దసరా రోజున పేలుళ్ల కుట్ర!

ABN , First Publish Date - 2022-10-04T08:46:53+05:30 IST

విజయదశమి రోజు.. రామ్‌లీలా కార్యక్రమం.. రావణ దహనం.. పెద్ద ఎత్తున పోగయ్యే జనం.. వారే టార్గెట్‌గా పేలుళ్లు జరిపితే..

దసరా రోజున పేలుళ్ల కుట్ర!

  • సైదాబాద్‌ ‘రామ్‌లీలా’నే జాహెద్‌ టార్గెట్‌
  • ఆ కార్యక్రమానికి 3 వేల మంది వస్తారని అంచనా
  • వారం క్రితమే 9 మందితో భేటీ.. 2 సార్లు గుడి వద్ద రెక్కీ
  • ప్రాథమిక దర్యాప్తులో గుర్తించిన పోలీసులు
  • రియల్‌ ఎస్టేట్‌, వెల్డింగ్‌ వ్యాపారాల్లో జాహెద్‌
  • పాత కేసుల్లో 2017లో జైలు నుంచి విడుదల


సైదాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): విజయదశమి రోజు.. రామ్‌లీలా కార్యక్రమం.. రావణ దహనం.. పెద్ద ఎత్తున పోగయ్యే జనం.. వారే టార్గెట్‌గా పేలుళ్లు జరిపితే.. ప్రాణ నష్టం భారీగా ఉంటుంది..! ఇదే కరడుగట్టిన ఉగ్రవాది జాహెద్‌, అతని ముఠా లక్ష్యం..! పాకిస్థాన్‌లో ఉంటున్న హైదరాబాదీ ఉగ్రవాది ఫర్హతుల్లా ఘోరీ ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో విధ్వంసాలకు కుట్ర పన్నిన జాహెద్‌, సమీయుద్దీన్‌, హసన్‌ను పోలీసులు ఆదివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సోమవారం వీరిని కోర్టు ఆదేశాలతో చంచల్‌గూడ జైలుకు రిమాండ్‌ చేశారు. ప్రాథమిక దర్యాప్తులో ఈ ముఠా కుట్రను స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌(సిట్‌) అధికారులు గుర్తించారు.


 సైదాబాద్‌ ప్రధాన రహదారిలోని ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో విజయదశమి రోజున జరిగే ‘రామ్‌లీలా’ కార్యక్రమం వద్ద పేలుళ్లకు వీరు కుట్రపన్నారని సిట్‌ నిర్ధారించింది. పాకిస్థాన్‌ నుంచి తెప్పించిన నాలుగు గ్రనేడ్లతో విధ్వంసానికి వ్యూహరచన చేసిందని సిట్‌ వర్గాలు వెల్లడించాయి. ‘‘పేలుళ్ల విషయంలో ఫెయిల్‌ అవ్వొద్దనే ఉద్దేశంతో జాహెద్‌ పక్కా పథకాన్ని రూపొందించాడు. అందుకోసం సమీయుద్దీన్‌, హసన్‌తోపాటు.. మరో ఏడుగురిని నియమించుకున్నాడు. వారం రోజుల క్రితం సైదాబాద్‌లో ఈ తొమ్మిది మందితో సమావేశం ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత వీరంతా ఆంజనేయస్వామి ఆలయం వద్ద రెండు సార్లు రెక్కీ నిర్వహించారు. దాడి ఎలా చేయాలి? ఎక్కడి నుంచి తప్పించుకోవాలి? సీసీ కెమెరాలకు చిక్కకుండా ఏయే మార్గాల్లో వెళ్లాలి? అనే రూట్‌మ్యా్‌పను రూపొందించుకున్నారు. ఈ కార్యక్రమానికి కనీసం 3 వేల మంది వస్తారు. నాలుగు గ్రనేడ్లతో దాడి చేస్తే.. ప్రాణనష్టం కూడా తీవ్రంగానే ఉంటుందని ఈ గ్యాంగ్‌ అంచనా వేసింది’’ అని వివరించాయి. అంతేకాదు.. ఫర్హతుల్లా ఘోరీ టార్గెట్‌ హైదరాబాద్‌లో విధ్వంసాలతోపాటు, మతకల్లోలాలు రేపడమని పేర్కొన్నాయి. రామ్‌లీలా కార్యక్రమంలో పేలుళ్లతో భారీగా ప్రాణనష్టం జరిగితే.. రెండు వర్గాల మధ్య గొడవలు జరుగుతాయని ఫర్హతులా, జాహెద్‌ భావించినట్లు తెలుస్తోంది.


పోలీసుల అదుపులో మరికొందరు?

జాహెద్‌ కుట్రను గుర్తించిన సిట్‌ బృందం.. అతను రిక్రూట్‌ చేసుకున్న మరికొందరిని అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నట్లు తెలిసింది. అంతేకాకుండా.. గతంలో ఉగ్రవాద కేసులతో సంబంధాలున్న వారినీ విచారిస్తోంది. ఈ క్రమంలో 2007లో సిట్‌ రూపొందించిన ‘మిస్సింగ్‌’ జాబితాను జల్లెడ పడుతోంది. ముఖ్యంగా దశాబ్దన్నర క్రితం నాటి కాలాపత్తర్‌, గోపాలపురం కుట్రకేసులను తిరగదోడుతున్నారు. జాహెద్‌ గ్యాంగ్‌కు సహకారం అందిస్తున్నట్లుగా భావిస్తున్న స్థానిక యువకులపైనా నిఘా పెట్టారు. జాహెద్‌, సమీయుద్దీన్‌, హసన్‌ సెల్‌పోన్‌ కాల్‌ డేటా రికార్డ్‌(సీడీఆర్‌) ఆధారంగా పలువురు యువకులను అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు.


రియల్‌ఎస్టేట్‌, వెల్డింగ్‌ వ్యాపారాలు

జాహెద్‌ రియల్‌ ఎస్టేట్‌, వెల్డింగ్‌ వ్యాపారాలు చేస్తున్నట్లు సిట్‌ గుర్తించింది. 2005లో బేగంపేటలోని టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంపై మానవ బాంబు దాడి కేసులో అరెస్టై.. 12 ఏళ్లు జైలు జీవితం గడిపిన అబ్దుల్‌ జాహెద్‌.. 2017లో విడుదలయ్యాడని అధికారులు తెలిపారు. ఆ తర్వాత అతని కార్యకలాపాలపై ట్రాకింగ్‌ లేకపోవడంతో.. పాకిస్థాన్‌లో ఉంటున్న హైదరాబాదీ ఫర్హతుల్లా ఘోరీతో మళ్లీ కుట్రలు పన్నాడని నిర్ధారించారు. అయితే.. జాహెద్‌ ఎంతకాలం నుంచి ఫర్హతుల్లా ఘోరీతో సంబంధాలు నెరుపుతున్నాడు? అనే వివరాలు తెలియాల్సి ఉందన్నారు. జాహెద్‌, అతని ఇద్దరులను కస్టడీకి తీసుకుని, విచారణలో చాలా అంశాలు రాబట్టాల్సి ఉందని చెప్పారు. ‘‘కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉన్న ఫర్హతుల్లా ఘోరీ.. మళ్లీ తన ఉనికిని చాటుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అసలు ఐఎ్‌సఐ ప్రేరేపిత ఉగ్రవాదుల టార్గెట్‌ ఏమిటి? అనేది తెలియాల్సి ఉంది. జాహెద్‌తో పాటు.. ఫర్హతుల్లా ఇంకెంత మంది ఏజెంట్లను నియమించుకున్నాడు? వారి వద్ద ఎంత మంది పనిచేస్తున్నారు? అనే కోణాల్లో జాహెద్‌ను ప్రశ్నిస్తాం’’ అని పేర్కొన్నారు. కాగా.. జాహెద్‌ జైలులో ఉన్నప్పుడు కూడా సెల్‌ఫోన్లు వినియోగించాడని, వాటిని టెర్రరిస్టు ఖైదీలకు చేరవేశాడనే అభియోగాలున్నాయి. 


సోదరులిద్దరూ ఉగ్రవాదులే

జాహెద్‌ తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. అయితే.. అతని సోదరులిద్దరికీ ఉగ్రవాద చరిత్ర ఉంది. పెద్ద అన్న మహమ్మద్‌ షాహిద్‌ బిలాల్‌ ఒకప్పుడు పోలీసులకు మోస్ట్‌ వాంటెడ్‌. దేశంలో ఎక్కడ ఉగ్ర విధ్వంసం జరిగినా.. షాహిద్‌ పేరు వినిపించేది. 2000-07 మధ్యకాలంలో అనేక పేలుళ్లతో అతనికి సంబంధాలున్నట్లు పోలీసులు చెబుతున్నారు. 15 ఏళ్ల క్రితం పాకిస్థాన్‌లోని కరాచీలో ఓ పెట్రోల్‌ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో షాహిద్‌ చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. జాహెద్‌ మరో సోదరుడు ఖాలెద్‌ కూడా పోలీసు ఎన్‌కౌంటర్‌లో మరణించినట్లు సమాచారం. ్జకాగా, తన భర్తను పోలీసులు అకారణంగా వేధిస్తున్నారంటూ జాహెద్‌ భార్య ఆరోపించారు. పోలీసుల వేధింపుల నుంచి తమను రక్షించాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ను ఆమె కోరారు.

Updated Date - 2022-10-04T08:46:53+05:30 IST