పొడిగింపు, సడలింపు

ABN , First Publish Date - 2020-05-02T07:29:52+05:30 IST

లాక్‌డౌన్‌ పొడిగించారు. కేంద్రప్రభుత్వం ప్రకటించిన రెండో విడత లాక్‌డౌన్‌ మే 3న ముగియనుండగా, మరో రెండు వారాల పాటు, అంటే 17వ తేదీ దాకా పొడిగించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మే 7దాకా...

పొడిగింపు, సడలింపు

లాక్‌డౌన్‌ పొడిగించారు. కేంద్రప్రభుత్వం ప్రకటించిన రెండో విడత లాక్‌డౌన్‌ మే 3న ముగియనుండగా, మరో రెండు వారాల పాటు, అంటే 17వ తేదీ దాకా పొడిగించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మే 7దాకా లాక్‌డౌన్‌ విధించినందున, మళ్లీ సొంతంగా కొత్త తేదీ చెప్పకపోతే కనుక, మరో పదిరోజులు రాష్ట్ర కట్టడి పెరిగిందన్నమాట. పూర్తి ఎత్తివేతను ఎవరూ ఊహించలేదు కనుక, ఉపసంహరణ అనేది క్రమంగా ఉంటుంది తప్ప అకస్మాత్తుగా ఉంటుందని ఆశించలేదు కనుక, ఈ పరిణామంలో ఆశ్చర్యకరమేమీ లేదు. పైగా, ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఈ పొడిగింపు వాంఛనీయమూ, ఆవశ్యకమూ కూడా.


కరోనా వైరస్‌, దాని పుట్టుపూర్వోత్తరాలు, అది సోకే మార్గాలు, పర్యవసానాలు, నివారణ, చికిత్స, పరిశోధనలు– ఈ అంశాల మీద నుంచి ప్రపంచపు దృష్టి క్రమంగా తిరిగి సాధారణ జీవితంలోకి వెళ్లడం ఎట్లా అనే దానిపైకి మళ్లింది. లాక్‌డౌన్‌ వల్ల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినడంతో అనేక కొత్త సమస్యలు ఏర్పడుతున్నాయి. ఉత్పాదక, పారిశ్రామిక కార్యకలాపాలను వెంటనే యథాతథంగా పునః ప్రారంభించ లేని పరిస్థితి. వైరస్‌కు సమీప భవిష్యత్తులో నిరోధం లేకపోవడం వల్ల మున్ముందు కూడా అనేకానేక సామాజిక, వైయక్తిక, ఆర్థిక ఆంక్షలు, పరిమితులు– కొనసాగబోతున్నాయి. ప్రపంచం అనేక కొత్తరీతులను అలవరచుకోవలసి ఉంటుంది. 


కరోనా సంక్షోభం కారణంగా దీర్ఘకాలికంగా ప్రపంచంలోనూ, మానవజీవనంలోనూ ఏ ఏ పెనుమార్పులు సంభవిస్తాయనేది చర్చను పక్కనబెట్టి, ప్రస్తుతం తక్షణం జరగవలసింది– వ్యాధి నియంత్రణతో పాటు, జనజీవనపు పునరుజ్జీవనం. ఈ రెంటికీ పరస్పర సంబంధం ఉన్నది. వ్యాధి కట్టడికి ఎటువంటి అవరోధం జరగకుండా, జీవితం పునఃప్రారంభం కావాలి. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగిస్తూ, తాము చేసిన జోన్ల విభజన ప్రకారం అనేక సడలింపులను ప్రకటించింది. అతినెమ్మదిగా, దశల వారీగా లాక్‌డౌన్‌ నుంచి ఉపసంహరణ జరుగుతుందని ఈ సడలింపుల తీరు వల్ల అర్థమవుతున్నది.


కొత్త విధినిషేధాలలో, 65ఏళ్ల వయసుకు పైబడిన వారి కదలికలపై ఆంక్షల విధింపును ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆ వయస్సున్నవారు కొవిడ్‌ను ఎదుర్కొనే విషయంలో బలహీనులన్నది తెలిసిందే. ఇజ్రాయిల్‌లో– ఆరేళ్ల లోపు, అరవయ్యేళ్ల పైన ఉన్నవారిని ఇళ్లలోనే ఉంచేసి, ఇతరులను సమస్త ఉత్పాదక, పారిశ్రామిక, సేవా కార్యక్రమాలకు అనుమతిస్తున్నారు. అంటే, వ్యాధి ఎవరి విషయంలో అధిక ప్రమాదకరమో వారిని కట్టడి చేసి, తక్కిన జనాభా యథావిధిగా జీవించడమన్నమాట. ఆ చిన్నదేశంలో అది సాధ్యమయింది, అన్నిచోట్లా అది ఆచరణ సాధ్యం కాదు. మన దగ్గర కూడా లాక్‌డౌన్‌ ఉపసంహరణ, వ్యాధి ప్రమాదం అధికంగా ఉన్న వర్గాలను కట్టడి చేసి, తక్కిన జన శ్రేణులను యథాపూర్వ జీవితానికి అనుమతించే దిశగా సాగుతున్నట్టు కనిపిస్తున్నది. 


ఈ వైఖరిలో ఉన్న ప్రమాదం ఏమిటంటే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిర్వహణలో, యావన్మంది ప్రజల సహకారంతో, సామాజిక సమ్మతితో సాగుతున్న వ్యాధినిరోధక ప్రక్రియ, ఇకపై ఆయా కుటుంబాల బాధ్యత అవుతుంది. బయట ప్రపంచంలో తిరిగి వ్యాధి సోకించుకుని,  ఇంటికి వచ్చే యువకులు, మధ్యవయస్కుల నుంచి వృద్ధులకు, పిల్లలకు రక్షణ ఏది? వేరు వేరుగా సురక్షితంగా ఉండగలి గేంత పెద్ద ఇళ్లు ఎంతమందికి ఉంటాయి? కుటుంబంలోని పెద్దలు, యువకుల మధ్య సరిహద్దులు నిర్వహించడం సాధ్యమయ్యే విషయం కాదు. సమష్టి బాధ్యత నుంచి వైయక్తిక, కౌటుంబిక బాధ్యతగా వయోధికుల ఆరోగ్యం మారడం వాంఛనీయం కాదు. 


ఆర్థికమే అధికమని భావించి, ఆరోగ్యాలను అలక్ష్యం చేస్తే బలి అయ్యేది, ఆర్థికంగా, శారీరకంగా, సామాజికంగా బలహీనులు, వయోధికులు మాత్రమే. అమెరికాలో చూస్తున్నాము, సీనియర్‌ సిటిజన్లు కాక, ఎక్కువగా చనిపోతున్నది నల్లవారు, మెక్సికన్లు, అల్పాదాయ వర్గాల వారు. వైరస్‌కు వర్గ భేదం లేదనడం పాత మాట. అంతిమంగా అది పేదలను, ఆరోగ్యహీనులను మాత్రమే అధికంగా బలితీసుకుంటుంది. జనాభాలో ఒక శ్రేణిని వదులుకోవడానికైనా సిద్ధపడుతున్నందుకు ట్రంప్‌ విమర్శల పాలయ్యారు. భారతదేశం వంటి జనసమ్మర్దం ఉన్న దేశాలలో నిర్దిష్ట వయోశ్రేణి మరణాలు మరింత అధికంగా ఉండే అవకాశం ఉన్నది. 


కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి శుక్రవారం నాడు చెప్పిన వివరాలను ఈ సందర్భంగా ఆసక్తితో గమనించవలసి ఉన్నది. కరోనా మరణాలలో 50 శాతం మంది 60 ఏళ్ల వయసులోపు వారే. అంటే, మధ్యవయస్కులు, యువకులలో కూడా కరోనాను ఎదుర్కొనలేని బలహీనులు మన దగ్గర గణనీయంగానే ఉన్నారు. లాక్‌డౌన్‌ను నిరంతరం కొనసాగిస్తే, ఇతర సమస్యలు పెరిగి అది కూడా ప్రాణాంతక సంక్షోభాలకు దారితీయవచ్చు. అదే సమయంలో, ఉపసంహరణలో జాగరూకత లేకపోతే, ఉభయ భ్రష్టత్వం ప్రాప్తించవచ్చు.

Updated Date - 2020-05-02T07:29:52+05:30 IST