Abn logo
Sep 26 2021 @ 00:38AM

ప్రైవేటు ఆసుపత్రుల్లో దోపిడీ అరికట్టాలి

విలేకరులతో మాట్లాడుతున్న బాలకృష్ణ

సీపీఎం నియోజకవర్గ కన్వీనర్‌ బాలకృష్ణ


అనకాపల్లి టౌన్‌, సెప్టెంబరు 25: ప్రైవేటు ఆసుపత్రుల్లో జరుగుతున్న దోపిడీని నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఎం నియోజకవర్గ కన్వీనర్‌ బాలకృష్ణ కోరారు. స్థానిక కార్మిక కర్షక నిలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం చేయించుకున్న రోగి నుంచి పట్టణంలోని నెహ్రూచౌక్‌కు సమీపంలో గల ఓ ఆస్పత్రి నిర్వాహకులు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్‌ వైద్యాలయంలో సౌకర్యాలు లేకపోవడం వల్ల ప్రజలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరడంతో ఆసుపత్రుల నిర్వాహకులు రోగుల నుంచి ఫీజులు భారీగా వసూలు చేస్తున్నారన్నారు. ఎన్టీఆర్‌ వైద్యాలయంపై ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. సమావేశంలో నాయకులు ఎస్‌.వెంకటరావు, కోరిబిల్లి శంకరరావు తదితరులు పాల్గొన్నారు.