Advertisement
Advertisement
Abn logo
Advertisement

బావి నుంచి ఈతగాడి మృతదేహం వెలికితీత!

  • కుటుంబాన్ని ఆదుకోవాలని బాధితులతో కలిసి గ్రామస్థుల ధర్నా 


దుబ్బాక/మిరుదొడ్డి, డిసెంబరు 2: సహాయక చర్యల కోసం బావిలోకి దిగి ప్రాణాలు కోల్పోయిన ఈతగాడు నర్సింహులు మృతదేహాన్ని బయటకు తీశారు. బుధవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్‌ గ్రామ శివారులోని బావిలోకి ప్రమాదవశాత్తు కారు దూసుకెళ్లిన ఘటనలో ఆ వాహనంలో ఉన్న ఇద్దరూ దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఐదుగురు ఈతగాళ్లతో కారును బయటకు తీసేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టగా వారిలో ఎనగుర్తికి చెందిన నర్సింహులు అనే ఈతగాడు బావిలోపల తాడుకు చిక్కుకుపోయి మృతిచెందాడు. క్రేన్‌ సాయంతో ఆయన మృతదేహాన్ని  గురువారం బయటకు తీశారు. అయితే నర్సింహులు దుర్మరణం పాలై, మృతదేహం బావిలో చిక్కుకుపోయిందని తెలిసి ఆయన కుటుంబసభ్యులు, బంధువులు, పెద్ద సంఖ్యలో ఎనగుర్తి గ్రామస్థులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు రామాయంపేట-సిద్దిపేట రహదారిపై బైఠాయించారు.


గురువారం తెల్లవారుజామున సిద్దిపేట ఆర్డీవో అనంతరెడ్డి అక్కడి చేరుకుని బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని ఆందోళనకారులను సముదాయించారు. అంత్యక్రియలకు వెంటనే రూ.20 వేలు అందిస్తామని ప్రకటించారు. జిల్లా కలెక్టర్‌తో మాట్లాడిన మీదట.. వారంలో రోజుల్లో రూ.6లక్షల పరిహారం అందజేస్తామని, మత్స్యశాఖ నుంచి రూ.5లక్షల బీమా ఇప్పించి.. ఇద్దరు కూతుళ్ల పేరిట రూ.2.5 లక్షల చొప్పున ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తామని, డబుల్‌ బెడ్‌రూం ఇల్లు, ఇంట్లో ఒకరికి ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం ఇస్తామని అనంతరెడ్డి హామీ ఇచ్చారు. దీంతో వారు శాంతించారు. తర్వాత కొద్దిసేపటికి.. నర్సింహులు మృతదేహాన్ని బావి నుంచి బయటకు తీయడంతో తీవ్ర భావోద్వేగానికి లోనై వారు మళ్లీ ఆందోళనకు దిగారు. ఐదుగంటలపాటు రోడ్డుపైనే బైఠాయించారు. పనికి వెళ్లిన నర్సింహులును, బావి వద్దకు రప్పించి ప్రాణాలను బలిగొన్నారని.. ఆయన మృతికి ఎమ్మెల్యే రఘునందనే కారణమని ఆరోపించారు. పోలీసులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. మృతదేహాన్ని సిద్దిపేట మార్చురీకి తరలించారు.  

Advertisement
Advertisement