ఎగుమతుల్లో 67శాతం వృద్ధి

ABN , First Publish Date - 2021-06-03T09:57:21+05:30 IST

గత నెలలో భారత ఎగుమతి వాణిజ్యం భారీ వృద్ధిని నమోదు చేసుకుంది. కేంద్ర వాణిజ్య శాఖ బుధవారం విడుదల చేసిన డేటా ప్రకారం.. వార్షిక ప్రాతిపదికన 67.39 శాతం పెరిగి 3,221 కోట్ల డాలర్లకు చేరుకుంది...

ఎగుమతుల్లో 67శాతం వృద్ధి

న్యూఢిల్లీ: గత నెలలో భారత ఎగుమతి వాణిజ్యం భారీ వృద్ధిని నమోదు చేసుకుంది. కేంద్ర వాణిజ్య శాఖ బుధవారం విడుదల చేసిన డేటా ప్రకారం.. వార్షిక ప్రాతిపదికన 67.39 శాతం పెరిగి 3,221 కోట్ల డాలర్లకు చేరుకుంది. ఇంజనీరింగ్‌, పెట్రోలియం ఉత్పత్తులు, జెమ్స్‌ అండ్‌ జువెలరీ రంగాలకు విదేశాల నుంచి ఆర్డర్లు గణనీయంగా పెరగడం ఇందుకు దోహదపడింది. ‘2020 మే’తో పోలిస్తే గతనెలలో దిగుమతులు 68.54 శాతం పెరిగి 3,853 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. తత్ఫలితంగా వాణిజ్యలోటు 632 కోట్ల డాలర్లకు పెరిగింది. గత ఏడాది మే నెలలో నమోదైన 362 కోట్ల లోటుతో పోలిస్తే 74.69 శాతం అధికమిది. చమురు దిగుమతులు 945 కోట్ల డాలర్లకు ఎగబాకడం ఇందుకు కారణమైంది. కాగా  ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో ఎగుమతులు 6,284 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 8,425 కోట్ల డాలర్లకు పెరగడంతో వాణిజ్యలోటు 2,141 కోట్ల డాలర్లుగా నమోదైంది. గడిచిన రెండు నెలల్లో 2,032 కోట్ల డాలర్ల విలువైన ముడి చమురు దేశంలోకి దిగుమతైంది. 


వజ్రాల ఎగుమతిలో 20శాతం వృద్ధి అంచనా 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021-22)లో వజ్రాల ఎగుమతులు 20 శాతం మేర వృద్ధి చెంది 2,000 కోట్ల డాలర్ల స్థాయిని దాటవచ్చని క్రిసిల్‌ రిపోర్టు అంచనా వేసింది. అగ్రరాజ్యాలు కరోనా సంక్షోభం నుంచి క్రమంగా కోలుకుంటుండటం ఇందుకు దోహదపడనుందని నివేదికలో పేర్కొంది. 

Updated Date - 2021-06-03T09:57:21+05:30 IST