‘మెట్రో’ రాయితీ కాలాన్ని పొడిగించండి

ABN , First Publish Date - 2020-08-11T09:06:12+05:30 IST

అసలే అనుకున్న దాని కంటే ఆలస్యంగా ప్రారంభమైన సర్వీసులు, మరోవైపు కరోనా వైరస్‌ వ్యాప్తితో నిల్చిపోయిన సేవలతో ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్

‘మెట్రో’ రాయితీ కాలాన్ని పొడిగించండి

కరోనాతో ఐదు నెలలుగా ఆదాయం లేదు

ప్రభుత్వానికి ఎల్‌ అండ్‌ టీ విజ్ఞప్తి 

రోజుకు రూ.45 కోట్ల నష్టం.. 

వార్షిక నివేదికలో వెల్లడి 

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): అసలే అనుకున్న దాని కంటే ఆలస్యంగా ప్రారంభమైన సర్వీసులు, మరోవైపు కరోనా వైరస్‌ వ్యాప్తితో నిల్చిపోయిన సేవలతో ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్‌ (హైదరాబాద్‌) లిమిటెడ్‌ నష్టాల్లో కూరుకుపోయింది. కరోనా కారణంగా రైలు సర్వీసులను తిరిగి ప్రారంభించడంపై అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో ఉపశమనం కల్పించాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి ఎల్‌అండ్‌టీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసింది. ఒప్పందంలోని నిబంధనలను అనుసరించి లాక్‌డౌన్‌ కారణంగా పని చేయలేని సమయానికి సమానమైన రాయితీ వ్యవధిని పొడిగించాలని కోరింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూపొందించిన తాజా వార్షిక నివేదికలో లాభనష్టాలను తెలిపింది. ఈ ప్రాజెక్టు రాయితీ కాలం 35 ఏళ్లు కాగా, జూలై 5, 2012 నుంచి నియమించబడిన తేదీ నుంచి ఐదేళ్ల ప్రారంభ నిర్మాణ కాలంతో సహా రాయితీ ఒప్పందంలో పేర్కొన్న విధంగా ఎస్పీవీ (స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌) కొన్ని షరతులను నెరవేర్చడానికి లోబడి ఇది మరో పాతికేళ్లు పొడిగించబడుతుంది. ప్రాజెక్టు అంచనా రూ.16,576 కోట్లు కాగా, ఇప్పటి వరకు రూ.20వేల కోట్లు ఖర్చయినట్టు పేర్కొంది. అంటే ఇప్పటికే రూ.3765 కోట్లను ఎక్కువగా ఖర్చు చేసినట్లు మెట్రో రైల్‌ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాజెక్టు వ్యయవివరాలను సమర్పించింది. దీనికి తోడు ప్రస్తుతం కరోనా నేపథ్యంలో మార్చి 22 నుంచి మెట్రో రైలు సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో రోజుకు సుమారు రూ.45 కోట్ల మేర ఆదాయం కోల్పోతున్నామని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నుంచి ఉపశమనం కోరుతున్నామని మెట్రో వర్గాలు పేర్కొంటున్నాయి. 


ఇప్పటికే రూ.20 వేల కోట్లు వెచ్చించాం

ఎంతో ఆలస్యంగా ప్రారంభమైన మెట్రో సేవలకు కరోనా కారణంగా మరింత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతోంది. కరోనా లాక్‌ డౌన్‌కారణంగా మార్చి 22 నుండి మెట్రో రైలు కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో సుమారు 5 నెలలుగా ఆదాయం లేకుండా పోయింది. నిర్వహణ భారంతో పాటు, నిర్మాణం కోసం వెచ్చించిన పెట్టుబడిపై ఆదాయం వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో రాయితీ కాలాన్ని పొడిగించాలని కోరుతోంది. ప్రాజెక్టు ఆలస్యం కావడం వల్ల సంస్థపై పెరుగుతున్న ఆర్థిక భారాన్ని పూడ్చుకోవాలంటే ప్రభుత్వం నుంచి లభించే ఉపశమనం ఎంతో కీలకంగా మారనుంది. 


2018-19లో మెట్రో రైలు వార్షికాదాయం రూ.318కోట్లు

ఫ 2019-20లో మెట్రో రైలు వార్షికాదాయం రూ.598 కోట్లు ప్రయాణ చార్జీలు, మాల్స్‌ ప్రకటనల ద్వారా వచ్చింది. అయితే నష్టం మాత్రం రూ.382 కోట్లుగా వార్షిక నివేదికలో ఎల్‌ అండ్‌ టీ పేర్కొంది. 

Updated Date - 2020-08-11T09:06:12+05:30 IST