‘దళితబంధు’ కోసం నిరీక్షణ

ABN , First Publish Date - 2022-05-20T05:16:44+05:30 IST

దళితబంధు పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేసి రెండు మాసాలు గడుస్తున్నా కూడా ఇప్పటివరకు యూనిట్లు గ్రౌండింగ్‌ చేయలేదు.

‘దళితబంధు’ కోసం నిరీక్షణ

- లబ్ధిదారులను ఎంపిక చేసి రెండు మాసాలు

- ఖాతాల్లో నిధులు జమ చేసిన ప్రభుత్వం

- యూనిట్లు పంపిణీ చేయని అధికారులు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

దళితబంధు పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేసి రెండు మాసాలు గడుస్తున్నా కూడా ఇప్పటివరకు యూనిట్లు గ్రౌండింగ్‌ చేయలేదు. వారు ఎంపిక చేసిన యూనిట్లను ఎప్పుడు పంపిణీ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. వివిధ జిల్లాల్లో యూనిట్లను పంపిణీ చేసినప్పటికీ, జిల్లాలో మాత్రం ప్రజాప్రతినిధులు, అధికారుల్లో ఏమాత్రం చలనం లేకుండా ఉందనే విమర్శలు వస్తున్నాయి. దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు తీసుక వచ్చిన దళితబంధు పథకాన్ని గత ఏడాది ఆగస్టులో ముఖ్యమంత్రి కేసీఆర్‌ హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ప్రారంభించారు. ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలో హుజూరాబాద్‌ నియోజకవర్గాన్ని మొత్తంగా పైలెట్‌ ప్రాజెక్టుగా తీసుకుని ఒకేసారి అన్ని దళిత కుటుంబాలను పథకం కింద ఎంపిక చేసి వారి ఖాతాల్లో డబ్బులను జమ చేశారు. దశల వారీగా యూనిట్లను గ్రౌండింగ్‌ చేస్తున్నారు. ఆ తర్వాత ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 100 కుటుంబాలను ఎంపిక చేసి మార్చి 7వ తేదీ నాటికి గ్రౌండింగ్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 

జిల్లాలో 218 కుటుంబాలు..

పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి నియోజకవర్గంలో 100 కుటుంబాలను, రామగుండం నియోజకవర్గంలో 100 కుటుంబాలను, ధర్మపురి నియోజకవర్గ పరిధిలో ఉన్న ధర్మారం మండలంలో 18 కుటుంబాలు, మొత్తం 218 కుటుంబాలను ఎంపిక చేశారు. వీరి ఖాతాల్లో 21 కోట్ల 58 లక్షల 20వేల రూపాయలను జమ చేశారు. ఇందులో 165 మంది లబ్ధిదారులు యూనిట్లను ఎంపిక చేసుకున్నారు. 133 మంది కార్లు, ట్రాక్టర్లను ఎంపిక చేసుకోగా 32 మంది గొర్రెలు, బర్రెల పెంపకం యూనిట్లు, సూపర్‌ మార్కెట్లు, డిజిటల్‌ ఫొటోస్టూడియోలు, సెంట్రింగ్‌లు, హార్డ్‌వేర్‌, సిమెంట్‌ షాపుల యూనిట్లను ఎంపిక చేసుకున్నారు. రెండు నెలలు కావస్తున్నా కూడా ఇప్పటివరకు సంబంధిత అధికారులు ఒక్క యూనిట్‌ను కూడా ఎంపిక చేయలేదు. ఏప్రిల్‌ 14వ తేదీన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబా సాహెబ్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి రోజున వాహనాలను పంపిణీ చేస్తారని లబ్ధిదారులు ఎదురుచూశారు. ఆ జయంతి ముగిసి నెలరోజులు గడుస్తున్నా కూడా ఇప్పటివరకు యూనిట్ల పంపిణీ గురించి అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. లబ్ధిదారులు ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. 70 మందికి పైగా లబ్ధిదారులు ట్రాక్టర్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. సకాలంలో వాటిని పంపిణీ చేయని కారణంగా గిరాకీ కోల్పోతున్నారు. ప్రస్తుతం జిల్లాలో వరి కోతలు నడుస్తుండడంతో పొలాల నుంచి వరి కల్లాల వరకు వడ్లను, అక్కడి నుంచి కొనుగోలు కేంద్రాల వద్దకు ధాన్యాన్ని రవాణా చేసేందుకు ట్రాక్టర్లు అవసరం పడతాయి. ట్రాక్టర్ల కొరత కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దళిత బంధు పథకం కింద లబ్ధిదారులకు ట్రాక్టర్లు ఇచ్చి ఉంటే వారికి కొంత మేరకు ప్రయోజనం చేకూరేది. మరో పది రోజులు గడిస్తే వానాకాలం సీజన్‌ కూడా ప్రారంభమై వ్యవసాయ పనులు ముమ్మరం కానున్నాయి. ఇప్పటికే వేసవి దుక్కులు దున్నుతున్నారు. తొలకరి జల్లులు కురియగానే దుక్కులు దున్ని ఆరుతడి పంటల విత్తనాలు చల్లి సాగు చేసేందుకు రైతులు సిద్ధం అవుతున్నారు. ఈ పనులకు ట్రాక్టర్ల అవసరం బాగానే ఉంటుంది. 

మంథని నియోజకవర్గానికి మొండిచేయి..

దళితబంధు పథకాన్ని మంథని నియోజకవర్గానికి ఇప్పటివరకు వర్తింపజేయలేదు. లబ్ధిదారుల ఎంపిక కొలిక్కి రాలేదు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఇంకా ఆమోదం తెలుపలేదు. మంథని అసెంబ్లీ నియోజకవర్గం పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో విస్తరించి ఉన్నది. జిల్లాలో మంథని, రామగిరి, ముత్తారం, కమాన్‌పూర్‌ మండలాలు ఉండగా, భూపాలపల్లి జిల్లాలో కాటారం, మహదేవ్‌పూర్‌, ముత్తారం, మల్హర్‌, పలిమెల మండలాలు ఉన్నాయి. దళితబంధు పథకం కింద లబ్ధిదారుల గుర్తించే బాధ్యతను ప్రభుత్వం ఎమ్మెల్యేలకే అప్పగించింది. మంథని ఎమ్మెల్యే, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు భూపాలపల్లి జిల్లా పరిధిలోని మండలాల్లో 60 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి అధికారులకు జాబితా ఇవ్వగా మంజూరుచేశారు. యూనిట్లు గ్రౌండింగ్‌ కూడా అవుతున్నాయి. జిల్లా పరిధిలోని మంథని మండలం అడవిసోమన్‌పల్లి, ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్‌, రామగిరి మండలం లొంకకేసారం, కమాన్‌పూర్‌ మండలం పేరపల్లి గ్రామాల్లో 40 మంది పేర్ల జాబితాను ఎమ్మెల్యే జిల్లా అధికారులకు పంపించారు. అలాగే జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ సైతం ముత్తారం మండలం దరియాపూర్‌, రామగిరి మండలం లొంకకేసారం గ్రామాల్లో ఉన్న 40 దళిత కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని వర్తింపజేయాలని అధికారులకు, జిల్లా ఇన్‌చార్జీ మంత్రికి జాబితాను అందజేశారు. కానీ ఇప్పటివరకు లబ్ధిదారులను ఎంపిక చేయలేదు. ఎమ్మెల్యే ఇచ్చిన జాబితాలో ఉన్న వారికి ఎంపిక చేయాలా, జడ్పీ చైర్మన్‌ ఇచ్చిన జాబితాలో ఉన్న వారిని ఎంపిక చేయాలా అనే డైలామాలో పడ్డారు. రెండు నెలలు గడుస్తున్నా లబ్ధిదారులను ఎంపిక చేయకపోవడంతో దళితులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఇన్‌చార్జీ మంత్రి, కలెక్టర్‌ స్పందించి మంజూరుచేసిన యూనిట్లను గ్రౌండింగ్‌ చేయాలని, మంథని నియోజకవర్గ పరిధిలో లబ్ధిదారులను ఎంపిక చేయాలని దళితులు, దళిత సంఘాల నాయకులు కోరుతున్నారు.

Updated Date - 2022-05-20T05:16:44+05:30 IST