ప్రయోగాలు ఫెయిల్‌

ABN , First Publish Date - 2022-06-08T06:36:12+05:30 IST

ప్రభుత్వ ప్రయోగాలే విద్యార్థుల పాలిట శాపంగా మారాయా...? ఉన్నఫలంగా ప్రశ్న పత్రం ప్యాటర్న్‌ మార్చడమే ఫెయిల్‌కు కారణమా..? బిట్‌ పేపర్‌ తీసేయడంతో వేలాది మంది విద్యార్థులు నష్టపోయారా..? పాస్‌ పర్సెంటేజీ తగ్గడానికి ఇవే కారణాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ప్రయోగాలు ఫెయిల్‌

పది ఫలితాలకు ఇదే కారణమా..?

బిట్‌ పేపర్‌ తీసేసి..7  పేపర్లకు కుదించారు

ఉపాధ్యాయులకు బోధనేతర పనుల ఒత్తిడి

కొవిడ్‌ దెబ్బకు రెండేళ్లు కుంటుపడిన బోధన


అనంతపురం విద్య, జూన్‌ 7: ప్రభుత్వ ప్రయోగాలే విద్యార్థుల పాలిట శాపంగా మారాయా...? ఉన్నఫలంగా ప్రశ్న పత్రం ప్యాటర్న్‌ మార్చడమే ఫెయిల్‌కు కారణమా..? బిట్‌ పేపర్‌ తీసేయడంతో వేలాది మంది విద్యార్థులు నష్టపోయారా..? పాస్‌ పర్సెంటేజీ తగ్గడానికి ఇవే కారణాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒక వైపు బోధన సరిగా లేకపోవడం... మరో వైపు కరోనాతో స్కూళ్లు కుంటుపడటం కూడా పది ఫలితాలపై ప్రభావం చూపించాయన్న వాదన వినిపిస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా 49.70 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో అట్టడుగున నిలిచి.. అప్రతిష్టను మూటగట్టుకుంది. 


పాపం గ్రామీణ విద్యార్థులు..

గ్రామీణ ప్రాంత విద్యార్థులు భారీగా పరీక్షలు తప్పారు. వీరు ఎక్కువగా ప్రభుత్వ యాజమాన్యపాఠశాలల్లో చదివారు. రూరల్‌ ఏరియాలో 554 ప్రభుత్వ స్కూళ్లలో 26,625 మంది పరీక్షలు రాశారు. వీరిలో 9,770 మంది పాస్‌కాగా, 16,851 మంది ఫెయిల్‌ అయ్యారు. రూరల్‌ ఏరియాలోని 161 ప్రైవేట్‌ స్కూళ్లలో 6,177 మంది పరీక్షలురాస్తే, 4,843 మంది పాస్‌ అయ్యారు. 1,332 మంది ఫెయిల్‌ అయ్యారు. పట్టణ ప్రాంతాల్లో 94 ప్రభుత్వ స్కూళ్లలో 8,552 మంది పరీక్షలు రాస్తే.. 3,336 మంది పాస్‌ కాగా 5,216 మంది ఫెయిల్‌ అయ్యారు. పట్టణ ప్రాంతంలోని 182 ప్రైవేట్‌ స్కూళ్లలో 9,200 మంది పరీక్షలు రాస్తే.. 7,177 మంది పాస్‌ కాగా 2,022 మంది ఫెయిల్‌ అయ్యారు. 


బిట్‌ పేపర్‌ లేక..

పదో తరగతి ఫలితాలు పేలవంగా ఉండటానికి జిల్లా విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంతో పాటు.. ప్రభుత్వం సంస్కరణల పేరుతో చేసిన ప్రయోగాలు కూడా కారణమని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఏటా విద్యార్థులు హిందీ మినహా, అన్ని పరీక్షలను ఒక్కో పేపరుకు 50 మార్కుల ప్రకారం 2 పేపర్లు రాసేవారు. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నఫలంగా వాటికి 11 పేపర్లను ఏడింటికి కుదించింది. సైన్స్‌ మినహా మిగిలిన వాటిని 100 మార్కులు నిర్వహించింది. విద్యార్థులు పాస్‌ కావడానికి దోహదం చేసే బిట్‌ పేపర్‌ను తీసేశారు. 11 పేపర్లు ఉన్నప్పుడు ప్రతి విద్యార్థి బిట్స్‌ టచ చేసి, మూడు, నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాసి పాస్‌ అయ్యేవారు. ఈ ఏడాది బిట్‌ పేపర్‌లేక వేలాది మంది విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారన్నది మేధావుల అభిప్రాయం.


- సబ్జక్టు టీచర్ల కొరతను ప్రభుత్వం తీర్చలేకపోయింది. గతంలో విద్యా వలంటీర్లు లేదా అకడమిక్‌ ఇనస్ట్రక్లర్లను నియమించి, ఈ కొరతను తీర్చేవారు. దీంతోపాటు రెండేళ్లుగా కరోనా వల్ల స్కూళ్లలో బోధన లేకపోయింది. యాప్స్‌, బోధనేతర పనులకు టీచర్లు, ప్రధానోపాధ్యాయులను ప్రభుత్వం వినియోగించింది. ఇవన్నీ విద్యార్థులకు శాపంగా మారాయి. 


కూడేరు లాస్ట్‌..

అనంతపురం జిల్లాలో 31 మండలాలు ఉన్నాయి. అనంతపురం మండలం 69 శాతంలో టాప్‌లో నిలిచింది. కూడేరు మండలం 18 శాతం ఉత్తీర్ణతతో చివరలో నిలిచింది. అనంతపురం మండలంలో 6,914 మంది పరీక్షలకు హాజరు కాగా, 4,771 మంది పాస్‌ కాగా 2,142 మంది ఫెయిల్‌ అయ్యారు. కూడేరు మండలంలో 300 మంది పరీక్షలకు హాజరు కాగా.. కేవలం 54 మంది పాస్‌ అయ్యారు. చాలా మండలాలు 35 శాతం కూడా ఫలితాలు సాధించలేదు. వజ్రకరూరు 20.04, బొమ్మనహాళ్‌ 26.24, శెట్టూరు 26.84, గుమ్మఘట్ట 27.69, కణేకల్లు 27.72, ఆత్మకూరు 29.97, గార్లదిన్నె 30.43, డీ హీరేహాళ్‌ 33.51 శాతం పాస్‌ పర్సెంటేజీ నమోదు చేసుకున్నాయి. 


ప్రైవేటే మెరుగు

అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ స్కూళ్లలో 78.17 శాతం ఉత్తీర్ణత సాధించారు. 343 స్కూళ్లలో 15,377 మంది పరీక్షలకు హాజరు కాగా, 12,020 మంది పాసయ్యారు. కేవలం 3,354 మంది ఫెయిల్‌ అయ్యారు. అదే ప్రభుత్వ విద్యాసంస్థల్లో 648 స్కూళ్లలో 35,177 మంది పరీక్షలకు హాజరైతే... కేవలం 13,106 మంది పాస్‌ అయ్యా రు. ఏకంగా 22,067 మంది ఫెయిల్‌ అయ్యారు.




ఆ అంశాలు దెబ్బతీశాయి..

పది ఫలితాలను నాలుగు అంశాలు దెబ్బతీశాయి. ప్రధానంగా కరోనా ప్రభావం ఒకటైతే... సబ్జెక్టు టీచర్ల కొరత, యాప్స్‌ భారం, పేపర్లను కుదించడం ప్రధాన కారణాలు. బిట్‌పేపర్లు సైతం తొలగించారు. సబ్జెక్టు టీచర్లు లేనిచోట గతంలో అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లను నియమించేవారు. ఇప్పుడు అదీలేదు. డీఎస్సీతో పోస్టులూ భర్తీ చేయలేదు. స్కూల్‌ ఉదయం తెరిస్తే, యా ప్స్‌ పనేగాని, వారికి ఏమి కావాలని అడిగింది లేదు. కొత్త విద్యా సంవత్సరంలో ఈ లోపాలు సవరించుకుంటే... మెరుగైన ఫలితాలు ఆశించవచ్చు.

- కత్తి నరసింహారెడ్డి, ఎమ్మెల్సీ 

Updated Date - 2022-06-08T06:36:12+05:30 IST