జీడి వ్యాపారుల దోపిడీ

ABN , First Publish Date - 2021-05-07T05:34:41+05:30 IST

ఐటీడీఏ పరిధిలో జీడి రైతులు దోపిడీకి గురవుతున్నారు. పిక్కల ధర ఒక్క సారిగా భారీగా పతనం కావడంతో ఆందోళన చెందుతున్నారు.

జీడి వ్యాపారుల దోపిడీ
నిరుపయోగంగా ఉన్న కోల్డ్‌స్టోరేజ్‌

సిండికేట్‌గా ఏర్పడి రైతులను దోచుకుంటున్న వైనం  

కిలో రూ. 80కే కొనుగోలు

సీతంపేట : ఐటీడీఏ పరిధిలో జీడి రైతులు దోపిడీకి గురవుతున్నారు. పిక్కల ధర ఒక్క సారిగా భారీగా పతనం కావడంతో ఆందోళన చెందుతున్నారు. వారంరోజుల కిందట కిలో రూ.105 ఉన్న పిక్కల ధర ప్రస్తుతం రూ.80కి పడిపోయింది. ఐటీడీఏ పరిధిలోని ఏడు మండలాల్లో 20 వేల ఎకరాల్లో జీడిసాగులోఉంది. వాస్తవానికి ఏజెన్సీలో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో కాపురాలేదు. ఉన్న కొద్దిపాటి పిక్కలను విక్రయించుకోవాలని గిరిజన రైతులు ఆశించారు. అయితే ఒక్కసారి ధర భారీగా తగ్గిపోయింది. ఏజెన్సీలోని వెలుగు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఎనిమిది వేల రైతు ఉత్పత్తిదారు సంస్థలు పిక్కలు కొనుగోలు చేయాల్సి ఉంది. ఈ ఏడాది ఆయా సంస్థలు జీడి పిక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో గత్యంతరంలేక దళారులకు విక్రయిస్తున్నామని గిరిజనులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో మైదాన ప్రాంత వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. కరోనా వైరస్‌ ఉధృతికి రైతులు భయాందోళన చెందుతున్నారు. ఇదే ఆసరాగా చేసుకొని  వ్యాపారులు సిండికేట్‌గా మారి జీడిపిక్కలకు గిట్టుబాటు ధర దక్కనీయడం లేదని రైతులు వాపోతున్నారు. ఎక్కువ ధర వచ్చే వరకు నిల్వచేసే అవకాశం కూడా లేకుండా పోయిందని, దీంతో వ్యాపారులు నిర్ణయించిన ధరకే విక్రయించాల్సి వస్తోందని గిరిజనులు వాపోతున్నారు. 80 కిలోల బస్తా రూ.1500 నుంచి రూ.రెండు వేలకు 15 రోజుల్లో పడిపోయిందని తెలిపారు. ఆరు గాలం కష్టపడి పండించిన జీడిధర ఒక్క సారిగా పడిపోవడంతో లబోదిబోమంటున్నారు. తక్షణమే జీసీసీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని పలువురు గిరిజన రైతులు కోరుతున్నారు.


నిరుపయోగంగా కోల్డ్‌స్టోరేజీ

సీతంపేట సంత వద్ద రూ.40 లక్షలతో ఏర్పాటుచేసిన కోల్డ్‌స్టోరేజీ నిరుపయోగంగా పడిఉంది. ప్రస్తుతం దీనిని గోదాముగా మార్చి పిక్కలు జీసీసీ, వెలుగు సంస్థతో కొనుగోలు చేయించి నిల్వచేయాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి. జీడి సాగుకు ఐటీడీఏ ప్రోత్సహించి సబ్సిడీపై యంత్రాలు అందజేస్తోంది. అయితే పిక్కల కొనుగోలుకు సరైన ప్రోత్సాహం లేకపోవడంతో నష్టపోతున్నామని గిరిజన రైతులు వాపోతున్నారు. కాగా జీడిపిక్కలు వెలుగు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతుఉత్పత్తి సంఘాల ద్వారా కొనుగోలుచేసే అవకాశం ఉందని పీహెచ్‌వో భవా నీశంకర్‌ ఆంధ్రజ్యోతికి తెలిపారు.


Updated Date - 2021-05-07T05:34:41+05:30 IST