల్హన్‌ పథకం కింద రూ.50 వేలు ఇస్తే, జగన్‌ రూ.లక్ష ఇస్తానని మాట ఇచ్చి నేడు ఆ పథకం లేకుండా చేశాడని, ముస్లిం విద్యార్థులకు విదేశీ విద్యను దూరం చేశాడన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్సీ, బీసీ అన్ని వర్గాల ప్రజల కన్నా ముస్లింలకే వైసీపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ముస్లింలపై దాడులు జరిగినా పట్టించుకోలేదని విమర్శించారు. వక్ఫ్‌ ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నా పట్టించుకోలేదని, దీనిపై ప్రశ్నించిన వారిపై కేసులు, దౌర్జన్యాలు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం గతంలో ప్రభుత్వాలు అమలు చేసిన సంక్షేమ పథకాలు కూడా మైనార్టీలకు దక్కకుండా చేస్తోందని తెలిపారు. ముస్లింల హక్కుల కోసం పోరాటాలు చేయడానికి, అవసరమైతే జైలుకెళ్లడానికి కూడా సిద్ధమని ప్రకటించారు. రాష్ట్ర కార్యదర్శి షాకీర్‌ మాట్లాడుతూ ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారన్నారు. ముస్లింలకు జరుగుతున్న అన్యాయం, దాడులపై ప్రభుత్వ తీరును మైనార్టీలందరూ గ్రహించాలన్నారు. కదిరికి చెందిన మహిళా నాయకురాలు పర్వీన్‌భాను మాట్లాడుతూ గతంలో టీడీపీ ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీ కార్పొరేషన్‌ ఏర్పడిందని, చిన్న వ్యాపారులకు రుణాలు ఇచ్చి వారి అభివృద్ధికి తోడ్పాటు ఇచ్చిందన్నారు. బాగా చదివే విద్యార్థులకు విదేశీ విద్యకు రుణాలు ఇచ్చి వారి ఉన్నత చదువులకు తోడ్పాటు ఇచ్చిందన్నారు. అయితే నేడు అవేమీ లేకుండా వైసీపీ ప్రభుత్వం చేస్తోందన్నారు. సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యుడు టి.కృష్ణప్ప మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ తీసుకువచ్చే ప్రజావ్యతిరేక విధానాలు, పథకాలు అన్నింటికి వైసీపీ ప్రభుత్వం మద్దతు ఇస్తుందన్నారు. రాష్ట్రంలో ముస్లింలు ఎంతో వెనుకబడి ఉన్నారని, వారిలో నిరక్షరాస్యత ఎక్కువగా ఉందన్నారు. నేడు రాష్ట్రంలో బ్రిటీ్‌ష పాలన కంటే దారుణంగా వైసీపీ పాలన ఉందన్నారు. ముస్లిం మైనార్టీలకు వాస్తవాలు తెలియజేసి చైతన్యం తీసుకువస్తామన్నారు.అనంతరం వైసీపీ ప్రభుత్వం ముస్లింలకు చేసిన అన్యాయం, రాష్ట్రంలో ముస్లింలపై జరిగిన దాడులను తెలియజేసే కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నాయకులు ఖాదర్‌వలీ, నూరుల్లా, గౌస్‌, షాబీర్‌అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-10T04:18:26+05:30 IST