ఎదురుచూపులు

ABN , First Publish Date - 2022-05-09T07:43:52+05:30 IST

జిల్లాలోని ఉపాధ్యా యులకు పదోన్నలు, బదిలీల కోసం ఏళ్లుగా ఎదురుచూపులు తప్పడం లేదు. వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు నిర్వహించాలని తద్వారా విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగదని ఉపా ధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతుంటే ఇప్పటికే ప్రక్రియ ప్రారంభంకావాల్సి ఉండగా ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేవు.

ఎదురుచూపులు

పదోన్నతులు, బదిలీల కోసం ఏళ్లుగా ఉపాధ్యాయల ఎదురుచూపులు

విద్యాసంవత్సరం ప్రారంభంలోగా ప్రక్రియ నిర్వహణపై అనుమానాలు

ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న అధికారులు

నిజామాబాద్‌ అర్బన్‌, మే 8: జిల్లాలోని ఉపాధ్యా యులకు పదోన్నలు, బదిలీల కోసం ఏళ్లుగా ఎదురుచూపులు తప్పడం లేదు. వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు నిర్వహించాలని తద్వారా విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగదని ఉపా ధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతుంటే ఇప్పటికే ప్రక్రియ ప్రారంభంకావాల్సి ఉండగా ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేవు. జూన్‌ 13 నుంచి నూతన విద్యాసంవత్సరం ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆలోపు ప్రభుత్వం బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభిస్తుందో లేదోనన్న అనుమానాలు ఉపాధ్యాయుల్లో వ్యక్తమవుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులు ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉపాధ్యాయ సంఘాల నేతలు, టీచర్‌ ఎమ్మెల్సీలతో సమావేశమై త్వరలో బదిలీలు, పదోన్నతులపై సంకేతాలు ఇచ్చినా ఇంకా స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో  వేసవి సెలవుల్లోనే బదిలీలు, పదోన్నతులు జ రుగుతాయా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.

స్పష్టతలేని అంశాలెన్నో..

ఎన్నో ఏళ్లుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులు ప్రభుత్వం ఏ ప్రాతిపదికన పదోన్నతులు నిర్వహిస్తుందో స్పష్టతలేక పోవడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. 2015లో ప్రభుత్వం ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు నిర్వహించింది. గత ఏడేళ్లుగా ఉపాధ్యాయులకు పదోన్నతులు లేవు. కొంతమంది పదోన్నతులు పొందకుండానే రిటైర్డ్‌ కాగా ఏకీకృత సర్వీస్‌రూల్స్‌ అంశం న్యాయస్థానంలో ఉంది. స్కూల్‌ అసిస్టెంట్‌లు, ప్రధానోపాధ్యాయులకు పదోన్నతుల విషయంలో ఇబ్బందులు లేనప్పటికీ భాషా పండితులు, పీఈటీలను స్కూల్‌ అసిస్టెంట్‌లతో సమానంగా అప్‌గ్రేడ్‌ విషయంలో సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చినా ఎస్‌జీటీ కోర్టులో కేసు వేయడంతో హైకోర్టు స్టే ఇచ్చింది. సర్వీస్‌ నిబంధనలు సవరిస్తూ ప్రభుత్వం 2020లో జీవోలు ఇచ్చినా హైకోర్టు పండిట్‌, పీఈటీల అప్‌గ్రేడేషన్‌ విషయంలో స్టే ఇవ్వడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. 317 జీవో ప్రకారం జోనల్‌ వ్యవస్థలో భాగంగా కొత్త జిల్లాల వారిగా ఉపాధ్యాయులను కేటాయించగా ఇంకా చాలామంది ఉపాధ్యాయులు తమకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. కొంతమంది న్యా యస్థానాలను ఆశ్రయించగా వారిని ఏఏ జిల్లాలకు కేటాయించాలనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.

సీనియారిటీ జాబితా ప్రకారమే పదోన్నతులు..

ఉపాధ్యాయుల పదోన్నతుల విషయంలో సీనియారిటీ జాబితా ప్రకారమే ముందుకు వెళ్లాలని ప్రభు త్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు సీనియారిటీ జాబితాను రూ పొందించే ప్రక్రియను ప్రారంభించినట్లు తెలుస్తోంది. అన్ని కేటగిరిలలో సీనియారిటీ జాబితాను రూపొందించేందుకు అన్ని కేటగిరిలలో సిద్ధమవుతున్నారు. జిల్లా లో తెలుగు, మరాఠి, ఉర్దూ మాధ్యమాల్లో కేటగిరిల వారీగా ఖాళీల జాబితాను సైతం విద్యాశాఖ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 500 పైగా ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్లు సమాచారం. 

విద్యాసంవత్సరం ప్రారంభంలోగా అయ్యేనా?

జూన్‌ 13 నుంచి నూతన విద్యాసంవత్సరం ప్రారంభంకానున్న నేపథ్యంలో పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తవుతుందా అనే అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పదోన్నతులు, బదిలీల విషయంలో కోర్టులో కేసులతో కొన్ని అంశాలలో స్పష్టతలేకపోవడం, ఇంకా సీనియారిటీ జాబితా రూపొందించకపోవడం వంటి విషయాలతో వేసవి సెలవులు ముగిసేలోగా బదిలీలు, పదోన్నతులు జరుగుతాయో జరగవోనని ఉపాధ్యాయులు ఆందళన చెందుతున్నారు. ఇప్నటికే ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వగా జూన్‌ 12న టెట్‌ నిర్వహిస్తున్నారు. టెట్‌ ఫలితాల తర్వాత నూతన ఉపాధ్యాయులను నియమిస్తారాలేక అంతలోగా పదోన్నతులు, బదిలీలు చేపడతారా అనే విషయంలో ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేవు.

ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు..

ఫ దుర్గాప్రసాద్‌, డీఈవో

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల విషయంలో ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే జిల్లాలో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాం. 

Read more