అదనపు చార్జీల్లేవ్‌

ABN , First Publish Date - 2022-09-23T08:49:52+05:30 IST

అదనపు చార్జీల్లేవ్‌

అదనపు చార్జీల్లేవ్‌

దసరా ప్రత్యేక బస్సుల్లో సాధారణ చార్జీలే

ఫోన్‌ పే, గూగుల్‌ పే ద్వారా కూడా టికెట్‌ 

700 బస్సులు కొనే యోచన: ఆర్టీసీ ఎండీ 


అమరావతి, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): దసరా పండగ సందర్భంగా ప్రయాణికుల కోసం ఏపీఎ్‌సఆర్టీసీ 4,500 ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు ఉండవని, సాధారణ చార్జీలే ఉంటాయని చెప్పారు. ఈ నెల 29 నుంచి అక్టోబరు 7 వరకూ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని, ప్రయాణికులు ఆర్టీసీ సేవల్ని వినియోగించుకోవాలని కోరారు. చిల్లర సమస్య లేకుండా బస్సుల్లో ఈ పోస్‌లు అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపారు. క్రెడిట్‌-డెబిట్‌ కార్డుల స్వైపింగ్‌తో పాటు ఫోన్‌ పే, గూగుల్‌ పే ద్వారా టికెట్‌ తీసుకోవచ్చన్నారు. 24/7 కాల్‌ సెంటర్‌ 0866-2570005, జీపీఎస్‌ ట్రాకింగ్‌ ద్వారా ప్రయాణికులకు సమాచారం అందజేస్తామన్నారు. గురువారం విజయవాడలోని ఎన్టీఆర్‌ పరిపాలనా భవనంలో ఈడీలు కోటేశ్వరరావు, బ్రహ్మానందరెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. దసరా పండగ, బెజవాడలో దేవీ నవరాత్రులు, తిరుమలలో బ్రహ్మోత్సవాలను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేశామన్నారు. దసరా పండగ వరకూ 2100, తిరుగు ప్రయాణాలకు 2400 బస్సులు అదనంగా అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఒకవైపు వందశాతం మరోవైపు జీరో ఆక్యుపెన్సీ ఉన్నందున పండగల సందర్భంగా ఆర్టీసీ ప్రత్యే క బస్సుల్లో అదనంగా 50 శాతం చార్జీలు పెంచేవారన్నారు. ఆదాయం కంటే చార్జీలు పెంచుతారన్న అపవాదు సంస్థకు తీరని నష్టం చేకూరుస్తోందన్నారు. అందువల్ల దసరా ప్రత్యేక బస్సుల్లో చార్జీలు పైసా కూడా పెంచలేదని స్పష్టం చేశారు.  


దసరాకు ‘స్టార్‌ లైనర్స్‌’..

ప్రయాణికుల డిమాండ్‌ మేరకు ఆర్టీసీ ప్రవేశ పెడుతున్న నాన్‌ ఏసీ స్లీపర్‌ (స్టార్‌ లైనర్‌) బస్సులు దసరా నుంచి అందుబాటులోకి వస్తాయని ఆర్టీసీ ఎండీ తెలిపారు. మొత్తం 62 సర్వీసులను రద్దీ ఉన్న రూట్లలో నడపనున్నట్టు తెలిపారు. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన ఎలక్ట్రిక్‌ బస్సులు తిరుమల బ్రహ్మోత్సవాల నాటికి ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రయాణికులకు మరింత నాణ్యమైన సేవలందించేందుకు 700 కొత్త బస్సులు కొనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. 


అక్టోబరు 1న పీఆర్సీ అమలు

 అక్టోబరు 1న చెల్లించే జీతాలతో సిబ్బందికి పీఆర్సీ అమలవుతుందని ఆర్టీసీ ఎండీ వెల్లడించారు. అయితే పదోన్నతి పొందిన 2096 మందికి నవంబరు 1న వచ్చే జీతంతో పీఆర్సీ పెంపు కలుస్తుందని చెప్పారు. 


Updated Date - 2022-09-23T08:49:52+05:30 IST