ఎదురుచూపులు

ABN , First Publish Date - 2021-07-31T05:03:00+05:30 IST

57 ఏళ్లు నిండిన అర్హులకు ఆసరా పింఛన్లు అందజేస్తామని నెల క్రితం సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.

ఎదురుచూపులు

57 ఏళ్లు నిండినవారికి పింఛన్లపై అయోమయం

నెల క్రితం ప్రకటన చేసిన సీఎం కేసీఆర్‌

జిల్లాలో 33వేల మందికి పైగా అర్హులు

దరఖాస్తులు సమర్పిస్తున్న ఆశావహులు

మార్గదర్శకాలు రాలేదంటున్న అధికారులు

తప్పని పరిస్థితుల్లో దరఖాస్తులను స్వీకరిస్తున్న  ప్రజాప్రతినిధులు

    57 ఏళ్లు నిండిన అర్హులకు ఆసరా పింఛన్లు అందజేస్తామని నెల క్రితం సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. కానీ నేటికీ అతీగతీ లేదు. సీఎం ప్రకటనతో ఆశావహుల్లో ఉత్సాహం నిండింది. ఆయా గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులకు దరఖాస్తులు ఇవ్వడంలో నిమగ్నమయ్యారు. అయితే 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు ఇచ్చే విషయంపై ఎలాంటి మార్గదర్శకాలు రాలేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. హుజూరాబాద్‌ ఎన్నికల నేపథ్యంలోనైనా తీపి కబురు అందుతుందని ఆశావహులు ఎదురుచూస్తున్నారు.’


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, జూలై30:   తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 65 ఏళ్ల వయసు నిండినవారికి మాత్రమే వృద్ధాప్య పింఛన్‌ అందజేస్తున్నారు. వీరికి ప్రతీనెలా రూ.2,016 అందుతున్నది.  57 ఏళ్లు నిండిన వారందరికీ కూడా వృద్ధాప్య పింఛన్‌ మంజూరు చేస్తామని 2018 ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఆ తర్వాత పలుమార్లు ఈ విషయంపై చర్చించారు. తాజాగా నెలక్రితం సిరిసిల్లలో కలెక్టరేట్‌ ప్రారంభం సందర్భంగానూ 57ఏళ్లు నిండిన వారి పింఛన్లపై మాట్లాడారు. త్వరితగతిన పింఛన్లు అందజేస్తామని, మార్గదర్శకాలు జారీ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకూ ఎలాంటి ఆదేశాలూ రాలేదు.  రెండేళ్ల కిందట పింఛన్ల అర్హుల కోసం 57ఏళ్లు నిండిన వారి వివరాలను సేకరించారు. అప్పుడు జిల్లాలో 32,465 మంది పేర్లను గుర్తించారు. గడిచిన రెండేళ్లలో ఆసరా మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా 33వేల మందికి పైగానే ఉన్నట్లు అంచనా. జిల్లాలో నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే హుస్నాబాద్‌లో 4,174 మంది, మానకొండూరు పరిధిలోని బెజ్జంకి మండలంలో 1,024 , సిద్దిపేటలో 8,640, దుబ్బాకలో 6,681, గజ్వేల్‌లో 6,285 మంది, జనగామలోని చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, దూలిమిట్ట మండలాల్లో 5,661 మంది అర్హులు ఉన్నట్లు నాడు గుర్తించారు. 


 ప్రజాప్రతినిధులకు దరఖాస్తులు

ముఖ్యమంత్రి ప్రకటనతో గడిచిన నెల రోజుల్లో వందలాది దరఖాస్తులను ఆశావహులు సమర్పించారు. పంచాయతీ కార్యదర్శి, అధికారులకు దరఖాస్తులు ఇచ్చినా.. వారికి మార్గదర్శకాలు రాలేదని చెప్పడంతో చేసేదేమీ లేక ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకుల చేతుల్లో పెడుతున్నారు. ఎలాగూ సీఎం కేసీఆర్‌ ప్రకటన చేయడంతో.. ప్రజాప్రతినిధులు ఆ క్రెడిట్‌ను తమ ఖాతాల్లో వేసుకునేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇంకా పింఛన్లపై అధికారిక ఆమోదం రాకపోవడంతో రేపుమాపు అంటూ ఆశావహులకు నచ్చచెబుతున్నారు. దరఖాస్తులు తీసుకోకుంటే అసంతృప్తితో ఉంటున్నందున తప్పని పరిస్థితుల్లో స్వీకరిస్తున్నామని ప్రజాప్రతినిధులు అంటున్నారు. 

60 ఏండ్లు దాటినయి 

- కుమ్మరి నారాయణ, నారాయణరావుపేట

57 ఏండ్లు దాటినోళ్లకు పింఛన్లు ఇస్తామని రెండేళ్ల క్రితం సర్కారు చెప్పింది. మొన్న కూడా చెప్పిం డ్రు. చానా రోజుల కింద దరఖాస్తు జేసిన. ఇప్పటికే నాకు 60 ఏండ్లు దాటింది. ఏ పని చేయలేకపోతున్నా. ఇప్పటికైనా నాలాంటి వాళ్ల గురించి ప్రభుత్వం ఆలోచన చేయాలి. పింఛన్లు వెంటనే అందజేయాలి. 


ఏడాది క్రితమే దరఖాస్తు చేసిన

- కాశవేని కిష్టయ్య, మల్లంపల్లి, అక్కన్నపేట

పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకుని ఏడాది దాటింది. 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్‌ ఇస్తామని చాలాసార్లు చెబుతున్నారు. కానీ ఇంతవరకు ఇవ్వలేదు. పింఛన్‌ కోసం ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా. 


రెండుసార్లు దరఖాస్తు పెట్టిన

- పిట్ల నర్సింహులు, రుద్రారం

మాది మిరుదొడ్డి మండలం రుద్రారం గ్రామం. నాకు ఇప్పుడు 59 ఏండ్లు. పింఛన్‌ కోసం రెండుసార్లు మా ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేశాను. ఎన్నిసార్లు తిరిగినా పింఛన్‌ గురించి చెప్పడం 

Updated Date - 2021-07-31T05:03:00+05:30 IST