స్మార్ట్‌టౌనల కోసం స్థలాన్వేషణ

ABN , First Publish Date - 2021-04-12T05:22:33+05:30 IST

కార్పొరేషన, మున్సిపల్‌ ప్రాంతాల్లో పేదలకు స్మార్ట్‌టౌన ప్రాజెక్టు ద్వారా అన్ని వసతులతో కూడిన లేఅవుట్లు వేసి మధ్యతరగతి కుటుంబాలకు విక్రయించాలన్నది ప్రభుత్వ ఆలోచన.

స్మార్ట్‌టౌనల కోసం స్థలాన్వేషణ

ప్రైవేటు స్థలాల్లో ప్రభుత్వ లేఅవుట్లు

మధ్యతరగతి వారికి మూడు విభాగాల్లో ప్లాట్లు

కావాల్సిన వారి భూముల రేట్లు పెంచేందుకే లేఅవుట్లా..?


మున్సిపల్‌, కార్పొరేషనలో మధ్యతరగతి కుటుంబాల కోసం ప్రభుత్వం స్మార్ట్‌టౌన ప్రాజెక్టును తీసుకువస్తోంది. పట్టణాలకు ఐదు కి.మీ.దూరంలో ప్రభుత్వ స్థలాలను కొనుగోలు చేసి అక్కడ లేఅవుట్లు వేసి మధ్యతరగతి కుటుంబాలకు విక్రయించాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. జిల్లాలో కడప కార్పొరేషన, ప్రొద్దుటూరు మున్సిపాలిటీల్లో స్మార్ట్‌టౌన ప్రాజెక్టుకు అవసరమైన స్థలం కోసం అన్వేషణ ప్రారంభమైంది. అయితే ఈ స్థల సేకరణను కొంతమంది నాయకులు అనుకూలంగా మార్చుకునే యత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వారికి ఉన్న భూములను అధిక రేట్లకు ప్రభుత్వంతో కొనిచ్చేందుకు..  వారి భూములకు రేట్లు వచ్చేందుకు ఆ ప్రాంతాల్లో లేఅవుట్‌ వేసేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. 


కడప, ఏప్రిల్‌ 11 (ఆంరఽధజ్యోతి): కార్పొరేషన, మున్సిపల్‌ ప్రాంతాల్లో పేదలకు స్మార్ట్‌టౌన ప్రాజెక్టు ద్వారా అన్ని వసతులతో కూడిన లేఅవుట్లు వేసి మధ్యతరగతి కుటుంబాలకు విక్రయించాలన్నది ప్రభుత్వ ఆలోచన. మూడు లక్షల నుంచి 18 లక్షల వరకు సంవత్సరాదాయం ఉన్న వారికి ఇక్కడ స్థలాల కొనుగోలుకు అర్హులు. ప్లాట్లను మూడు విభాగాలుగా విభజించనున్నారు. సంవత్సరానికి 3 లక్షల నుంచి 6 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి 150 చదరపు గజాలు, రూ.6 లక్షల నుంచి 12 లక్షల ఆదాయం గల వారికి 200 చదరపు గజాలు, రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి 240 చదరపు గజాలు కేటాయించారు.


ప్రభుత్వమే కొనుగోలు

పట్టణ ప్రాంతాల్లో ఎంత మందికి స్థలాలు అవసరమన్న దానిపై టౌనప్లానింగ్‌ విభాగం సర్వే చేపట్టింది. కడప కార్పొరేషన పరిధిలో 8110 మంది స్థలాల కోసం ముందుకు వచ్చారు. 1894 మంది 150 చదరపు గజాలు, 2244 మంది 200 చదరపు గజాలు, 3972 మంది 240 చదరపు గజాలు కావాలంటూ ముందుకు వచ్చారు. ఊటుకూరు, రామరాజుపల్లె, చిన్నచౌకు, ఆలంఖానపల్లె, క్రిష్ణాపురం, పుట్లంపల్లె ప్రాంతాల్లో స్థలాలు కావాలంటూ ముందుకు వస్తున్నారు.


స్థలాల కోసం భారీగా దరఖాస్తులు

కడప నగరంలో స్మార్ట్‌టౌన ప్రాజెక్టులో స్థలాలు కొనుగోలు చేసేందుకు పెద్దఎత్తున 8110 మంది ముందుకు రావడాన్ని చూసి టౌన ప్లానింగ్‌ అధికారులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. నవరత్నాల కింద సుమారు 20 వేల మందికి ఇటీవలనే స్థలాలు ఇచ్చారు. ఇప్పటికే 90 వేల నివాస భవనాలున్నాయి. ఇంత పెద్ద ఎత్తున స్థలాల కొనుగోలుకు ముందుకు రావడంతో డిమాండ్‌ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈనెల 20వ తేదీ లోపు సర్వే పూర్తి చేయనున్నారు. ఇంకా దరఖాస్తులు ఎక్కువ రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పుడున్న డిమాండ్‌ మేరకైతే 500 ఎకరాలకు పైగా స్థలం అవసరం ఉందని అంచనా వేస్తున్నారు. కడప సమీపంలోని నానాపల్లెలో భూములు కావాలంటూ సిటీ ప్లానింగ్‌ అధికారులు తహసీల్దారు దృష్టికి తీసుకెళ్లనున్నారు. అక్కడ ప్రైవేటు వ్యక్తుల నుంచి భూములను కొనుగోలు చేసి లేఅవుట్లు వేయనున్నారు. లేఅవుట్లు 60 అడుగుల అప్రోచ రోడ్డు, 40 అడుగుల ఇంటర్నల్‌ రోడ్డుతో డ్రైనేజీ, వీధిలైట్లు, పాఠశాల భవనాలు, ఆరోగ్య కేంద్రం, కమర్షియల్‌ కాంప్లెక్స్‌., సచివాలయం, అంగన్వాడీ కేంద్రం, వాకింగ్‌ ట్రాక్‌, చిల్డ్రన్స పార్కు, వాటర్‌ట్యాంకు, విద్యుత ఉప సబ్‌స్టేషనలాంటివి లేఅవుట్‌లో అభివృద్ధి చేసిన అనంతరం ఆ ప్లాట్లను విక్రయిస్తారు. ప్రొద్దుటూరులో కూడా 2 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అక్కడ ఇప్పటికైతే 150 ఎకరాల భూమి అవసరమవుతుంది.


స్మార్ట్‌టౌనపై కన్ను

ప్రభుత్వం స్మార్ట్‌ టౌన ప్రాజెక్టును తీసుకురావడం పైలెట్‌ ప్రాజెక్టుగా కడప, ప్రొద్దుటూరులో అమలవుతుండడంతో కొంతమంది నేతలు ఈ ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రాంతాల్లో డిమాండ్‌కు తగ్గట్లు లేఅవుట్‌ వేయాలంటే ప్రభుత్వ భూమి లేదు. ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేయాల్సి ఉంది. కడప నగరంలో దగ్గరున్న, విలువైన ప్రభుత్వ భూములన్నీ ప్రముఖుల వశమయ్యాయి. దీంతో స్మార్ట్‌టౌన ప్రాజెక్టు కోసం లబ్ధి పొందేందుకు ముందుగానే భూములు కొనుగోలు చేసి వాటిని ప్రభుత్వం ద్వారా ప్రాజెక్టుకు కొనుగోలు చేయించడం, లేదా వారి భూములున్న ప్రాంతాల్లో లేఅవుట్లు వేసేలా కొందరు యత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఎందుకంటే నవరత్నాలకు పేదలందరికీ స్థలాల కొనుగోలులో రాష్ట్రంలో పెద్దఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి. అమాంతంగా భూముల విలువ పెంచేసి ప్రభుత్వంతో కొనిచ్చిన సంఘటనలు రాష్ట్రంలో వెలుగులోకి వచ్చాయి. స్మార్ట్‌టౌన ప్రాజెక్టుకు సేకరించే స్థలాల్లో అలాంటి అక్రమాలు జరగకుండా చూడాలని కొందరు సూచిస్తున్నారు.


అన్ని వసతులు కల్పిస్తాం  

- కృష్ణసింగ్‌, సిటీ ప్లానింగ్‌ ఆఫీసర్‌

ప్రభుత్వం చేపడుతున్న స్మార్ట్‌ లేఅవుట్లలో అన్ని మౌలిక వసతులు కల్పిస్తాం. ఈనెల 20 వరకు సర్వే నిర్వహిస్తాం. డిమాండ్‌ను బట్టి ఎంత స్థలం అవసరమవుతుందో ఉన్నతాఽధికారుల దృష్టికి తీసుకెళతాం.

Updated Date - 2021-04-12T05:22:33+05:30 IST