పాఠ్యపుస్తకాల కోసం ఎదురుచూపులు

ABN , First Publish Date - 2022-06-22T04:36:09+05:30 IST

పాఠ్యపుస్తకాల కోసం ఎదురుచూపులు

పాఠ్యపుస్తకాల కోసం ఎదురుచూపులు
మేడ్చల్‌ జిల్లా పాఠ్యపుస్తకాల గోదాంలోకి తక్కువ మొత్తంలో వచ్చిన పుస్తకాలు

  • ఈసారి నుంచి ఇంగ్లిష్‌ మాధ్యమంలో బోధన
  • అవసరమున్న పుస్తకాల సంఖ్యలో ఇప్పటి వరకు 30శాతమే గోదాంలకు చేరిక
  • ఇంగ్లిష్‌, తెలుగు వెర్షన్లలో పుస్తకాల ముద్రణ

మేడ్చల్‌, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రభుత్వ పాఠశాలలు విద్యా సంవత్సరం క్యాలెండర్‌ ప్రకారం తెరుచుకున్నాయి. కరోనా వైరస్‌ ఉధృతితో రెండేళ్లుగా అడపా దడపా నడిచిన విద్యాసంస్థలు ఈ సారి ఎప్పటిలాగే పూర్తి స్థాయిలో నడుస్తూ విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి ఒకటో తరగతి నుంచి ఎనమిదో తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియం బోధనను ప్రవేశపెట్టింది. మేడ్చల్‌ జిల్లాలో రెండేళ్ల క్రితం నుంచే చాలా పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం బోధన కొనసాగుతోంది. కానీ అధికారికంగా మాత్రం ఈ విద్యా సంవత్సం నుంచి ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత స్థాయి పాఠశాలల విద్యార్థులందరికీ ఇంగ్లిష్‌ మీడియంలో బోధన జరుగుతోంది. కార్పొరేట్‌ పాఠశాలల వలె ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఈ విద్యా సంవత్సరం నుంచి మన ఊరు-మన బడి కార్యక్రమం కింద 176 పాఠశాలలను ఎంపిక చేశారు. వాటిల్లో అన్ని సదుపాయాలు కల్పించేందుకు సంకల్పించారు. రూ.70కోట్లతో ఈ స్కూళ్లను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి పనులు సైతం మొదలుపెట్టారు. మొదటి విడత మండలానికి రెండు చొప్పున పాఠశాలలను ఎంపిక చేశారు. పనులు చేపట్టిన చాలా పాఠశాలల్లో సగానికిపైగా పనులు పూర్తి కావచ్చాయి. అయితే మేడ్చల్‌ జిల్లాలో బడులు ప్రారంభమైయి పది రోజులు కావొస్తున్నా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, స్కూల్‌ డ్రెస్సులను ప్రభు త్వం ఇంకా పంపిణీ చేయలేదు. 


  • పాఠశాలలు-విద్యార్థుల సంఖ్య ఇలా..

మేడ్చల్‌ జిల్లాలో 515 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటిల్లో 96,608 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఇంకా అడ్మిషన్లు జరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మేడ్చల్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల పాఠశాల లకు సరిపడా పుస్తకాలను నిల్వచేయడం, అక్కడి నుంచి సరఫరా చేసే గోదాంలు ఉప్పల్‌-రామంతపూర్‌ ప్రాంతంలో ఉన్నాయి. మేడ్చల్‌ జిల్లాకు ఈ విద్యా సంవత్సరానికి 7,58,280 పాఠ్యపుస్తకాలు అవసరమవుతాయని అధికారులు లెక్కగట్టారు. కానీ ప్రస్తుతం ఉప్పల్‌లో ఉన్న పాఠ్యపుస్తకాల గోదాంకు 2,62,650 పుస్తకాలే వచ్చాయి. ఇంకా 4.95,630 పుస్తకాలు రావాల్సి ఉంది. గతంలో మొదట హైదరాబాద్‌ నగరంలోని పాఠశాలలకు పుస్తకాలు ఇచ్చేవారు. అయితే ఈసారి నుంచి జిల్లాలకు ముందుగా పాఠ్యపుస్తకాలను పంపించారు. జూలై 1 నుంచి స్కూళ్లలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి విద్యార్థులకు స్కూల్‌ డ్రెస్సులు ఇస్తామన్నారు. అయితే అవసరమున్న పాఠ్యపుస్తకాల సంఖ్యలో గోదాముల్లోకి ఇప్పటి వరకు 30శాతమే వచ్చాయి. ప్రభుత్వం పంపిణీ చేస్తామన్న తేదీకి మిగిలింది 8 రోజులే. మరి ఆ రోజు నాటికి 4.95లక్షల పుస్తకాలు దిగుమతి అవుతాయా? లేదా? అనే సందేహం నెలకొంది.


  • ఇంగ్లిష్‌, తెలుగు ట్రాన్స్‌లేషన్‌లో ముద్రణ

ఇంగ్లిష్‌ మీడియం నేపథ్యంలో పాఠ్యపుస్తకాల ముద్రణ లో మార్పులు చేశారు. తెలుగు మీడియం విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలోకి మారిన దృష్ట్యా వారికి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పక్కపక్క పేజీల్లో ఇంగి్‌ష, తెలుగు అనువాదాన్ని ముద్రించారు. ఈ రకం పాఠ్యపుస్తకాల ముద్రణ గత సంవత్సరం నుంచే ప్రారంభించినా పేజీ వైస్‌గా మాత్రం ఈసారి నుంచే ప్రచురించారు.

Updated Date - 2022-06-22T04:36:09+05:30 IST