ఎదురుచూపులు.. ఇంకెన్నేళ్లు..!

ABN , First Publish Date - 2021-06-13T04:27:01+05:30 IST

ఎస్పీఎంను 2018లో పునరుద్దరించారు. ఐతే అప్పుడు తీసుకోవాల్సిన 250మంది కార్మికులను ఇంకా విధుల్లోకి తీసుకోలేదు.

ఎదురుచూపులు.. ఇంకెన్నేళ్లు..!

-ఏడేళ్లుగా ఉపాధి లేక నరకయాతన 

-2018లో మిల్లు తెరిచినా ఉద్యోగం దొరకని వైనం 

-250మంది కార్మికులకు దక్కని ఉపాధి

-కార్మికశాఖతో రెండు సార్లు చర్చలు విఫలం 

-ప్రస్తుతం కొవిడ్‌ను సాకుగా చూపుతున్న యాజమాన్యం 

కాగజ్‌నగర్‌, జూన్‌ 12: ఎస్పీఎంను 2018లో పునరుద్దరించారు. ఐతే అప్పుడు తీసుకోవాల్సిన 250మంది కార్మికులను ఇంకా విధుల్లోకి తీసుకోలేదు. తమకు న్యాయం చేయాలని కార్మికులంతా పోరుబాటపట్టారు. ఈ విషయంలో వరంగల్‌లోని లేబర్‌ కార్యాలయం అధికారులకు గతేడాది లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. కార్మికుల విషయంలో వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఇందుకు చర్చలు జరుపాలని మార్చిలో కార్మికశాఖ స్పష్టమైన ఉత్తర్వులను కూడా ఎస్పీఎంకు పంపించింది. ఈ విషయంలో తమవద్ద అధికారులు లేరని యాజ మాన్యం సమాచారం ఇచ్చి చర్చలను వాయిదా వేయించేట్టు చేసింది. ఆ తర్వాత తిరిగి ఈనెల 18న మళ్లీ చర్చలు జరపాలని రెండో దఫా కార్మికశాఖ అధికారులు మళ్లీ ఉత్తర్వులు ఇచ్చారు. ఈసారి మాత్రం కొవిడ్‌ విషయాన్ని ప్రస్తావిస్తూ యాజమాన్యం చర్చలు పాల్గొనలేమని ఖరాఖండిగా తేల్చిచెప్పింది. దీంతో రెండు దఫాలుగా చర్చలు వాయిదా పడడంతో ప్రత్యామ్నాయంగా లాక్‌డౌన్‌ తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుందామని కార్మికశాఖ అధికారులు సూచించినట్టు తెలిసింది. దీంతో సమస్య మళ్లీ మొదటికొచ్చినట్లయింది.

 గతితప్పి పోతున్న వైనం..

ఎస్పీఎం 2014లో మూతబడిన తర్వాత ఎన్నో పోరాటాల ఫలితంగా ఎట్టకేలకు  సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవతో 2018 ఆగస్టు 2న జేకే యాజమాన్యం టేకోవర్‌ చేసింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ కార్మికులకు పూర్తిస్థాయిలో న్యాయం దక్కడం లేదు. మిల్లులో విధుల్లోకి తీసుకునేందుకు 2017నవంబరులో ఇంటర్వ్యూలు, మెడికల్‌ టెస్టులను జేకే యాజమాన్యం చేపట్టింది. ఐతే అందులో ఇప్పటికీ 250మంది కార్మికులకు ఇంకా విధుల్లోకి తీసుకోలేదు. దీంతో తమకు ఉద్యోగం కోసం పిలుపు వస్తుందని కార్మికులు ఎదురుచూస్తున్నారు. సమస్య రోజురోజుకు తీవ్రం అవుతుండడంతో ఎస్పీఎం ఎంప్లాయీస్‌ నెగోషియేషన్‌ కమిటీసభ్యులు లేబర్‌కోర్టులో కేసు వేసేందుకు ఆశ్రయించారు. 

ఎస్పీఎంలో 2013లో ట్రేడ్‌యూనియన్‌ వర్కర్లు 1650, 500మంది స్టాఫ్‌ ఉద్యోగులు, 1200మంది కాంట్రాక్టు కార్మికులు ఉండేవారు. కొంతమంది పదవీ విరమణ, కొంతమంది మరణించడంతో ప్రస్తుతం 1000మంది పర్మినెంటు కార్మికులున్నారు. ఇందులో 250మంది కార్మికులను ఇంకా తీసుకోలేదు. తమకు మిల్లు తెరిచినప్పటికీ ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేషనల్‌ ట్రిబ్యూనల్‌లా 1200మందిని తీసుకునేందుకు ఒప్పందం చేసుకున్నప్పటికీ కూడా తమను విధుల్లోకి తీసుకోవడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు. మిల్లు ప్రారంభిస్తే ఈ ప్రాంతంలో పనిచేసే కార్మికులందరికీ ఉపాధి దొరుకుతుందన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది. మిల్లును పునఃప్రారంభించేలా చేసింది. మిల్లు తెరిచిన తర్వాత స్థానికులకు పూర్తిస్థాయిలో అవకాశాలు ఇవ్వకుండా స్థానికేతర కార్మికులతో ఎలా పని చేయించుకుంటారని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. కార్మిక చట్టాల ప్రకారం తమకు ఖచ్చితంగా సగం జీతం కూడా కట్టివ్వాల్సి ఉంటుందని, ఈ విషయంలో తమను చిన్నచూపు చూడటం సరికాదని కార్మికులు యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2017లో ఎంతమందిని ఇంటర్వ్యూ చేశారు..? ఎంతమందికి మెడికల్‌ టెస్టులు నిర్వహించారు..? ఎంత మందికి కొలువులిచ్చారు..? అనే విషయాలపై శ్వేత పత్రం విడుదల చేస్తే పూర్తిగా తెలుస్తుందని పేర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో పనిచేసే వారికి 2014సంవత్సరంలో ఇచ్చిన జీతం ఇస్తుండగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి అధిక జీతాలు చెల్లింపులు చేయడంపై కార్మికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని సెప్టెంబరు1, 2020న జాయింట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ వరంగల్‌ అధికారికి లిఖిత పూర్వకంగా వినతిపత్రాలను అందజేశారు. దీనిపై వారు మార్చిలో చర్చలు జరపాలని స్పష్టమైన ఆదేశాలను జారీ చేయగా యాజమాన్యం అధికారులు అందుబాటులో లేరని చర్చలకు హాజరు కాలేమని కార్మికశాఖకు లేఖ పంపించింది. ఇలా చర్చలు విఫలమయ్యాయి.

తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి..

-సూర్యప్రకాష్‌రావు, ఎస్పీఎం ఎంప్లాయీస్‌వెల్ఫేర్‌ నెగోషియేషన్‌ కమిటీ కన్వీనర్‌

ఎస్పీఎం కార్మికులను అందరినీ పూర్తిస్థాయిలో విధుల్లోకి తీసుకోవాలి. 250 మందిని పక్కన పెట్టేయడం సరికాదు. చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉన్నారు. కార్మికుల కష్టాలను పరిగణలోకి తీసుకొని యాజమాన్యం వెంటనే విధుల్లోకి తీసుకునేట్టు చేస్తే బాగుంటుంది. కార్మికశాఖకు ఫిర్యాదు చేశాం. రెండుసార్లు కార్మికశాఖ ఏర్పాటు చేసిన చర్చలను యాజమాన్యం వాయిదా వేసింది.  తాము పర్మినెంటు కార్మికులమైనప్పటికీ యాజమాన్యం పూర్తిస్థాయిలో స్పందించడం లేదు. తమకు ఉద్యోగం లేక పోవడం మరోవైపు ఈఎస్‌ఐలో చికిత్సలు అందించకపోవడంతో దీన పరిస్థితుల్లో కాలం వెళ్లదీస్తున్నాం. 

యాజమాన్యం మొండివైఖరి విడనాడాలి..

- అంబాల ఓదెలు, కార్మిక సంఘం నాయకుడు 

జేకే గ్రూపు యాజమాన్యం మొండివైఖరి విడనాడాలి. కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని పలుమార్లు పోరాటాలు చేస్తున్నప్పటికీ కూడా స్పందించడం లేదు. కొవిడ్‌ నిబంధనలు సాకుగా చూపించి విధుల్లోకి పూర్తిస్థాయిలో తీసుకోవడం లేదు. స్థానికేతరులతో అన్ని విభాగాల్లో పనులు ఎలా చేయిస్తున్నారు..? కొత్త బాయిలర్‌ నిర్మాణంలో ఎలా వినియోగిస్తున్నారు..? ఇలాంటి ప్రశ్నలకు పూర్తిగా యాజమాన్యం స్పష్టమైన జావాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎప్పటిలోగా 250మంది కార్మికులను తీసుకుంటారన్నదని కూడా యాజమాన్యం స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అంతే కాకుండా కార్మికశాఖ ఏర్పాటు చేసే చర్చలకు కూడా ఖచ్చితంగా యాజమాన్యం ప్రతినిధులు కూడా హాజరు కావాలి. అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

Updated Date - 2021-06-13T04:27:01+05:30 IST