విపరీత విదేశాంగం

ABN , First Publish Date - 2020-07-22T06:19:57+05:30 IST

ఇంట్లోఈగల మోత వీధిలో పల్లకి మోత- అన్న వాడుక తెలిసిందే. ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో, ముఖ్యంగా ఇందిరాగాంధీ హయాంలో, భారతదేశం పేరు ప్రపంచంలో బాగా మారుమోగేది...

విపరీత విదేశాంగం

ఇంట్లోఈగల మోత వీధిలో పల్లకి మోత- అన్న వాడుక తెలిసిందే. ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో, ముఖ్యంగా ఇందిరాగాంధీ హయాంలో, భారతదేశం పేరు ప్రపంచంలో బాగా మారుమోగేది. దేశంలో పరిస్థితి ఎట్లా ఉన్నా, దక్షిణాఫ్రికా వర్ణ వివక్ష వ్యతిరేక పోరాటాన్ని, పాలస్తీనా విముక్తి యుద్ధాన్ని, ఇంకా ఖండఖండాంతరాలలో జరిగే అనేక ప్రజాపోరాటాలను భారతదేశం సమర్థించేది. ఏ రాజ్యకూటమికి చెందని దాన్నని చెబుతూ, ఆ నైతికతతో ప్రపంచవేదికల మీద ప్రతిష్ఠను పొందేది. పేదరిక నిర్మూలన, సంక్షేమకార్యక్రమాలు, వెట్టిచాకిరి, అంటరానితనం వంటి ఫ్యూడల్ పద్ధతులను వ్యతిరేకించడం...- ఈ రకమైన ప్రగతిశీలతకు అనుగుణంగానే భారతదేశ విదేశాంగ విధానం ఉండేది. అట్లాగని, నూటికి నూరుపాళ్లూ స్వతంత్రమైన విదేశాంగ విధానాన్ని అనుసరించడం ఏమీ జరిగేది కాదు. పేరుకు అలీనవిధానం, ఎక్కువగా సోవియట్ యూనియన్ శిబిరంతో సాన్నిహిత్యం, అప్పుడప్పుడూ అణ్వస్త్ర నిరాయుధీకరణ, హిందూ మహాసముద్రాన్ని నిర్యుద్ధమండలంగా చేయడం వంటి నినాదాలతో అమెరికాకు చిరాకు పుట్టించడం, అదే సమయంలో అమెరికాతో ఆర్థిక సంబంధాలు, ఇజ్రాయెల్‌తో రహస్యసంబంధాలు- ఇట్లా ఉండేవి ఆ రోజులు. అగ్రరాజ్యాల పెత్తందారీతనానికి భారత పాలకులు లొంగిపోయారని విమర్శలు కూడా ఆ రోజుల్లో బాగా వినపడేవి. అయితే, స్వతంత్ర దేశంగా అవతరించినప్పుడు, వలసవాద శేష భారం తప్ప మరేమీ లేని అంతర్జాతీయ ప్రయాణం ప్రారంభించింది. నవస్వతంత్రదేశాలకు ఉండే ఆదర్శాల ఉధృతి వల్ల, సోవియట్ యూనియన్, చైనా వంటి దేశాలతో సన్నిహితంగా మెలిగింది. మరోవైపు, రెండో ప్రపంచయుద్ధానంతరం బలశాలిగా అవతరించిన అమెరికాను కూడా సంతృప్తిపరచడానికి ప్రయత్నిస్తూ వచ్చింది. సోషలిస్టు భావాలు కలిగినవాడిగా ప్రసిద్ధుడయిన జవహర్లాల్ నెహ్రూ కూడా అమెరికా మనోభావాలను దృష్టిలో పెట్టుకుని చైనాతో యుద్ధానికి దిగవలసి వచ్చింది. హిమాలయ పర్వతాలలో అమెరికా ఒక అణుసాధనాన్ని నిక్షిప్తం చేసిందని, దాని వల్ల భవిష్యత్తులో అణుధార్మిక ప్రమాదానికి ఆస్కారం ఉన్నదని వినిపించే కథనాలు- 1950 దశకం చివరిలో చైనా గురించిన అమెరికా భయాందోళనలకు ప్రతిధ్వనులు. సోవియట్ విధానాలకు అనుగుణంగా మధ్యాసియాలోనూ, ఆఫ్రికాలోనూ తన విదేశాంగ నీతిని మలచుకుంటూ వచ్చిన భారతదేశం, ఆవలివైపు ఏమున్నదో కూడా తరచు తొంగిచూస్తూనే ఉన్నది.


ముప్పయ్యైళ్ల కిందట సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కావడం, ప్రపంచంలో ఒకే అగ్రరాజ్యం మిగిలిందేమోనన్న పరిస్థితి ఏర్పడడం, అదే సమయంలో భారత్, ఇంకా అనేక దేశాలలో నూతన ఆర్థిక విధానాలు ఆవిష్కృతం కావడం- ఇటీవలి చరిత్ర. అంతర్జాతీయ రంగస్థలం మీద రెండు కూటములు లేకుండా పోవడంతో, అలీనవిధానం అనేదానికి ప్రాసంగికత లేకుండా పోయింది. ఈ మూడు దశాబ్దాల కాలంలోనూ, భారతదేశం ప్రచ్ఛన్నయుద్ధకాలం నాటి తన భారాలను విదుల్చుకుంది. పాలస్తీనా విషయంలో ఇప్పటికీ సంఘీభావమే కానీ, ఇజ్రాయెల్ మంచి మిత్రదేశం. క్యూబాతో, ఉత్తరకొరియాతో, వియత్నాంతో ఇప్పటికీ ఉన్న సంబంధాలకు పెద్ద చారిత్రక ప్రాముఖ్యం లేదు. కానీ, ఆ దేశాలతో పాటు, మధ్య ఆసియాలోని అనేక దేశాలు, ఇంకా మూడో ప్రపంచానికి చెందిన దేశాలు- పాతకాలపు మైత్రీభావాన్ని భారత్ విషయంలో ప్రదర్శిస్తూనే ఉన్నాయి. వాటితో స్నేహాన్ని సరి అయిన అర్థంలో భారత్ కొనసాగిస్తున్నదా లేదా అన్నది ప్రశ్న. అమెరికా దృష్టిలో విశ్వసనీయత పెంచుకోవడానికి గత ఇరవై ఏళ్లుగా భారత్‌ శతవిధాల ప్రయత్నిస్తూనే ఉన్నది. మొదటి ఇరాక్ యుద్ధ సమయంలో కూడా ఏ ప్రపంచ వేదిక మీద దురాక్రమణ గురించి భారత్ మాట్లాడలేదు. 90 దశకం అంతా ఇరాక్ మీద దారుణమైన ఆంక్షలను అమలుచేసినప్పుడు కూడా చమురుకు ఆహారం అన్న పద్ధతిలో తెరచాటు బేరాలు సాగించింది తప్ప, సూత్రబద్ధమైన వైఖరి తీసుకోలేదు. రెండో ఇరాక్ యుద్ధ సమయంలోనూ, సద్దాం హుస్సేన్ ఉరితీత విషయంలోనూ భారత్ మౌనాన్నే ఆశ్రయించింది. దేశంలో తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ, యుపిఎ ప్రభుత్వం అమెరికాతో అణు ఒప్పందాన్ని పదిహేనేళ్ల కిందట కుదుర్చుకుంది. ఈ పదిహేనేళ్ల కాలంలో ఆ ఒప్పందం సాధించిందేమిటో తెలియదు కానీ, ఇండియాను ప్రపంచం ఇప్పుడు ఆమోదనీయమైన అణ్వస్త్రదేశంగా గుర్తిస్తున్నది. అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, ఫ్రాన్స్‌ కావచ్చు- అగ్రరాజ్యాలన్నిటికీ ఆయుధకొనుగోళ్ల పేరిట నిర్ణీత వ్యవధుల్లో భారత్ కప్పం కడుతూనే ఉన్నది. నరేంద్రమోదీ మొదటి హయాంలో రాఫెల్ విమానాల ఒప్పందం కానీ, ఇటీవల రష్యా నుంచి కొనాలనుకున్న యుద్ధ విమానాలు కానీ- అసమాన మిత్రులను రంజింపజేయడం కోసం చేసిన కొనుగోళ్లే అన్న విమర్శలు ఉన్నాయి. ఏ ఒక్క అంతర్జాతీయ సమస్య పైనా, భారత్ ఇటీవలి కాలంలో ఒక విచక్షణాయుత వైఖరి తీసుకోలేదు. 


మరి భారత్ విదేశాంగవిధానంలో ఇక నీళ్లు నమలవలసిన పని లేదు, స్పష్టమైన వైఖరులు తీసుకోవలసి ఉన్నది–- అంటూ విదేశాంగ మంత్రి జయశంకర్ చేసిన వ్యాఖ్యలకు అర్థం ఏమిటి? ఏమి మారిందని అకస్మాత్తుగా ఇంత విదేశాంగ స్వతంత్రత వచ్చింది ఇండియాకు? కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి దేశంలో గొప్ప మెజారిటీ వచ్చి ఉండవచ్చు. అది ఇంటిలో పల్లకీ మోత వంటిది. అదే మోత బయటకూడా లభించిందన్న భ్రమలో భారతప్రభుత్వం ఉన్నదా? మోదీ దేశదేశాలు తిరిగి, దేశాధినేతలతో వ్యక్తిగత స్థాయిలో సంబంధాలను నెలకొల్పుకుని, దౌత్యాన్ని అవలీల వ్యవహారంగా మార్చారని భావించేవారు ఉన్నారు. కానీ ఆ దౌత్యం ఏమైంది? చైనాతో, నేపాల్‌తో, శ్రీలంకతో, బంగ్లాదేశ్‌తో, తాజాగా ఇరాన్‌తో సంబంధాలు ఎట్లా పరిణమించాయి? అమెరికా మెప్పు కోసం ప్రయత్నించడం సరే, దాని వల్ల ఫలితం ఏమిటి? కనీసం వీసాల సమస్యను కూడా భారత్‌కు అనుకూలంగా పరిష్కరింపజేయలేని పలుకుబడి మనది. మరెందుకు ఇప్పుడు ఈ దూకుడువాదం?


దేశాల మధ్య ప్రాంతీయ ఆర్థిక కూటములు, రాజకీయకూటములు పెద్దముఖ్యమైనవి కానట్టుగా జయశంకర్ మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీతో జరుగుతున్న ట్వీట్ల యుద్ధంలో మాత్రం మన్మోహన్ సింగ్ హయాం అంతా వైఫల్యాలమయం అన్నట్టుగా విమర్శించి, గత ఆరేళ్ల కాలంలో విదేశాంగ విధానంలో సాధించిన విజయాలేమిటి అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వడం లేదు. భారతదేశం గత 70 సంవత్సరాలలో ఆర్థికంగా, రాజకీయంగా, అంతర్జాతీయ సంబంధాలలో సైతం ఆత్మనిర్భరతతో లేదు. దేశప్రజల కోసం, వారి ఓట్ల కోసం ఎంతో మార్పు జరిగిందన్న ప్రచారం చేసుకోవచ్చును. విదేశాంగ సంబంధాల విషయంలో అటువంటి చిట్కాలు పని చేయవు. అమెరికా కానీ, మరో దేశం కానీ, అతి చిన్న దేశం కానీ- భారత ప్రయోజనాల పరిరక్షణే ముఖ్యంగా మన సానుకూలతలు ఉండాలి. సమర్పించుకోవడమే తప్ప, తిరుగు ప్రయోజనం లేని విదేశసంబంధాల కోసం, కాలపరీక్షకు నిలబడిన స్నేహాలను వదులుకోవడం మంచిపద్ధతి కాదు. భారత్‌ను నిందించడం పొరుగుదేశాలకు అలవాటైపోయింది అంటున్నారు జయశంకర్. దక్షిణాసియాలోని దేశాలన్నీ మణిపూసలని ఎవరూ అనడంలేదు. అందరితోనూ నీ ఒక్కడికే ఎందుకు చెడుతున్నదన్నది ఆత్మవిమర్శ చేసుకోవలసిన విషయం.

Updated Date - 2020-07-22T06:19:57+05:30 IST