కారుచౌక!

ABN , First Publish Date - 2022-06-24T08:07:08+05:30 IST

రాజకీయ పార్టీ కార్యాలయాలకు స్థలాల కేటాయింపు అంశం తీవ్ర దుమారం రేపుతోంది. దీనికి ఒక పద్ధతి, విధానం అంటూ లేకుండా పోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కారుచౌక!

  • టీఆర్‌ఎస్‌ కార్యాలయాలకు ఖరీదైన భూములు
  • 33 జిల్లాల్లోనూ అతి తక్కువ ధరకే.. ఇప్పటికే పూర్తి కావస్తున్న భవనాలు
  • కరీంనగర్‌లో రూ.లక్షకే ఎకరం..! భూపాలపల్లిలో రెండెకరాల కేటాయింపు
  • లీజు తొలగించినా కామారెడ్డిలో 99 ఏళ్లకు.. విపక్షాలకు స్థలాల ఊసే లేదు
  • మా పార్టీ ఆఫీసులకు భూములివ్వరా?.. ప్రభుత్వాన్ని నిలదీస్తున్న ప్రతిపక్షాలు
  • హైకోర్టు నోటీసుల నేపథ్యంలో మళ్లీ తెరపైకి


హైదరాబాద్‌/న్యూస్‌ నెట్‌వర్క్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): రాజకీయ పార్టీ కార్యాలయాలకు స్థలాల కేటాయింపు అంశం తీవ్ర దుమారం రేపుతోంది. దీనికి ఒక పద్ధతి, విధానం అంటూ లేకుండా పోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీకో న్యాయం.. ప్రతిపక్షాలకో న్యాయం అన్నట్లుగా ఉందని మండిపడుతున్నాయి. స్థలాల కేటాయింపు కోసం కొత్తగా అమల్లోకి తెచ్చిన విధానం ఒక్క టీఆర్‌ఎస్‌ పార్టీకే వర్తిస్తోందని, ఇతర పార్టీలకు వర్తించడం లేదని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పైగా పాత విధానం బాగా లేదంటూ కొత్త విధానం తెస్తున్నామని చెప్పుకొన్న ప్రభుత్వం.. ఇతర పార్టీలకు స్థలాలను ఎందుకివ్వడం లేదని ప్రశ్నిస్తున్నాయి. ఎక్కడా లేని విధంగా కారుచౌకగా స్థలాలను కేటాయించాలని నిర్ణయించినప్పుడు.. అందరికీ సమ న్యాయం పాటించాలి కదా అని వాదిస్తున్నాయి. గజం రూ.100 చొప్పున నిర్ణయించి, విలువైన స్థలాలను టీఆర్‌ఎస్‌ కొట్టేస్తోందని విమర్శిస్తున్నాయి. జిల్లా కేంద్రాల్లోని ప్రధాన ప్రాంతాల్లో కోట్లాది రూపాయల విలువ చేసే స్థలాలను లాగేసుకుని, భవనాలు నిర్మించుకుంటోందని ఆరోపిస్తున్నాయి. అలాంటి స్థలాలనే తమకూ కేటాయించాలని కోరితే ఎందుకివ్వడం లేదని నిలదీస్తున్నాయి. 


ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు.. తమకు స్థలాలు కేటాయించాలంటూ లేఖలు రాశాయి. జిల్లాలవారీగా కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించాయి. కానీ, వాటిపై ఉలుకూ పలుకూ లేదు. మరోపక్క టీఆర్‌ఎస్‌ భవనాలు మాత్రం పూర్తి కావస్తున్నాయి. జనగామ జిల్లా భవనాన్ని ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. మరిన్ని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ భవనాలను చూసి ఇతర పార్టీల నేతలు ఆగ్రహోదగ్రులవుతున్నారు. తమకూ స్థలాలను కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా గురువారం హైకోర్టు స్పందనతో మరింత మండిపడుతున్నారు. హైదరాబాద్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ కార్యాలయం కోసం బంజారాహిల్స్‌లో ప్రభుత్వం 4,935 గజాల స్థలాన్ని కేటాయించింది. అత్యంత ఖరీదైన ఈ భూమిని కేవలం గజం రూ.100 చొప్పున నామమాత్రపు ధరతో కేటాయించింది. అన్ని జిల్లా కేంద్రాల్లో టీఆర్‌ఎస్‌ కార్యాలయాల భవనాలకు ఇలాగే స్థలాలను దఖలు పర్చింది. దీన్ని సవాలు చేస్తూ మహేశ్వర్‌రాజ్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం సీఎం కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీసీఎల్‌ఏ, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. దీంతో స్థలాల కేటాయింపు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. టీఆర్‌ఎస్‌ మాదిరిగానే తమ పార్టీలకూ స్థలాలు కేటాయించాలని విపక్ష నేతలు కోరుతున్నారు.


స్థలాలను పార్టీలకే కేటాయిస్తూ కొత్త విధానం

నిజానికి రాజకీయ పార్టీల కార్యాలయ భవనాలకు స్థలాలను కేటాయించాలన్న విధానం ఇప్పటిది కాదు. 1987 ఆగస్టు 31న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జీవో 826ను జారీ చేయడం ద్వారా.. పార్టీ కార్యాలయాలకు స్థలాల కేటాయింపు విధానాన్ని అమల్లోకి తెచ్చింది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు రాష్ట్ర, జిల్లా కేంద్రాల్లో కార్యాలయ భవనాల నిర్మాణానికి ఒక ఎకరానికి మించకుండా స్థలం కేటాయించాలని నిర్దేశించింది. దీన్ని 30 ఏళ్ల లీజు పద్ధతిన కేటాయించాలని నిర్ణయించింది. ఆ తదుపరి లీజుదారు కోరిక మేరకు గడువును పొడిగించవచ్చని తెలిపింది. అయితే రాష్ట్ర, జిల్లా కేంద్రాల్లో ఆ పార్టీకి ఎలాంటి సొంత స్థలం, భవనం ఉండకూడదన్న నిబంధన విధించింది. పైగా ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంటేనే కేటాయిస్తామని స్పష్టం చేసింది. కానీ, టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ విధానాన్ని మార్చేసింది. లీజు పద్ధతిన కాకుండా పార్టీలకే స్థలాలను కేటాయించేలా 2018 ఆగస్టు 16న జీవో 167ను జారీ చేసింది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు జిల్లా కేంద్రాల్లో తమ భవనాలను నిర్మించుకోవడానికి గజానికి రూ.100 చొప్పున ఎకరానికి మించకుండా స్థలాలను కేటాయిస్తామని వెల్లడించింది. 1987లో జారీ చేసిన జీవోను రద్దు చేస్తూ ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తెస్తున్నామని తెలిపింది. ఈ ఉత్తర్వులను అనుసరించి ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ కార్యాలయాలకు 33 జిల్లా కేంద్రాల్లో స్థలాలను కేటాయించింది. ఇతర పార్టీలకు మాత్రం ఇవ్వలేదు.


జిల్లాల వారీగా.. కారుచౌకగా..

కరీంనగర్‌లో గజం రూ.20-25 వేలు పలుకుతోంది. దీని ప్రకారం రూ.12 కోట్ల విలువైన స్థలాన్ని రూ.3 లక్షలకే కేటాయించారు. హనుమకొండలో గజానికి రూ.100 చొప్పున 4000 గజాలు కేటాయించారు. ఇక్కడ గజం విలువ రూ.75 వేలకు పైగానే ఉంటుంది. అంటే మొత్తం స్థలం విలువ రూ.35 కోట్ల పైమాటే! ఆదిలాబాద్‌లోని కైలా్‌సనగర్‌ కాలనీలో గజానికి రూ.100 చొప్పున మొత్తం రూ.4.34 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన 36 గుంటల భూమి విలువ రూ.5 కోట్లకు పైగా ఉంటుంది. పెద్దపల్లిలో రూ.100కు గజం చొప్పున ఎకరం స్థలం కేటాయించారు. ఇక్కడ గజం రూ.10-12 వేలు పలుకుతోంది. మార్కెట్‌ విలువ ప్రకారం దీని ధర రూ.5 కోట్ల వరకు ఉంటుంది. మంచిర్యాల జిల్లా భవనం కోసం నస్పూర్‌లో గజానికి రూ.100 చొప్పున రూ.4.84 లక్షలను చెల్లించి ఎకరం స్థలాన్ని కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఇక్కడ గజం రూ. 21 వేల వరకు ఉంది. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా భవనం కోసం దుండిగల్‌లో ఎకరం భూమిని తీసుకున్నారు. ఇప్పటివరకు దీనికి రూ.86 వేలు చెల్లించారు. ఈ భూమి విలువ రూ.5 కోట్లు పలుకుతోంది. జగిత్యాలలోని థరూర్‌ క్యాంప్‌ లో 2018లో ఎకరం స్థలాన్ని కేటాయించారు. 2019లో భవనం పనులు ప్రారంభించగా.. ఇప్పుడు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఇక్కడ గజం విలువ రూ.25 వేలుగా ఉంది. కామారెడ్డిలోని భవనానికి ఎకరం ప్రభుత్వ స్థలాన్ని 99 ఏళ్ల లీజుకు తీసుకున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఏటా ప్రభుత్వానికి రూ.10,000 చొప్పున చెలించాల్సి ఉంటుంది. 


ఈ స్థలంపై ఇద్దరు వ్యక్తులు కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చారు. దీంతో రెండేళ్ల నుంచి నిర్మాణ పనులు సాగడం లేదు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గల ఎకరం మార్కెట్‌ యార్డు స్థలాన్ని కేటాయించారు. దీనికి రూ.6లక్షలు చెల్లించగా.. మార్కెట్‌ విలువ రూ.1.50-1.70 కోట్ల వరకు ఉంది. జనగామలో గజానికి రూ.100 చొప్పున రూ.4.80 లక్షలు చెల్లించి ఎకరం స్థలాన్ని తీసుకున్నారు. పార్టీ భవనం కోసం రోడ్డుకు రెండో బిట్‌ భూమిని ఇవ్వగా మొదటి బిట్‌లో ఉన్న మరో అర ఎకరం అసైన్డ్‌ భూమిని సైతం ఆక్రమించి ప్రహరీ గోడను నిర్మించారు. అధికారులు అభ్యంతరం తెలపడంతో ఆ అర ఎకరం భూమిని కూడా పార్టీ కార్యాలయానికి ఇవ్వాలంటూ అర్జీ పెట్టారు. దీనిపై జిల్లా అధికారులు ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఈ భవనం పూర్తి కావడంతో ఫిబ్రవరి 11న సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. వరంగల్‌ భవనం కోసం గజానికి రూ.100 చొప్పున ఎకరం భూమిని కేటాయించారు. మామునూరు ఎయిర్‌పోర్టు సమీపంలో ఉండడంతో ఇక్కడ గజం ధర రూ.30 వేల వరకు ఉంది. ఖమ్మం జిల్లా భవనానికి రూ.100 గజం చొప్పున ఎకరం స్థలాన్ని కేటాయించగా.. ఇక్కడ గజం విలువ రూ.30 వేల వరకు ఉంది. మెదక్‌ జిల్లా కార్యాలయానికి మెదక్‌-రామాయంపేట రహదారిలో ఎకరం స్థలాన్ని కేటాయించారు. దీని విలువ రూ.కోటి వరకు ఉంటుంది. భవన నిర్మాణం రెండేళ్ల కిందటే పూర్తయింది. 


భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా కార్యాలయానికి 15వ వార్డులో కేటాయించిన స్థలం విలువ రూ.2.33 కోట్లు పలుకుతోంది. యాదాద్రి-భువనగిరి జిల్లా టీఆర్‌ఎస్‌ కార్యాలయ భవనాన్నిభువనగిరి బైపాస్‌ రోడ్‌లో జాతీయ రహదారి పక్కన నిర్మించారు. ఈ స్థలానికి పార్టీ రూ.4.84 లక్షలు చెల్లించగా.. దీని ధర రూ.5 కోట్ల వరకు ఉంటుంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఎకరం భూమిని కేటాయించారు. దీనికి రూ.60,000 డిపాజిట్‌ చేశారు. ఇక్కడ ప్రస్తుతం ఎకరం ధర రూ.8 కోట్ల వరకు పలుకుతుంది. నిర్మల్‌ జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న కొండాపూర్‌ వద్ద ఎస్సీ కార్పొరేషన్‌కు చెందిన ఎకరం భూమిని టీఆర్‌ఎ్‌సకు కేటాయించారు. దీనికి రూ.4 లక్షలే చెల్లించారు. ఇక్కడ ఎకరం రూ.5 కోట్ల వరకు ఉంది. నిజామాబాద్‌ జిల్లా కార్యాలయానికి 3800 గజాలను కేటాయించారు. ఇక్కడ ప్రస్తుతం గజం రూ.30 వేలు పలుకుతోంది. వికారాబాద్‌లో ఎకరం స్థలానికి రూ.4.84 లక్షలు చెల్లించారు. దీని విలువ రూ.3.5 కోట్లు ఉంది. రాజన్న-సిరిసిల్ల జిల్లాలో ఎకరం స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇక్కడ గజం విలువ రూ.25 వేలు ఉంది. సంగారెడ్డి జిల్లా కార్యాలయానికి ఎకరం కేవలం రూ.2 లక్షలకే కేటాయించారు. ఇక్కడ ఎకరం రూ.4-5 కోట్ల వరకు ఉంది. 


అన్ని పార్టీల నుంచి డిమాండ్లు..

జిల్లా కేంద్రాల్లో స్థలాలను కేటాయిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం 2018లో జీవో ఇవ్వగానే రాజకీయ పార్టీలన్నీ అప్రమత్తమయ్యాయి. తమకూ స్థలాలు కేటాయించాలని డిమాండ్‌ చేశాయి. టీఆర్‌ఎస్‌ కార్యాలయాలకు కేటాయించినట్లుగానే తమకూ ఇవ్వాలంటూ వినతులను సమర్పించాయి. అన్ని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ (డీసీసీ)లు తమ భవనాల నిర్మాణానికి స్థలాలు కేటాయించాలంటూ ఎక్కడికక్కడ కలెక్టర్లకు వినతిపత్రాలు ఇచ్చాయి. బీజేపీ, సీపీఐ, సీపీఎం పార్టీలూ వినతిపత్రాలు సమర్పించాయి. అయినా స్థలాలు కేటాయించకపోవడంతో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం 2020 ఆగస్టు 24న సీఎం కేసీఆర్‌కు, 2022 మే 14న సీఎ్‌సకు లేఖలు రాశారు. తక్షణమే స్థలాలు కేటాయించాలని సీఎం, సీఎ్‌సను కోరారు. కానీ, జిల్లాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ భవనాల నిర్మాణం పూర్తి కావస్తుండగా.. ఇతర పార్టీలకు స్థలాలే ఇవ్వలేదు.


ఖరీదైన స్థలాల్లో గులాబీ భవనాలు

జీవో వెలువడడమే ఆలస్యం.. టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయాలకు చకచకా స్థలాలు కేటాయించేశారు. పార్టీ వద్ద నిధులు ఉండడంతో భవనాల నిర్మాణాలూ ప్రారంభమయ్యాయి. కొన్ని ప్రారంభోత్సవాలు కూడా చేసుకున్నాయి. వీటిని చూసి ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. నల్లగొండ జిల్లా టీఆర్‌ఎస్‌ కార్యాలయానికి ఎకరం స్థలాన్ని కేటాయించారు. గతంలో ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థ ఆగ్రో ఇండస్ట్రీస్‌ కార్యాలయం ఉండేది. ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం ఎకరం రూ.3.50 కోట్లు పలుకుతోంది. అంటే గజం రూ.7500 వరకు ఉంటుంది. కానీ, టీఆర్‌ఎ్‌సకు గజం 65 రూపాయల చొప్పున ఎకరం భూమిని కేటాయించడం గమనార్హం.


నిబంధనలకు తిలోదకాలు..

టీఆర్‌ఎస్‌కు జిల్లాల్లో కేటాయించిన స్థలాల్లో నిబంధనలకు తిలోదకాలిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గజం స్థలాన్ని రూ.100 చొప్పున కేటాయించాలంటూ జీవోలో పేర్కొనగా.. నల్లగొండ జిల్లాలో గజానికి రూ.65 చొప్పున రూ.3 లక్షలు చెల్లించారు. కరీంనగర్‌ జిల్లాలో కేవలం రూ.లక్ష మాత్రమే చెల్లించి ఎరకం భూమి సొంతం చేసుకున్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్ర భవన స్థలం మరీ వివాదాస్పదంగా ఉంది. కొత్త జీవో ప్రకారం ఎకరానికి మించి స్థలాన్ని కేటాయించకూడదు. కానీ, ఇక్కడి భవనానికి ఏకంగా రెండెకరాలు ఇచ్చేశారు. లీజు పద్ధతిని తొలగించినా.. కామారెడ్డిలో మాత్రం 99 ఏళ్ల లీజు విధానంలో తీసుకున్నారు. పైగా ఈ స్థలం కోర్టు కేసులో ఉంది. 

Updated Date - 2022-06-24T08:07:08+05:30 IST