దోపిడీకి వంకలు

ABN , First Publish Date - 2020-05-25T09:11:35+05:30 IST

అధికార పార్టీ గ్రామీణ నాయకులు ఇసుకతో సొమ్ము చేసుకుంటున్నారు.

దోపిడీకి వంకలు

వంకల్లో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు

అనుమతులు తక్కువ.. తవ్వకాలు ఎక్కువ

అధికార పార్టీ నాయకుల హల్‌చల్‌

గుంతకల్లు స్టాక్‌పాయింట్‌లో నాసిరకం ఇసుక


 గుంతకల్లు, మే 24: అధికార పార్టీ గ్రామీణ నాయకులు ఇసుకతో సొమ్ము చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో పామిడి నుంచి నాణ్యమైన ఇసుకను స్థానిక మార్కెట్‌ యార్డులో డంప్‌చేసి అక్కడి నుంచి ఆన్‌లైన్‌లో చలానా కట్టినవారికి సరఫరా చేస్తారు. కాగా ఈ ఇసుక తగిన మోతాదులో రాకపోవడంతో జిల్లా యంత్రాంగం గ్రామీణ ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా వంకల్లో ఇసుకను వినియోగించుకోవడానికి అనుమతులిచ్చింది. ఇదే అదనుగా అధికార పార్టీ నాయకులు గ్రామాల్లో అనుమతిచ్చిన చోటే కాకుండా ఇష్టారాజ్యంగా ఇసుకను తరలిస్తూ సొ మ్ము చేసుకుంటున్నారు. అనుమతులు ఇవ్వక మునుపు నుంచే చెరువులు, వంకల్లో ఇసుకను తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. కాగా పట్టణానికి ఇసుక ను అందివ్వడానికి ఏర్పాటుచేసిన డంప్‌ యార్డు నిల్వల్లో ఈ వంకలలోని నాసిరకపు ఇసుకను కలుపుతూ నాణ్యత లేని ఇసుకను ప్రజలకు అంటగడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యఽథేచ్ఛగా ఈ తతంగం జరుగుతున్నా రెవెన్యూ, మైన్స్‌ అండ్‌ జియాలజీ, ఎన్‌ఫోర్స్‌మెంటు శాఖాధికారులు కిమ్మనకుండా చోద్యం చూస్తున్నారు.


రెండంకెలు దాటని అనుమతులు 

గ్రామీణ అవసరాలకు వంకల ఇసుకను వినియోగించుకోవచ్చంటూ ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా, ఇసుక పెద్ద మోతాదులో తరలిపోతున్నా పంచాయతీ కార్యదర్శులు అనుమతి పత్రాలను జారీచేయడంలో తాత్సారం చేస్తున్నారు. గ్రామీణ అవసరాల కోసం కలెక్టరు ఆధ్వర్యంలో గత సంవత్సరం నవంబరులోనూ, ఈయేడు ఫిబ్రవరిలోనూ జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశాలను నిర్వహించారు. గత నవంబరు 7న నిర్వహించిన ఇసుక కమిటీ సమావేశంలో జిల్లాలోని డీ హీరేహాళ్‌, అమడ గూరు, కొత్తచెరువు, బుక్కరాయసముద్రం, గుంతకల్లు మండలంలోని గొందెర్ల, కొంగనపల్లి, గోరంట్లలో 2, రొళ్లలో 4, పెనుగొండలో 2 వంక ఇసుక రీచులకు అనుమతులు ఇచ్చారు. 


ఫిబ్రవరి 13న జరిగిన సమావేశంలో నాగసముద్రం, కదిరిపల్లి పంచాయతీల్లో వంక ఇసుక రీచులకు అనుమతులు ఇచ్చారు. ఈ రీచుల్లో ఆయా పంచాయతీ కార్యదర్శులు ఎస్‌-3 ఫారం ద్వారా ఇసుక మేనేజిమెంటు అండ్‌ మానిటరింగ్‌ సిస్టంలో ఆన్‌లైన్‌  ద్వారా అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇవేవీ లేకుండానే ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిపోతూనే ఉంది. మండలంలో ఏడు నెలల కిందట రెండు రీచులు, మూడు నెలల కిందట రెండు రీచులకు అనుమతులు వచ్చినా ఏ పంచాయతీ కార్యదర్శి కూడా రెండంకెల సంఖ్య దాటకుండా అనుమతులు ఇచ్చారు. కదిరిపల్లి కార్యదర్శి ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకూ 19 అనుమతులు ఇచ్చారు. గడచిన ఏడు నెలల కాలంలో పాతకొత్తచెరువు కార్యదర్శి ఒకటి, కొంగనపల్లి కార్యదర్శి 22 అనుమతులు జారీ చేశారు. 


అధికార పార్టీ నాయకులదే హవా

ప్రభుత్వం గుర్తించిన నాలుగు రీచ్‌ల నుంచే కాకుండా అనుమతి లేని పలు వంకల నుంచి కూడా ఇసుక భారీ ఎత్తున తరలించి అధికారపార్టీ నాయకులు సొమ్ము చేసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఇసుక రీచ్‌లను  అధికార పార్టీ నాయకులు పంచుకుని ఇష్టారాజ్యంగా ఇసుక తరలిస్తున్నా అడిగేవారే లేరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులు అక్రమంగా తరలుతున్న ట్రాక్టర్ల వివరాలను చెప్పి పోలీసులకు పట్టి ఇచ్చారు. ఇప్పుడు మాత్రం  పర్యవేక్షించాల్సిన  ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహిస్తుండటంతో అధికార పార్టీ నాయకులకు అడ్డు చెప్పి ఇబ్బందులపాలు కావడమెందుకన్న ఉద్దేశ్యంతో పంచాయ తీ కార్యదర్శులు  కిమ్మనడంలేదు.


వీరు జారీ చేసిన అనుమతి పత్రాలకు, రీచ్‌లలో తవ్వేసిన ఇసుక పరిమాణానికీ ఉన్న వ్యత్యాసాన్ని గమనిస్తే పరిస్థితి అర్థమవుతుంది. ఇసుక నాణ్యత లేని కారణంగా డిమాండులేక పర్మిట్లు తీ సుకోవడంలేదంటూ పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారు. మరి డిమాండే లేనప్పుడు జిల్లా అధికారులు ఈ రీచ్‌లను ఎందుకు కొనసాగిస్తున్నారో వారికే తెలియాలి. కాగా గుంతకల్లు స్టాక్‌ పాయింటులోని ఇసుకలో ఈ వంకల ఇసుకను తెచ్చి రాత్రి సమయాల్లో కలిపేస్తున్నారన్న సమాచారం వ్యాప్తి చెందడంతో నిర్మాణాలు చేసుకునేవా రు కణేకల్లు నుంచి ఇసుకను అధిక డబ్బు చెల్లించి తెప్పించు కుంటున్నారు. 


రెడ్‌ జోన్‌లో గుంతకల్లు స్టాక్‌ పాయింట్‌

గుంతకల్లులోని మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేసిన ఇసుక స్టాక్‌ పాయింట్‌ ఆన్‌లైన్‌లో రెడ్‌జోన్‌ పరిధిలో ఉన్నట్లుగా చూపుతున్నందున ఇసుకను బుక్‌ చేసుకోలేకపోతున్నారు. రైల్వే అవసరాల నిమిత్తం కణేకల్లు వద్ద ఉన్న రచ్చుమర్రి రీచ్‌ నుంచి ఇసుకను తెచ్చుకుంటున్నారు. రెడ్‌ జోన్‌కు మార్కెట్‌ యార్డుకు ఏమాత్రం సంబంధం లేకపోయినా కంటైన్మెంటు పరిధిలో ఉన్నందున బుకింగ్‌ సాధ్యం కావడంలేదు.  

Updated Date - 2020-05-25T09:11:35+05:30 IST