Abn logo
Aug 28 2021 @ 00:22AM

స్మార్ట్‌ ఫోన్‌లో పేలుడు నివారణ ఇలా

ఇటీవల అమెరికా విమానం ఒకటి ఆకాశంలో ఉండగానే ప్రయాణికుల్లోని ఒకరి స్మార్ట్‌ ఫోన్‌ పేలి మంటలు వచ్చాయి. దీంతో  విమానాన్ని అప్పటికప్పుడు కిందకు దింపేశారు. నిజానికి స్మార్ట్‌ ఫోన్లలో మంటలు అరుదు. డివైస్‌ల వినియోగంలో అజాగ్రత్త కారణంగానే మంటలకు ఆస్కారం ఉంటుంది.  హెచ్చరిక కూడా లేకుండా స్మార్ట్‌ ఫోన్‌లోని బ్యాటరీలు దగ్ధమైన సంఘటనలు విన్నాం. చాలా సందర్భాల్లో వినియోగదారుల అజాగ్రత్త కారణంగానే మంటలు వస్తాయని బ్రాండ్‌ ఉత్పత్తిదారులు చెబుతూ ఉంటారు. అసలు మంటలకు అవకాశం ఉన్న అంశాలు - నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూద్దాం... 

 

 ఫాస్ట్‌ చార్జింగ్‌ అడాప్టర్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొనుగోలు చేసిన స్మార్ట్‌ ఫోన్‌తోపాటు వచ్చిన అడాప్టర్‌నే ఉపయోగించాలి. అత్యధిక పవర్‌ రేటు ఉన్నవి ఉపయోగిస్తే బ్యాటరీపై ఒత్తిడి పెరిగి, దెబ్బతింటాయి. అలాగే మార్కెట్లో లభ్యమయ్యే నకిలీ చార్జర్లను కూడా ఉపయోగించవద్దు.

 థర్డ్‌ పార్టీ లేదా ఫేక్‌ బ్యాటరీలను వాడవద్దు. అవి చాలా ప్రమాదాలకు కారణమవుతాయి. చవకరకం లిథియం - ఐయాన్‌ బ్యాటరీ తొందరగా వేడెక్కుతుంది. మంటలు చెలరేగడమే కాదు, కొన్ని సందర్భాల్లో పేలినా ఆశ్చర్యపడక్కర్లేదు.

 కారణం ఏదైనా డివైస్‌ వేడెక్కితే పక్కనే పెట్టేయాలి. అంతేతప్ప చార్జింగ్‌ పెట్టకూడదు. 

 కారులో వెళుతున్నప్పుడు చార్జింగ్‌ కోసం పవర్‌ బ్యాంక్‌ను ఉపయోగించడం మంచిది. కారు చార్జింగ్‌ అడాప్టర్‌తో పోల్చుకుంటే పవర్‌ బ్యాంకే బెటర్‌. నేరుగా కంపెనీ నుంచి కాకుండా, మూడో పార్టీ విక్రేతల నుంచి సాధారణంగా మన దేశంలోని యజమానులు కారు అవసరమైన స్పేర్‌ పార్టులు కొంటూ ఉంటారు. అందులో వైరింగ్‌ విషయంలో రాజీపడతారు. సరిగ్గా అదే అకస్మాత్తుగా మంటలకు లేదంటే పేలిపోవడానికి కారణమవుతాయి.

 రాత్రంతా లేదంటే వంద శాతం పూర్తయ్యేవరకు చార్జింగ్‌ మంచిది కాదు. 90 శాతానికి చార్జింగ్‌ను పరిమితం చేసుకోవడం మంచిది. దాంతో బ్యాటరీ జీవతకాలం పెరుగుతుంది. ఓవర్‌ చార్జింగ్‌ బ్యాటరీ ఎక్స్‌పాండ్‌ అయి, ప్రమాదానికి లోనుకావచ్చు. 

 చార్జింగ్‌ అవుతున్నప్పుడు మరోరకంగా హీట్‌కు గురికాకూడదు. నేరుగా సూర్యకిరణాలు పడే చోట ముఖ్యంగా చార్జింగ్‌కు అస్సలు పెట్టకూడదు.

 అనవసరమైన ఒత్తిడి ఉండకూడదు. ముఖ్యంగా చార్జింగ్‌ సమయంలో దానిపై ఏదో ఒకటి ఉంచకూడదు. 

 చార్జింగ్‌ కోసం ఎక్స్‌టెన్షన్‌ కార్డ్‌ లేదా పవర్‌ స్ట్రిప్‌ ఉపయోగిస్తే షార్ట్‌ సర్క్యూట్‌కు అవకాశం ఉంటుంది. 

లోకల్‌ రిపేర్‌ సెంటర్లలో స్మార్ట్‌ఫోన్‌ను చూపించవద్దు. కంపెనీ ఆథరైజ్డ్‌ సెంటర్లలో మాత్రమే రిపేర్‌ కోసం ఇవ్వాలి.  లోకల్‌ రిపేర్‌ సెంటర్లలో సరైన పరికరాలు ఉండవు. ఏవో ఒకటి ఉపయోగించి రిపేర్‌ చేస్తుంటారు. ఫలితంగా సర్క్యూట్‌ కలగాపులగం కావచ్చు. 

 స్మార్ట్‌ ఫోన్‌ కిందపడితే బాగా దెబ్బతినవచ్చు. అలాంటి వాటిని ఉపయోగించకూడదు. పడిన వెంటనే సర్వీస్‌ సెంటర్‌ దగ్గరకు తీసుకెళ్ళి చెక్‌ చేయించాలి. డిస్‌ప్లే బీటలువారవచ్చు. బాడీ ఫ్రేమ్‌లోకి చెమట, నీరు...ఏదైనా చేరవచ్చు. బ్యాటరీ పనికిరాని స్థితికి చేరుకోవచ్చు. అలా దెబ్బతిన్న స్మార్ట్‌ ఫోన్‌లను వాడితే రిస్క్‌ ఎక్కువ.