Qatar వెళ్లే వలసదారులకు కొత్త సమస్య.. 20 రోజుల పాటు వెయిటింగ్!

ABN , First Publish Date - 2021-10-31T16:41:15+05:30 IST

గల్ఫ దేశం ఖతార్ వెళ్లే వలసదారులకు కొత్త సమస్య వచ్చి పడింది.

Qatar వెళ్లే వలసదారులకు కొత్త సమస్య.. 20 రోజుల పాటు వెయిటింగ్!

దోహా: గల్ఫ దేశం ఖతార్ వెళ్లే వలసదారులకు కొత్త సమస్య వచ్చి పడింది. కరోనా నేపథ్యంలో తమ దేశానికి వచ్చేవారికి ఖతార్ ప్రభుత్వం ఏడు రోజుల క్వారంటైన్‌ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడీ క్వారంటైన్ నిబంధన వలసకార్మికులకు పెద్ద సమస్యగా మారింది. ఖతార్ వెళ్లేవారు తప్పనిసరిగా హోటళ్లలో 7రోజులు సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉండాల్సి రావడంతో హోటల్ గదులకు బాగా డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా అక్కడి హోటళ్లలో అద్దె గదులు దొరకడం గగనంగా మారింది. ఇక క్వారంటైన్‌కు అవసరమైన హోటల్ గది ఖాళీగా ఉంటేనే వీరి ప్రయాణానికి అనుమతి లభిస్తోంది. విమానయాన సంస్థలు కూడా హోటల్ గది దొరికినట్లు ఆధారం చూపిస్తేనే టికెట్లు ఇస్తున్నాయి. మన దగ్గర నుంచి ప్రస్తుతం ఆ దేశానికి విమానాలు బాగానే నడుస్తున్నా.. అక్కడికి వెళ్లిన తరువాత 7 రోజులపాటు క్వారంటైన్‌‌లో ఉండటానికి అవసరమైన హోటల్‌ గదులు దొరకడం లేదు. దీంతో వలసదారులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. 


ఇక ఖతార్‌ 2022లో ప్రపంచ ఫుట్‌బాల్‌ మెగాటోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ దేశంలో ఉపాధి అవకాశాలు పెరిగాయి. దీంతో ఇతర గల్ఫ్‌దేశాల కంటే కూడా ఖతార్ నుంచే వీసాలు ఎక్కువగా జారీ అవుతున్నాయి. కానీ, హోటల్‌ గది బుక్ అయినట్లు రసీదు చూపిస్తేనే విమానయాన సంస్థలు టికెట్‌ ఇస్తున్నాయి. అయితే, ప్రస్తుతం ఖతార్‌లోని హోటల్‌ గదులు నిండిపోయాయి. దీంతో ఏకంగా 20 రోజులకు మించి వెయిటింగ్‌లో ఉండాల్సివస్తోందని వలసదారులు వాపోతున్నారు. ఇప్పుడు వైరస్ ప్రభావం అంతగా లేనందున ఖతార్‌ సర్కార్ ఈ క్వారంటైన్‌ నిబంధనను ఎత్తివేస్తే వలసదారులకు ఆ దేశానికి వెళ్లడానికి సులువు అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.   

Updated Date - 2021-10-31T16:41:15+05:30 IST