మందుల పేరుతో దోపిడీ

ABN , First Publish Date - 2022-05-21T05:30:00+05:30 IST

మదనపల్లెలోని ప్రైవేటు మందుల దుకాణాల్లో నిలువు దోపిడీ జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

మందుల పేరుతో దోపిడీ

నిబంధనలకు విరుద్ధంగా షాపుల నిర్వహణ

డాక్టర్‌ ప్రిస్ర్కిప్షన్‌ లేకుండానే విక్రయాలు

వికటిస్తున్న ఔషధాలు.. 

ఇబ్బందుల్లో రోగులు

పట్టించుకోని  ఔషధ నియంత్రణ శాఖాధికారులు


మదనపల్లెలోని ప్రైవేటు మందుల దుకాణాల్లో నిలువు దోపిడీ జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అధిక ధరలతో పాటు నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలను నిర్వహిస్తూ రోగుల జేబులకు చిల్లులు పెడుతున్నట్లు ప్రజలు వాపోతున్నారు. ముఖ్యంగా డాక్టర్‌ ప్రిస్ర్కిప్షన్‌ లేకుండానే విక్రయాలు సాగిస్తున్నట్లు సమాచారం. దీంతో మందులు వికటించి రోగులు లేని రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ఔషధ నియంత్రణ శాఖాధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.


మదనపల్లె క్రైం, మే 21: మదనపల్లె డివిజన్‌ పరిధిలోని 11 మండలాల్లో ప్రైవేటు మెడికల్‌ స్టోర్‌లు 327, హోల్‌సేల్‌ దుకాణాలు 44 ఉన్నాయి. మదనపల్లె, బి.కొత్తకోట, తంబళ్లపల్లె, కురబలకోట, ములకలచెరువు, పీటీఎం, రామసముద్రం, నిమ్మనపల్లె, పెద్దమండ్యం, వాల్మీకిపురం, కలికిరి మండలాల్లో దుకాణాలు నిర్వహిస్తున్నారు. ఇందులో మదనపల్లె పట్టణంలో 160 స్టోర్‌లు, 9 హోల్‌సేల్‌ దుకాణాలు ఉన్నాయి. అయితే షాపులకు లైసెన్స్‌, నిర్వాహకులు మెడిసిన్‌ చదివి ఉండాలి. అలాగే ఫార్మసిస్టు అందుబాటులో ఉండి డాక్టర్‌ ప్రిస్ర్కిప్షన్‌ మేరకు మందులు విక్రయించాలన్నది ప్రభుత్వ నిబంధన. పట్టణాల్లో చాలావరకు అధికారికంగా, అనధికారికంగా షాపులు నిర్వహిస్తున్నట్లు ప్రజలు చెబుతున్నారు. ఇందులో ఫార్మసిస్టు అందుబాటులో లేకుండానే విక్రయాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. డాక్టర్‌ ప్రిస్కిప్షన్‌ లేకుండా మందులు విక్రయిస్తున్నట్లు సమాచారం. రోగి చెప్పిన వివరాల మేరకు మందులు ఇస్తున్నారు. దీంతో బాఽధితులు కొత్త రోగాలు తెచ్చుకుంటు న్నారనే ఆరోపణలున్నాయి. దీనికితోడు అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వినబడుతున్నాయి. ముఖ్యంగా మందులు, టెస్టింగ్‌ కిట్లు, సర్జికల్‌ సామగ్రి సైతం ఎమ్మార్పీ కన్నా..అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ప్రజలు చెబుతున్నారు. మెడికల్‌ స్టోర్‌కు, హోల్‌సేల్‌ దుకాణానికి చాలా తేడా ఉందని అంటున్నారు. హోల్‌సేల్‌ దుకాణాల్లో ఎమ్మార్పీ కన్నా.. తక్కువ ధరలకు విక్రయిస్తుండగా, స్టోర్లలో మాత్రం అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ప్రజలు వాపోతున్నారు.  

మండలాల్లో అయితే ఆర్‌ఎంపీ, పీఎంపీలు క్లీనిక్‌లను పెట్టుకుని అందులోనే మందుల దుకాణాలను నిర్వహిస్తున్నారు. వీటిల్లో చాలా వరకు లైసెన్స్‌ లేకుండా అనధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మందులు నిల్వ ఉంచేందుకు గదుల్లేక..ఎక్కడబడితే అక్కడ ఉంచి, రిఫ్రిజిరేటర్స్‌ను ఉపయోగించకుండా ఇస్టానుసారం విక్రయాలు సాగిస్తున్నారు. పైగా ఓవర్‌డోస్‌ ఇస్తూ రోగుల ప్రాణాలు తీస్తున్నారు. అదేవిధంగా కాలం చెల్లిన మందులు కూడా విక్రయిస్తున్నట్లు సమాచారం. ఔషధ నియంత్రణశాఖ అధికారులు తూతూమంత్రంగా తనిఖీలు నిర్వహిస్తుండడంతో ప్రైవేటు మెడికల్‌ స్టోర్ల నిర్వాహకులు దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యజమానులు కుమ్మక్కై అధిక ధరలకు విక్రయిస్తున్నారని వాపోతున్నారు. 

- పట్టణంలోని ఓ దుకాణంలో తంబళ్లపల్లెకు చెందిన ఓ దీర్ఘకాలిక రోగి నెల రోజుల కిందట షుగర్‌, ఆయాసానికి మందులు కొన్నాడు. డాక్టర్‌ ప్రిస్ర్కిప్షన్‌ లేకుండా షుగర్‌కు వేరే రకం మందులు ఇచ్చారు. వీటి వాడకంతో షుగర్‌ పెరిగిపోయి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబీకులు మదనపల్లె జిల్లా ఆస్పత్రి నుంచి తిరుపతికి తరలిస్తుండగా దారిలో మృతి చెందాడు.

- కురబలకోటకు చెందిన ఓ రోగి 20 రోజుల కిందట కాళ్లవాపులతో బాధపడుతూ వైద్యం కోసం మదనపల్లెకు వచ్చాడు. జిల్లా ఆస్పత్రిలో డాక్టర్‌ను సంప్రదించడంతో పరీక్షించి మందులు రాసిచ్చాడు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఇచ్చే మందులు పనిచేయవని భావించి సమీపంలోని ఓ ప్రైవేటు దుకాణం వద్దకు వెళ్లాడు. అక్కడి సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. కేవలం రూ.100 విలువ చేసే మందులు రూ.300లకు విక్రయించి రోగి జేబుకు చిల్లులు పెట్టారు.

- బి.కొత్తకోటకు చెందిన ఓ రోగి ఇటీవల స్థానిక ఓ ఆర్‌ఎంపీ వద్ద చికిత్స చేయించుకున్నాడు. అక్కడి వైద్యుడు ఓవర్‌డోస్‌ ఇవ్వడంతో ఆరోగ్య పరిస్థితి విషమించి అపస్మారకస్థితికి చేరుకున్నాడు. కుటుంబీకులు మదనపల్లె జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించడంతో అక్కడి వైద్యులు బెంగళూరుకు రెఫర్‌ చేశారు.


నిబంధనల మేరకు నిర్వహించాలి..

- డాక్టర్‌ కేశవరెడ్డి, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌, మదనపల్లె

మెడికల్‌ దుకాణాలను ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్వహించాలి. అధిక ధరలకు మందులు విక్రయించరాదు. డాక్టర్‌ ప్రిస్ర్కిప్షన్‌ ఉంటేనే మందులు విక్రయించాలి. అలాకాదని రోగి చెప్పిన వివరాల మేరకు మందులు ఇస్తే అవి వికటిస్తాయి. దీంతో రోగి కోమాలోకి వెళ్లి మరణించే అవకాశం ఉంది. కాలం చెల్లిన మందులు విక్రయించరాదు. తనిఖీల్లో అక్రమాలు రుజువైతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. షాపు లైసెన్స్‌ రద్దు చేయడంతో పాటు నిర్వాహకులపై కేసులు నమోదు చేయిస్తాం.

Updated Date - 2022-05-21T05:30:00+05:30 IST