అడుగడుగునా దోపిడీ

ABN , First Publish Date - 2021-05-15T05:10:53+05:30 IST

ఆమే కాదు. ఎంతోమంది వైరస్‌ బాధితుల కుటుంబ సభ్యులు ఇటువంటి ఇబ్బందులనే ఎదుర్కొన్నారు...ఎదుర్కొంటున్నారు.

అడుగడుగునా దోపిడీ

కరోనా బాధితుల కుటుంబ సభ్యులను దోచుకుంటున్న ఆస్పత్రి సిబ్బంది

ఇంటి నుంచి తీసుకువెళ్లిన డ్రెస్‌ మార్చడానికి రూ.500 నుంచి వేయి వరకు డిమాండ్‌

ఆహారం ఇవ్వడానికి రూ.500

ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్‌ ఇవ్వడానికి రూ.100 నుంచి రూ.200

కుటుంబ సభ్యులతో వీడియో కాల్‌లో మాట్లాడించడానికి రూ.300 నుంచి రూ.500 వసూలు

మెరుగైన వైద్యానికి చెల్లింపులే.. చివరి చూపునకు ఆమ్యామ్యాలే


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి) 


‘కరోనా బారినపడి నా భర్త చనిపోయాడు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న సమయంలో ఇంటి నుంచి ఆహారం, ఇతర పానీయాలు అందించడానికి తీవ్రంగా ఇబ్బందిపడ్డాను. రెండొందలు నుంచి వేయి రూపాయలు ఇస్తేనేగానీ సిబ్బంది లోపలకు తీసుకువెళ్లేవారు కాదు. చివరికి చనిపోయిన రోజు నా భర్త ముఖాన్ని చూపించడానికి రూ.15 వేలు అడిగారు. మానవత్వమే లేకుండా వ్యవహరిస్తూ ప్రజలను పీల్చి పిప్పి చేసేస్తున్నారు’ 

...ఇదీ కరోనా వైరస్‌ బారినపడి భర్తను కోల్పోయిన ఎంవీపీ కాలనీకి చెందిన ఓ మహిళ ఆవేదన. 


ఆమే కాదు. ఎంతోమంది వైరస్‌ బాధితుల కుటుంబ సభ్యులు ఇటువంటి ఇబ్బందులనే ఎదుర్కొన్నారు...ఎదుర్కొంటున్నారు. కేజీహెచ్‌లోనే కాదు విమ్స్‌, ఛాతీ, అంటువ్యాధుల ఆస్పత్రి, ఇతర ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోను బాధితుల కుటుంబ సభ్యులను కిందిస్థాయి సిబ్బంది దోచుకుంటున్నారు. ప్రతి పనికీ ఒక రేటు పెట్టి...ఆ మొత్తం చెల్లిస్తేనే గానీ ఏదైనాసరే చేయడానికి ఇష్టపడడం లేదు. వాళ్లతో పెట్టుకుంటే వైరస్‌ బారినపడిన వ్యక్తులకు ఏమవుతుందో అన్న భయంతో చాలామంది వారడిగిన మొత్తాలను ఇచ్చేస్తున్నారు. 


ఆస్పత్రుల్లో ఆరాచకమే.. 


ముఖ్యంగా వైరస్‌ బాధితుడికి అవసరమైన మందులను సకాలంలో అందించడంతోపాటు బాగా చూసుకుంటామని, డ్రెస్సింగ్‌ చేస్తామని చెప్పి కుటుంబ సభ్యుల వద్ద వేల రూపాయలు లాగేస్తున్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన డ్రెస్‌ మార్చడానికి ఒక్కో వార్డు బాయ్‌, కింది స్థాయి సిబ్బంది రూ.500 నుంచి వేయి వరకు డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే ఇంటి నుంచి తెచ్చిన ఆహారం ఇవ్వడానికి రూ.500, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్‌ ఇవ్వడానికి రూ.100 నుంచి రూ.200 వసూలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు కొనిచ్చే మందులు దగ్గర వుండి సిబ్బంది వేయించాలంటే కనీసంగా వేయి రూపాయలు ఇస్తేనేగానీ పని జరగడం లేదు. కొంతమంది కుటుంబ సభ్యులతో వీడియో కాల్‌లో మాట్లాడించడానికి రూ.300 నుంచి రూ.500, కుటుంబ సభ్యులు ఇచ్చే ఫోన్‌ వారికి చేరవేయడానికి రూ.200...ఇలా ప్రతి పనికీ ఒక రేటు పెట్టేశారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆస్పత్రులైనా విమ్స్‌, కేజీహెచ్‌, ఛాతీ, అంటువ్యాధుల ఆస్పత్రి, ఈఎన్‌టీ ఆస్పత్రుల్లో ఈ తరహా దోపిడీ ఎక్కువగా ఉండగా, కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తూ భారీగా దండేస్తున్నారు. 


పడక కేటాయించాలన్నా.. 


వైరస్‌ బారినపడిన వ్యక్తికి పడక కేటాయించేలా చూడడానికి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల వద్ద దళారులు సిద్ధంగా ఉంటారు. ఆక్సిజన్‌ బెడ్‌కు ఇంత, వెంటిలేటర్‌ బెడ్‌కు ఇంత...అంటూ రేటు చెబుతారు. ఆ మొత్తం చెల్లించడానికి సిద్ధమైతే..అవసరమైన ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకలను ఏర్పాటుచేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లో అయితే ఐదు వేల నుంచి పది వేల రూపాయలు, ప్రైవేటు ఆస్పత్రుల్లో అయితే రూ.50 వేల వరకు డిమాండ్‌ చేస్తున్నారు. 


స్పెషల్‌ కేరింగ్‌కు..


కొవిడ్‌ వార్డుల్లో బాధితులను ప్రత్యేకంగా పట్టించుకునే పరిస్థితి ఉండదు. అదే, కొంత మొత్తం చెల్లిస్తే ప్రత్యేకంగా చూసుకునే ఏర్పాటుచేస్తారు. ఇందుకయ్యే ఖర్చు కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కనీసం ఐదు వేల నుంచి పది వేల రూపాయలు చెల్లించేందుకు సిద్ధమైతే...సదరు వైరస్‌ బాధితుడిని ఎప్పటికప్పుడు వైద్య సిబ్బంది వెళ్లి చూడడంతోపాటు బయట నుంచి కుటుంబ సభ్యులు తీసుకువచ్చే మందులను అందిస్తారు. ఇందుకోసం ఆయా ఆస్పత్రుల్లో కొంతమంది లాబీయింగ్‌ చేసే బ్యాచ్‌ ఉన్నారు. వీళ్లు సదరు వైద్య సిబ్బందికి ఈ మొత్తాన్ని అందజేస్తారు. అయితే, ఈ ప్రక్రియ అత్యంత గోప్యంగా జరుగుతుంది. 


మృతదేహం ఇవ్వాలన్నా.. 


కరోనా బారినపడి చనిపోయినవారి పార్థీవదేహం కోసం కూడా కుటుంబ సభ్యులు భారీగానే వెచ్చించాల్సి వస్తోంది. వార్డు నుంచి మృతదేహాన్ని వేగంగా తీసుకురావడానికి అక్కడ పనిచేసే ఎంఎన్‌వోలు మూడు వేల నుంచి ఐదు వేల రూపాయల వరకు డిమాండ్‌ చేస్తున్నారు. కాదు..కూడదు అంటే.. ఎక్కడ చనిపోయారో తెలియదన్న సమాధానం వస్తుంది. మృతదేహాలను ప్రత్యేకంగా కవర్‌లో ప్యాక్‌ చేస్తారు. సాధారణంగా కుటుంబ సభ్యులకు చివరిచూపు చూసేందుకు అవకాశముండదు. అయితే, కొంత మొత్తం చెల్లిస్తే..ఆ వెసులుబాటును ఇక్కడి సిబ్బంది కల్పిస్తారు. కరోనా బారినపడిన వ్యక్తి కుటుంబ సభ్యులను ఈ విధంగా అడుగడుగునా దోచుకోవడంపై సోషల్‌ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులు దృష్టిసారించి ఈ దోపిడీని అరికట్టాలని కోరు తున్నారు. 

Updated Date - 2021-05-15T05:10:53+05:30 IST