‘ఫల’హారం!

ABN , First Publish Date - 2021-04-11T05:38:50+05:30 IST

ఆఫ్‌షోర్‌ కుడి కాలువలకు సంబంధించిన భూ సేకరణలో నిర్వాసితులకు అవార్డుల పేరిట అక్రమాలు చోటుచేసుకున్నాయి. తెరవెనుక కొందరు పెద్దల ప్రమేయం కారణంగా రెవెన్యూ, అటవీశాఖ అధికారులు సర్వే పేరుతో అనర్హులకు సైతం రూ.లక్షల్లో పరిహారం అందజేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా టెక్కలి డివిజన్‌ పరిధిలోని నందిగాం మండలంలో ఈ దందా పెద్దఎత్తున సాగింది. నిర్వాసిత బాధితులు తమకు న్యాయం చేయాలని వేడుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో బాధితులు కలెక్టర్‌ నివాస్‌ను ఆశ్రయించారు. తమ గోడు వినిపించి న్యాయం చేయాలని వేడుకున్నారు.

‘ఫల’హారం!
గోకర్లపల్లిలో సర్వేనెంబరు 25లో అసలు తోటలు లేని ఈ భూమిలో చెట్లకు పరిహారం చెల్లించారు.

 ఆఫ్‌షోర్‌ కుడి కాలువ భూసేకరణలో దోపిడీ

అనర్హులకు అవార్డుల పేరుతో రూ.లక్షల్లో చెల్లింపు

 అక్రమాల వెనుక నేతల హస్తం 

 ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు

 కలెక్టర్‌ను ఆశ్రయించిన బాధిత రైతులు

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

ఆఫ్‌షోర్‌ కుడి కాలువలకు సంబంధించిన భూ సేకరణలో నిర్వాసితులకు అవార్డుల పేరిట అక్రమాలు చోటుచేసుకున్నాయి. తెరవెనుక కొందరు పెద్దల ప్రమేయం కారణంగా రెవెన్యూ, అటవీశాఖ అధికారులు సర్వే పేరుతో అనర్హులకు సైతం రూ.లక్షల్లో పరిహారం అందజేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా టెక్కలి డివిజన్‌ పరిధిలోని నందిగాం మండలంలో ఈ దందా పెద్దఎత్తున సాగింది. నిర్వాసిత బాధితులు తమకు న్యాయం చేయాలని వేడుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో బాధితులు కలెక్టర్‌ నివాస్‌ను ఆశ్రయించారు. తమ గోడు వినిపించి న్యాయం చేయాలని వేడుకున్నారు. వివరాల్లోకి వెళితే.. 

జిల్లాలో మహేంద్రతనయ ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ కుడికాలువకు సంబంధించి అధికారులు భూ సేకరణ చేపట్టారు. నందిగాం మండలంలో బడగాం, అదర్లగోకర్లపల్లి, విషంపల్లి, కాశీరాజుకాశీపురం, కొండతెబూరు, దేవుపురం, సంతోషపురం, లట్టిగాం, పెద్దతామరాపల్లి, తెంబూరు, చినతామరాపల్లి, మద్దిగోపాలపురం గ్రామాల్లో గతంలో భూసేకరణ చేశారు. ఇందులో భాగంగా నిర్వాసితులైన ఆ గ్రామాల రైతులకు ప్రస్తుతం అవార్డుల పేరిట నగదు పంపిణీ చేస్తోంది. ఈ ప్రక్రియలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ, అటవీ, ఉద్యాన, వ్యవసాయ శాఖల అధికారులు ప్రత్యేక సర్వే చేయాలి. భూసేకరణ సందర్భంలో రైతుకు చెందిన మామిడి, టేకు చెట్లు ఎన్ని ఉన్నాయనేది సర్వే అధికారులు తేల్చాలి. ఆ తర్వాతే నిర్వాసితులైన రైతులకు అవార్డులు ప్రకటించాలి. కానీ, అధికారులు ఆవిధంగా చేయలేదు. స్థానిక పెద్దల ప్రోద్బలంతో అనర్హులకు, కనీసం తోటలు లేనివారికి సైతం లక్షల్లో అవార్డులు ప్రకటించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బడగాంలో కుడి కాలువ భూసేకరణలో భాగంగా 2018లో టీడీపీ హయాంలో సర్వే చేశామని అధికారులు చెబుతున్నారు. అదే గ్రామంలో సర్వే నెంబరు 101-5లో విశాకోటి అన్నపూర్ణకు చెందిన 54 సెంట్ల భూమికి అవార్డులు ప్రకటించారు. ఆ భూమిలో స్మారక మండపాలు ఉంటే వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. అటవీశాఖ, ఉద్యానశాఖ అధికారులు సర్వే చేయకుండానే తమకు అనుకూలంగా ఉండేవారికి ఒక న్యాయం.. లేని వారికి మరో న్యాయం అన్న తీరున అవార్డులు ప్రకటించేశారు. దీంతో చాలామంది అర్హులైన రైతులు నష్టపోయారు. 

వాస్తవానికి అన్నపూర్ణ రైతుకు సంబంధించి టేకు 325 చెట్లు, మామిడి 28, చింత 40తో పాటు వివిధ రకాల ఫలసాయం ఇచ్చే చెట్లు సుమారు 35 ఉన్నాయి. 2013 భూచట్టం ప్రకారం సెంటు భూమికి రైతుకు రూ.11,931  వంతున  చెల్లించాలి. ఈ విధంగా భూ పరిహారం చెలల్లింపుల విషయంలో అధికారులు నిబంధనలు పాటించినా.. తోటల విషయంలో వాటిని విస్మరించారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టేకు, మామిడి చెట్లకు ఎఫ్‌ఎస్‌ఆర్‌ రేట్ల ప్రకారం డబ్బు చెల్లించాలి. కానీ అటవీశాఖ, ఉద్యాన శాఖ అధికారులు అనర్హులకు అవార్డులు ప్రకటించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ హయాంలో చక్రం తిప్పిన కొందరు స్థానిక నేతలే మళ్లీ ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ కుడి కాలువ భూసేకరణ దగ్గర నుంచి మామిడి, టేకు చెట్ల పరిహారం చెల్లింపుల వ్యవహారంలో తలదూర్చినట్లు తెలిసింది. కొంతమంది నేతలు తమ భూముల్లో ఎటువంటి టేకు చెట్లు, మామిడి తోటలు లేకపోయినా ఎఫ్‌ఎస్‌ఆర్‌ రేట్లు ప్రకారం అధికంగా పరిహారం రాయించుకొని లక్షలు దోచేశారని సమాచారం. ప్రస్తుత అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు తమకు ఎటువంటి మామిడి, టేకు తోటలు లేకపోయినా కుడికాలువ భూముల్లో అటవీ, ఉద్యాన శాఖల అధికారులతో లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకొని అందినంత దోచుకున్నారు. ఒక నేతకు చెందిన భూమిలో కనీసం పది టేకు చెట్లు లేకపోయినా ఏకంగా రూ.7 లక్షలు, మరో నేతకు చెందిన తోటకు ఏకంగా రూ.18లక్షలు అడ్డగోలుగా అధికారులు చెల్లించేశారు. ఇలా బడగాం, గోకర్లపల్లిలో చాలామంది అనర్హులకు రూ.లక్షల్లో చెల్లించారు. 


కలెక్టర్‌కు ఫిర్యాదు.. 


భూసేకరణ అక్రమాల వ్యవహారంపై కొందరు రైతులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు. టెక్కలి అటవీ శాఖ కార్యాలయం చుట్టూ తిరిగినా.. సమస్య పరిష్కారం కాలేదు. దీంతో ఇటీవల కలెక్టర్‌ నివాస్‌ను బాధిత రైతులు ఆశ్రయించారు. అక్రమాల వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. విషయాన్ని తెలుసుకున్న అటవీ, ఉద్యాన శాఖ అధికారులు హుటాహుటిన బడగాం చేరుకున్నారు. సర్వే చేసి, తప్పుడు నివేదికలు రూపొందించి కలెక్టర్‌కు నివేదించినట్లు తెలిసింది.  పాతపట్నానికి చెందిన రేంజి అధికారి ఒకరు విచారణ చేశారు. అయినా బడగాం గ్రామానికి చెందిన రైతులకు మాత్రం న్యాయం జరగలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ భూసేకరణలో చోటుచేసుకున్న అక్రమాలపై సమగ్ర విచారణ చేసి న్యాయం చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు. లేకపోతే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి, విజిలెన్స్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్తామని పేర్కొంటున్నారు. 

Updated Date - 2021-04-11T05:38:50+05:30 IST