అదనపు కట్నం వేధింపులే ప్రాణాలు తీశాయి

ABN , First Publish Date - 2022-05-25T06:38:14+05:30 IST

అదనపు కట్నం వేధింపులే తల్లీ, కుమారుడి ప్రాణాలు తీశాయి. పెళ్లి సమయంలో కట్నకానుకల కింద చెల్లించిన మొత్తం కాకుండా అదనంగా మరో

అదనపు కట్నం వేధింపులే ప్రాణాలు తీశాయి
జిల్లాకేంద్రంలో కేసు వివరాలు తెలుపుతున్న డీఎస్పీ

 భార్య, కుమారుడి ఆత్మహత్య కేసులో భర్త, అత్తమామల అరెస్టు 

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలో ఘటన 

నల్లగొండ టౌన్‌, మే 24: అదనపు కట్నం వేధింపులే తల్లీ, కుమారుడి ప్రాణాలు తీశాయి. పెళ్లి సమయంలో కట్నకానుకల కింద చెల్లించిన మొత్తం కాకుండా అదనంగా మరో రూ.10లక్షలు పుట్టింటి నుంచి తీసుకురావాలంటూ తరుచూ భర్త, అత్తమామలు వేధించడంతో భరించలేక కుమారుడిని చంపి ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడింది. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం అవురవాణిలో ఈ నెల 22వ తేదీన జరిగిన ఈ ఘటనకు బాధ్యులైన వారిని అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి వివరాలు తెలిపారు. నార్కట్‌పల్లి మండలం అవురవాణి గ్రామానికి చెందిన దొడ్డి నరే్‌షతో హైదరాబాద్‌ రామాంతపూర్‌లోని రాంరెడ్డినగర్‌కు చెందిన దొడ్డి కృష్ణవేణి అలియాస్‌ లాస్య(23)కు 2000 సంవత్సరం ఫిబ్రవరి 26 వ తేదీన వివాహమైంది. వివాహ సమయంలో సుమారు రూ.35లక్షల వరకు కట్నకానుకల కింది చెల్లించారు. నరేష్‌ రైల్వే శాఖలో ట్రాక్‌మెన్‌గా పనిచేసేవాడు. కొంతకాలం వీరి వైవాహిక జీవితం సాఫీగానే సాగింది. ప్రస్తుతం వారికి 13 నెలల బాబు ఉన్నాడు. అయితే కొంతకాలంగా కృష్ణవేణి భర్త నరేష్‌ అత్తామామలు దొడ్డి బీరయ్య, ఐలమ్మలు అదనపు కట్నంకోసం మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలుపెట్టారు. తీవ్ర మనస్తాపం చెందిన ఆమె ఈ నెల 22వ తేదీ సాయంత్రం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసి కుమారుడు దొడ్డి సాత్విక్‌ (13నెలలు)ను చంపి అనంతరం తాను అదే చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుమార్తె మృతిపై లాస్య తండ్రి గుడుగుంట్ల రామచంద్రం ఫిర్యాదు మేరకు నార్కట్‌పల్లి ఎస్‌ఐ బి.రామకృష్ణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. అనంతరం విచారణలో అదనపు కట్నం వేధింపుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసిందన్నారు. దీంతో భర్త నరేష్‌, అత్తామామ ఐలమ్మ, బీరయ్యలను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో నార్కట్‌పల్లి సీఐ శివరాంరెడ్డి, ఎస్‌ఐలు బి. రామకృష్ణ, ఎస్‌.ధర్మ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-05-25T06:38:14+05:30 IST