Abn logo
Sep 20 2021 @ 02:39AM

ఎక్స్‌ప్రెస్‌ మనీ వే!

‘ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రె్‌స వే’ తో ప్రతినెలా రూ.1000-1500 కోట్ల ఆదాయం

2023 లోపు ప్రపంచంలోనే 

అతిపెద్ద ఎక్స్‌ప్రె్‌స వే పూర్తి


న్యూఢిల్లీ, సెప్టెంబరు 19: ప్రపంచంలోనే అతిపెద్దదైన ‘ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రె్‌సవే’ ప్రాజెక్టు పూర్తయితే కేంద్ర ప్రభుత్వానికి ప్రతి నెలా రూ.1000-1500 కోట్ల ఆదాయం వస్తుందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. 2023లోపు ఈ ప్రాజెక్టు అమల్లోకి వస్తుందని ఆయన వెల్లడించారు. ఇటీవలే ఈ ప్రాజెక్టు ప్రగతిపై హరియాణా, గుజరాత్‌లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఆ ప్రాజెక్టు వివరాలపై ఆదివారం ఓ వార్తా సంస్థకు మంత్రి ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘భారత్‌మాల పరియోజన’ మొదటి దశలో భాగంగా ఈ ఎక్స్‌ప్రె్‌సవే నిర్మాణం జరుగుతోందని ఆయన చెప్పారు. వచ్చే కొన్నేళ్లలో భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఆదాయం ప్రస్తుతం ఉన్న రూ.40 వేల కోట్ల నుంచి రూ.1.40 లక్షల కోట్లకు పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్‌హెచ్‌ఏఐ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. ఎన్‌హెచ్‌ఏఐకు ‘ఏఏఏ’ రేటింగ్‌ వచ్చిందని, ఆ సంస్థకు చెందిన అన్ని ప్రాజెక్టులు ఫలవంతమయ్యాయని ఆయన వెల్లడించారు. ఎన్‌హెచ్‌ఏఐ అనేది ఓ బంగారు గని అని మంత్రి పేర్కొన్నారు. 


చిన్న కార్లకూ చాలినన్ని ఎయిర్‌బ్యాగులు ఉండాలి 

మధ్యతరగతి ప్రజలు కొనే చిన్న కార్లకూ చాలినన్ని ఎయిర్‌బ్యాగులు అమర్చాలని వాహన తయారీదారులకు మంత్రి నితిన్‌ గడ్కరీ విజ్ఞప్తి చేశారు. ఽప్రయాణికుల భద్రత, ప్రమాదాల్లో మరణాల ముప్పును నివారించేందుకు అవి ఉండాలని ఆయన సూచించారు.. అలాగే అఫ్ఘానిస్థాన్‌లో మౌలిక సదుపాయాల కల్పన రంగంలో భారత్‌ మరిన్ని పెట్టుబడులు పెట్టే అంశంపై విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌తో చర్చించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకొంటారని గడ్కరీ తెలిపారు. ‘భారత్‌-అఫ్ఘాన్‌ ఫ్రెండ్‌షిప్‌ డ్యాం’ సల్మా డ్యాంతో సహా పలు ప్రాజెక్టులను మన దేశం ఇప్పటికే పూర్తి చేసిందని, ఇంకా కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయని ఆయన తెలిపారు. భారత్‌కు అఫ్ఘాన్‌ స్నేహపూర్వక దేశమని, రహదారుల నిర్మాణానికి గతంలో అక్కడి ప్రభుత్వంతో చర్చలు కూడా జరిపామన్నారు. ప్రస్తుత అక్కడ ఆందోళనకర పరిస్థితుల్లో వాటి నిర్మాణాన్ని భారత్‌ కొనసాగించకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు. 


ఏంటీ ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రె్‌సవే?

ఢిల్లీతో పాటు హరియాణా, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ల గుండా సాగిపోయే హైవేనే ‘ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రె్‌సవే’. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద ఎక్స్‌ప్రె్‌సవే. ఢిల్లీలోని అర్బన్‌ సెంటర్లను ఢిల్లీ-ఫరీదాబాద్‌-సోహ్నా సెక్షన్ల మీదుగా ముంబైకు ఈ ప్రాజెక్టు కలుపుతుంది. మొత్తం రూ.98 వేల కోట్ల ఖర్చుతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.