కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ గత కొంతకాలంగా ప్రవాసులకు వర్క్పర్మిట్ల జారీని కఠినతరం చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి కారణం కువైటైజేషన్. అన్ని రంగాల్లో వలసదారుల ప్రాబల్యం పెరుగుతుండడంతో స్వదేశీయులకు ఉపాధి దొరకడంలేదని కువైటైజేషన్కు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా ప్రభుత్వ రంగాలతో పాటు ప్రైవేట్ సెక్టార్‌లోనూ భారీ మొత్తంలో దేశీయ పౌరులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. ఇలాంటి సమయంలోనూ తాజాగా ప్రవాసులకు కువైత్ ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. వలసదారులు ఎవరైతే కమర్షియల్ విజిట్ వీసా కలిగి ఉన్నారో వారికి వర్క్పర్మిట్కు మార్చుకునే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ డైరెక్టర్ జనరల్ అహ్మద్ అల్ మౌసా ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
Kuwait కు వెళ్తున్నారా..? పొరపాటున కూడా వీటిని తీసుకెళ్లొద్దు..!
Kuwait లో ఎడమ చేతితో తినకూడదా..?
కమర్షియల్ విజిట్ వీసాపై కువైత్‌లో ఉన్న ప్రవాసులు దాన్ని వర్క్పర్మిట్గా మార్చుకోవచ్చని తెలిపారు. అంతర్గత మంత్రిత్వశాఖ సహాకారంతో కమర్షియల్ విజిట్ వీసా ఉన్న వలసదారులకు వర్క్‌పర్మిట్ జారీ చేసేలా సవరణలు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే, ప్రవాసులు ఇలా కమర్షియల్ విజిట్ వీసాను వర్క్పర్మిట్కు మార్చుకునేందుకు కరోనా ఎమర్జెన్సీ మినిస్ట్రీయల్ కమిటీ ఆమోదం తప్పనిసరి అని వెల్లడించారు. కాగా, లేబర్ మార్కెట్లో అవసరాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మౌసా తెలియజేశారు. ఇక కువైత్‌లో వ్యాపార కార్యక్రమాల నిర్వహణకు వలసదారులు కమర్షియల్ విజట్ వీసా కలిగి ఉండడం తప్పనిసరి. కువైటీ ఎంబసీ లేదా కాన్సులేట్ ఈ వీసాను జారీ చేస్తుంది.
అయితే, జీసీసీ దేశాల వారికి కమర్షియల్ విజిట్ వీసా అవసరం ఉండదు. వారు నేరుగా కువైత్‌లో వ్యాపార కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. ఇదిలాఉంటే... కువైటైజేషన్‌లో భాగంగా కువైత్ చేపడుతున్న పలు కఠిన విధానాలతో పాటు కరోనా కారణంగా ఇప్పటికే భారీ సంఖ్యలో ప్రవాసులు ఆ దేశాన్ని వదిలి వెళ్లిపోతున్నారు. ఈ ఏడాది మొదటి అర్ధభాగంలోనే సుమారు 56,300 మంది వలసదారులు కువైత్ నుంచి వెళ్లిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. దీంతో కువైత్‌లో ప్రవాసుల సంఖ్య 31 లక్షలకు పడిపోయిన్నట్లు సమాచారం.