హైదరాబాధ

ABN , First Publish Date - 2020-10-15T07:43:38+05:30 IST

బోలెడన్ని చెరువులు ఉండే హైదరాబాద్‌ను ఒకప్పుడు ‘లేక్స్‌ సిటీ’గా వ్యవహరించేవారు! ఆ చెరువులన్నీ ఇప్పుడు కబ్జాలకు గురై కాలనీలుగా మారిపోయాయి. దీంతో.. ‘‘అన్ని చెరువులను మనమెప్పుడూ చూడలేదే’’ అని

హైదరాబాధ

అరగంట వాన పడితేనే నగరం విలవిల..

విదేశాల్లో వరద నివారణకు పటిష్ఠ చర్యలు

సమగ్ర పట్టణాభివృద్ధి ప్రణాళికతోనే ఈ కష్టాలకు చెక్‌ అంటున్న నిపుణులు


బోలెడన్ని చెరువులు ఉండే హైదరాబాద్‌ను ఒకప్పుడు ‘లేక్స్‌ సిటీ’గా వ్యవహరించేవారు! ఆ చెరువులన్నీ ఇప్పుడు కబ్జాలకు గురై కాలనీలుగా మారిపోయాయి. దీంతో.. ‘‘అన్ని చెరువులను మనమెప్పుడూ చూడలేదే’’ అని ఎవరూ బాధపడకుండా.. కాస్తంత వర్షానికే హైదరాబాద్‌ మహానగరం ఒక భారీ చెరువుగా మారిపోతోంది. ఫ్లై ఓవర్ల మీద నుంచి కిందికి ధారాపాతంగా కారే జలపాతాలు.. రోడ్ల మీద రెండు, మూడు అడుగుల ఎత్తున నిలిచిన నీటితో మహాసంద్రాన్ని తలపిస్తోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరం అతలాకుతలమైన తీరే ఇందుకు నిదర్శనం. నాలాలు, కుంటల ఆక్రమణ.. నిజాంల కాలం నాటి మురుగునీటి పారుదల వ్యవస్థపైనే ఇంకా ఆధారపడటం వంటి తప్పిదాలు ఈ దుస్థితికి కారణం.


13 రాష్ట్రాలలో వరద నీటి పారుదల వ్యవస్థలపై కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ గతంలో అధ్యయనం నిర్వహించగా.. తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన నగరాల జాబితాలో మన భాగ్యనగరం కూడా ఉంది. నగరీకరణతో నగర స్వరూపం సమూలంగా మారిపోవడం, చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం వల్ల నీటి పారుదల, డ్రైనేజీ వ్యవస్ధలపై భారం పడి కాస్తంత వానకే నగం విలవిలలాడుతోంది. అభివృద్ధి పేరిట ప్రకృతిని చెరపట్టడం.. దానివల్ల కలిగే నష్టాలను అంచనా వేసి అందుకనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఈ మునకలకు కారణమన్నది నిపుణుల అభిప్రాయం. విశ్వనగరంగా ఖ్యాతికెక్కిన భాగ్యనగరంతో పోలిస్తే ఎంతో మెరుగైన అభివృద్ధిని సాధించినప్పటికీ అత్యుత్తమ డ్రైనేజీ వ్యవస్థలు కలిగిన అంతర్జాతీయ నగరాలు చాలానే ఉన్నాయి. ఆ నగరాలను పరిశీలిస్తే..


టోక్యోలో వరద సొరంగం..

జపాన్‌ రాజధాని నగరాన్ని వరదల నుంచి కాపాడటానికి ‘‘టోక్యో జైగాంటిక్‌ ఫ్లడ్‌ టన్నెల్‌’’ను నిర్మించారు. దాదాపు 300 కోట్ల డాలర్లను ఖర్చు చేసి నిర్మించిన ఈ టన్నెల్‌ టోక్యో నగరాన్ని మాత్రమే కాపాడుతుండగా.. ఈ నమూనా ప్రపంచంలో మరెన్నో నగరాలనూ కాపాడుతోంది. మన భాగ్యనగరంలో క్యుములోనింబస్‌ మేఘాలు గర్జించినప్పుడే వరదలు వస్తాయిగానీ టోక్యోలో తుఫానులు తరుచుగా వస్తూనే ఉంటాయి. అందుకే వారు ఈ సొరంగాన్ని/భూగర్భమార్గాన్ని నిర్మించారు. ఈ సొరంగం నాలుగు మైళ్ల పొడవు ఉంటుంది. ఈ సొరంగంలోకి నీరు రావడం మొదలు కాగానే నాలుగు భారీ టర్బైన్‌లు ఈ వరద నీటిని ఇడో నదిలోకి పంపించడం ప్రారంభిస్తాయి.


అమెరికా గ్రీన్‌ స్ట్రీట్‌ ప్రోగ్రామ్‌

అమెరికాలో ఎనిమిది నగరాలు గ్రీన్‌స్ట్రీట్‌ ప్రోగ్రామ్‌ను అనుసరిస్తున్నాయి. న్యూయార్క్‌, ఫిలిడెల్ఫియా, పోర్ట్‌ల్యాండ్‌, సియాటెల్‌, లాస్‌ఏంజెలెస్‌ లాంటివి వీటిలో ఉన్నాయి. వరద నీటి నిర్వహణ కోసం ఈ ప్రాజెక్టును చేపట్టారు. అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఈ కార్యక్రమం కొంతమేరకు వరద నీటి కష్టాలను తీరుస్తుందని అంచనా.


బెంగళూరులో చెరువుల పునరుద్ధరణ..

కర్నాటక రాజధాని నగరమైన బెంగళూరులో కూడా చెరువులు పెద్ద సంఖ్యలోనే ఉండేవి. అక్కడ కూడా ఆక్రమణలు పెరిగిన తరువాత ఎన్విరాన్‌మెంట్‌ సపోర్ట్‌ గ్రూప్‌ (ఈఎ్‌సజీ) చెరువుల పరిరక్షణ గురించి అవగాహన కల్పించడం ప్రారంభించింది. దాదాపు 450 చెరువులను అక్కడ పరిరక్షిస్తున్నారు.


ఈ పరిస్థితి మారాలంటే..

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సగం మందికి పైగా పట్టణాలలోనే జీవిస్తున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరాభివృద్ధి కూడా జరుగుతుంది. కానీ, ఆ క్రమంలో ఇలాంటి వరదలతో ప్రజలు ఇబ్బంది పడకూడదు. అలా పడకూడదంటే ఏం చేయాలంటే..

నగరాభివృద్ధి సమగ్రంగా ఉండాలి. అభివృద్ధి పేరిట సహజ వనరులను నాశనం చేయకూడదు. పార్కులు, చెరువులు కాపాడుకోవాలి. 

వరద నీటి నిర్వహణ సరిగా జరగాలంటే నీటి కుంటలు, పచ్చదనం కూడా సరిగ్గా ఉండాల్సిందే. పట్టణ ప్రణాళికలో సహజ స్పాంజ్‌లుగా నిలిచేవి చెరువులే ! భూగర్భంలో నీరు పెరగడానికీ ఇవి దోహదం చేస్తాయి.

పటిష్ఠమైన మురుగునీటి పారుదల వ్యవస్థ ఉండాలి. అప్పుడే నగరాల్లో ఆహ్లాదంగా ఉండగలం. ఉపరితల నీటి నిర్వహణ మెరుగ్గా ఉండి, భూగర్భ జలాలను పరిరక్షించుకుంటే ఫలితాలు కూడా ఉత్తమంగా ఉంటాయి.

క్యాచ్‌మెంట్‌ ఏరియా సరిగ్గా ఉండాలి. అప్పుడే నగరాల్లో వరద నీటి నిర్వహణ కూడా మెరుగ్గా ఉంటుంది. నీటిపారుదల, మురుగునీటి శాఖలు సమన్వయంతో పనిచేస్తేనే ఇది సాధ్యమవుతుంది. నగరంలో మునకలకు కారణం ఈ క్యాచ్‌మెంట్‌ ఏరియాలలో సైతం భవంతులు రావడం!

పట్టణ ప్రణాళికలో వర్షపాతాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని అందుకనుగుణంగా ప్రణాళిక చేయాల్సి ఉంటుంది. కనీసం 100 సంవత్సరాల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని పట్టణ ప్రణాళిక చేస్తేనే కొంతమేరకు సత్ఫలితాలు వస్తాయి.


నీటి ప్రవాహ వ్యవస్థకు ప్రాధాన్యమివ్వాలి

విదేశాల్లో నదులకు, చెరువులకు, నాలాలకు బఫర్‌జోన్లను నిర్ణయిస్తే అందులో ఎలాంటి నిర్మాణాలూ రావు. కానీ హైదరాబాద్‌లో అందుకు భిన్నమైన పరిస్థితి. దీంతో వర్షం వస్తే కాలనీలన్నీ చెరువులవుతున్నాయి. ఎఫ్‌టీఎల్‌లో కూడా నిర్మాణాలు వచ్చాయి. ఎన్నో చెరువులు నగరాభివృద్ధిలో సమాధయ్యాయి. దీంతో వర్షం వస్తే భూమిలోకి నీరు ఇంకడం తగ్గింది. రోడ్లపై నీళ్లు నిలిచిపోవడం పెరిగింది. సాధారణ నీటి ప్రవాహ వ్యవస్థకు విదేశాల్లో ప్రాధాన్యమిస్తారు. కానీ, నగరంలో ఆ పరిస్థితి లేదు. ఇక్కడ కూడా అలా ప్రాధాన్యమిస్తే పరిస్థితి మెరుగుపడుతుంది.

 జేఎన్‌టీయూహెచ్‌, ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎంవీఎ్‌సఎస్‌ గిరిధర్‌

Updated Date - 2020-10-15T07:43:38+05:30 IST