కాంగ్రెస్ గడప తొక్కొద్దు: మమతకు కీలక సూచన చేసిన దేవెగౌడ

ABN , First Publish Date - 2022-03-12T23:01:14+05:30 IST

ఐదు రాష్ట్రాలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం తర్వాత జేడీఎస్ చీఫ్, మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ

కాంగ్రెస్ గడప తొక్కొద్దు: మమతకు కీలక సూచన చేసిన దేవెగౌడ

బెంగళూరు: ఐదు రాష్ట్రాలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం తర్వాత జేడీఎస్ చీఫ్, మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌తో పొత్తుకు వెంపర్లాడొద్దని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సూచించారు.


మమత చాలా బలమైన నాయకురాలని ప్రశంసించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌తో తమకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. కాంగ్రెస్‌తో తమకు చేదు అనుభవం ఉందని, అయినప్పటికీ దాని గురించి ఇప్పుడు బాధపడబోమని అన్నారు. కర్ణాటకలో ఆ పార్టీతో ఎన్నికలకు ముందు కానీ, ఎన్నికల తర్వాత కానీ పొత్తు పెట్టుకోబోమన్నారు. ప్రాంతీయ పార్టీలన్నీ ఒక్క తాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు.


కాంగ్రెస్‌తో పొత్తుకు రెండుసార్లు ప్రయత్నించి విఫలమయ్యామని దేవెగౌడ పేర్కొన్నారు. తమతో చేతులు కలపడం కాంగ్రెస్‌కు ఇష్టం లేకపోతే మొత్తం 545 స్థానాల్లోనూ ఒంటరిగానే అది బరిలోకి దిగొచ్చని, బాధపడేందుకు తామెవరిమని అన్నారు. అలాగే, పొత్తు కోసం కాంగ్రెస్ తలుపు తట్టొద్దని మమతా బెనర్జీకి సలహా ఇచ్చారు. కాంగ్రెస్‌కు అంత ఆసక్తి లేనప్పుడు ఆ పార్టీ దగ్గరికి ఎందుకు వెళ్లాలని ప్రశ్నించారు. తానిప్పుడు కర్ణాటకలో జేడీఎస్ బలోపేతంపై దృష్టిసారిస్తానని చెప్పుకొచ్చారు. 


కర్ణాటక అసెంబ్లీకి 2018లో జరిగిన ఎన్నికల తర్వాత కాంగ్రెస్, జేడీఎస్ ఒక్కటై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ 104 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మ్యాజిక్ మార్కును దాటలేదు. దీంతో 78 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్, 37 సీట్లు మాత్రమే సొంతం చేసుకున్న జేడీఎస్ చేతులు కలిపాయి. కాంగ్రెస్‌కు అత్యధిక స్థానాలున్నప్పటికీ జేడీఎస్‌కే ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్ అప్పగించింది. అయితే, 15 నెలలకే కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలింది. దీంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

Updated Date - 2022-03-12T23:01:14+05:30 IST