విపక్షాల తీరును ప్రజల్లోకి తీసుకెళ్లండి: ఎంపీలకు మోదీ దిశానిర్దేశం

ABN , First Publish Date - 2021-07-27T18:25:41+05:30 IST

పార్లమెంటు సమావేశాలను జరక్కుండా అడ్డుకుంటున్న విపక్షాల తీరును ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ....

విపక్షాల తీరును ప్రజల్లోకి తీసుకెళ్లండి: ఎంపీలకు మోదీ దిశానిర్దేశం

న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలను జరక్కుండా అడ్డుకుంటున్న విపక్షాల తీరును ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. మంగళవారంనాడు జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తూ, పార్లమెంటు ప్రొసీడింగ్స్‌కు సంబంధించిన ఏ సమావేశంలోనూ విపక్షాలు పాల్గొనకపోవడం, ఉభయసభల కార్యక్రమాలను జరక్కుండా అడ్డుకోవడం వంటి చర్యలను ప్రజల దృష్టికి తేవాలని ఎంపీలకు సూచించారు. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ, విపక్షాలు చర్చకు సిద్ధంగా లేరనే విషయాన్ని కూడా ప్రజల  దృష్టికి తీ తీసుకు వెళ్లాలన్నారు. పెగాసస్ స్నూపింగ్ వివిదాం, సాగు చట్టాలు, తదితర అంశాలపై కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీల ఎంపీలు ఉభయసభలనూ జరగనీయకుండా అడ్డుకుంటున్న నేపథ్యంలో మోదీ తాజా స్పందన చోటుచేసుకుంది.


ఈనెల 19న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఉభయసభలూ ప్రతిరోజూ పలుమార్లు వాయిదా పడుతూనే ఉన్నాయి. ఆరవ రోజైన మంగళవారంనాడు కూడా లోక్‌సభలో గందరగోళ పరిస్థితులు కొనసాగాయి. ఎంపీలు సభా నిబంధనలు పాటించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సూచించినప్పటికీ విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వైపు దూసుకుపోయారు. నినాదాలు చేస్తూ బ్లానర్ల ప్రదర్శించారు. ''నినాదాలు చేయడంలో పోటీ పడవద్దు. ప్రజా సమస్యలను లేవనెత్తడంలో పోటీ పడండి'' అని ఓంబిర్లా ఓ దశలో సభ్యులకు హితవు పలికారు.


కాగా, 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎంపీలంతా తమ తమ నియోజకవర్గాల్లో, ప్రతి గ్రామగ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు ప్రధాని సూచించారు. 75 స్వాంతంత్ర్య వార్షికోత్సవాన్ని కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజాఉద్యమంగా, ప్రజా భాగస్వామ్యంతో నిర్వహించాలని ప్రధాని సూచించినట్టు సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ తెలిపారు.

Updated Date - 2021-07-27T18:25:41+05:30 IST