పది నిమిషాల్లోనే కరోనాను నిర్థారించే మార్గాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్తలు

ABN , First Publish Date - 2020-05-31T05:40:26+05:30 IST

కరోనా సోకిందో లేదో పదే నిమిషాల్లో గుర్తించే పరీక్షను కనుగొన్నట్టు అమెరికాకు

పది నిమిషాల్లోనే కరోనాను నిర్థారించే మార్గాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్తలు

మేరీల్యాండ్: కరోనా సోకిందో లేదో పదే నిమిషాల్లో గుర్తించే పరీక్షను కనుగొన్నట్టు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రస్తుతం లాబరేటరీ టెక్నిక్‌ల ద్వారా కరోనాను గుర్తిస్తున్నారని.. ఆ అవసరం కూడా లేకుండానే కరోనాను గుర్తించే పరీక్షను కనుగొన్నామని యూనివర్శిటి ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు తెలిపారు. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం.. గోల్డ్ నానోపార్టికల్స్‌కు అనుసంధానించిన నిర్దిష్ట అణువు కరోనా వైరస్‌‌కు సంబంధించిన జన్యుశ్రేణిలోని నిర్దిష్ట ప్రొటీన్‌ను గుర్తిస్తుంది. ఈ బయోసెన్సార్ జన్యుశ్రేణికి అనుసంధానించినప్పుడు గోల్డ్ పార్టికల్స్ లిక్విడ్‌ను పర్పుల్ నుంచి బ్లూ రంగులోకి మారుస్తాయి. కరోనా సోకినప్పుడే ఈ రంగు మారుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.


ఈ ప్రక్రియ మొత్తం కేవలం పది నిమిషాల్లో పూర్తవుతుందని వెల్లడించారు. ప్రస్తుతం ఒక వ్యక్తి కరోనా బారిన పడితే కనీసం వారం రోజులకు గాని కరోనా పాజిటివ్ రావడం లేదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కానీ, కొత్త పరీక్ష ద్వారా కరోనా సోకిన రోజే వైరస్ ఉన్నట్టు గుర్తించవచ్చని పేర్కొన్నారు. ఈ పరీక్షలో కరోనా సోకితే నెగిటివ్ అని.. కరోనా సోకకపోయినా పాజిటివ్ అని వచ్చే అవకాశమే లేదన్నారు. ప్రస్తుత ల్యాబ్ పరీక్షల ఖర్చుతో పోల్చినా దీనికి చాలా తక్కువ ఖర్చు అవుతుందన్నారు. కాగా.. ఈ పరీక్ష పూర్తిస్థాయిలో మంచి ఫలితాలిస్తుందా లేదా తెలుసుకోవడానికి మరికొన్ని అధ్యయనాలు చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.   

Updated Date - 2020-05-31T05:40:26+05:30 IST