బస్‌ ఎక్కాలంటే.. కి.మీ నడవాల్సిందే!

ABN , First Publish Date - 2022-07-04T06:34:57+05:30 IST

అబ్బా జాతీయ రహదారికి ఎంత దగ్గరగా ఉందో.. ఆ గ్రామస్థులెవరో కానీ చాలా అదృష్టవంతులు..

బస్‌ ఎక్కాలంటే.. కి.మీ నడవాల్సిందే!
అచ్చన్నపాలెం వద్ద ఎక్స్‌ప్రెస్‌ హైవే

హైవేతో అచ్చన్నపాలెం అష్టదిగ్బంధనం

బస్‌లు ఆగవు.. డ్రైనేజీ నీరు పారదు

రెండేళ్లగా గ్రామస్థులకు తీరని సమస్య


 అబ్బా జాతీయ రహదారికి ఎంత దగ్గరగా ఉందో.. ఆ గ్రామస్థులెవరో కానీ చాలా అదృష్టవంతులు.. అనుకుంటున్నారా.. అయితే మీరునుకుంటున్నది నిజం కాదు..  జాతీయ రహదారే ఆ గ్రామస్థులకు శాపంగా మారింది.. రోడ్డు పక్క నుంచి గ్రామం బాగానే కనిపిస్తుంది..  కానీ ఆ గ్రామానికి వెళ్లాలంటే మాత్రం కిలోమీటరు తిరిగిరావాల్సిందే.. బస్‌ ఎక్కాలన్నా..  దిగాలన్నా కిలో మీటరు నడవాల్సిందే.. ఇదీ నల్లజర్ల మండలంలోని అచ్చన్నపాలెం గ్రామస్థుల దుస్థితి.. 


నల్లజర్ల, జూలై 3 : నిన్నటి వరకు ఆ గ్రామంలోని ప్రజలు ఎక్కడికి వెళ్లా లన్నా..రావలన్నా క్షణంలో పని.. ఎందు కంటే జాతీయ రహదారి పక్కన గ్రామం.. నిత్యం రవాణా సదుపాయం ఉండేది. ఆర్‌టీసీ బస్సులు ఆగేవి.. ప్రయాణానికి ఇబ్బంది ఉండేది కాదు. గ్రామంలో డ్రైనేజీ నీరు సైతం పల్లపు ప్రాంతాలకు వెళ్లిపోయేది. ఎప్పుడైతే గుండుగొలను-కొవ్వూరు ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణంతో ఆ గ్రామం అష్టదిగ్బంధనమైంది. డ్రైనేజీ నీరు వెళ్లే మార్గం లేక,బస్సులు ఆ గ్రామం మీదుగా వెళుతున్నా ఎక్కేదారిలేక ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు.ఈ గ్రామంలో ప్రజలు బస్సు ఎక్కాలన్నా దిగాలన్నా కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మండల కేంద్రమైన నల్లజర్లకు కూత వేటు దూరంలో అచ్చన్నపాలెం గ్రామం ఉంది. ఈ గ్రామంలో సుమారు 3 వేల జనాభా ఉంటారు. ఈ గ్రామం మీదుగా రెండేళ్ల కిందట గుండుగొలను- కొవ్వూరు ఎక్స్‌ప్రెస్‌ హైవే రావడమే గ్రామస్థులకు శాపంగా మారింది. గ్రామానికి హైవే అధికా రులు సర్వీస్‌ రోడ్డు వేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎస్సీ కాలనీ వద్ద బస్‌షెల్టర్‌ ఏర్పాటు చేయాల్సి ఉండగా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కాలనీ వాసులు ఉపయోగించిన నీరు వెళ్లే మార్గం లేక  డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తున్నాయి. హైవే మార్జిన్‌లో బస్సులు అగేందుకు కనీసం మార్కింగ్‌  ఇవ్వకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్‌షెల్టర్‌ నిర్మాణం,గ్రామంలో బస్సులు ఆగే విధంగా చర్యలు,డైనేజీ నీరు వెళ్ళే మార్గం చూడాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - 2022-07-04T06:34:57+05:30 IST