ఒమైక్రాన్ ఎఫెక్ట్.. ప్రయాణ నిబంధనలు సవరించిన ప్రభుత్వం.. కన్నెర్రజేస్తున్న ప్రవాసులు

ABN , First Publish Date - 2022-01-13T20:57:32+05:30 IST

కరోనా విజృంభణ నేపథ్యంలో విదేశీ ప్రయాణికుల విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రవాసులు గుర్రుగా ఉన్నారు. నిబంధనల విషయంలో క్లారిటీ ఇవ్వాలని ప్రభుత్వా

ఒమైక్రాన్ ఎఫెక్ట్.. ప్రయాణ నిబంధనలు సవరించిన ప్రభుత్వం.. కన్నెర్రజేస్తున్న ప్రవాసులు

ఎన్నారై డెస్క్: కరోనా విజృంభణ నేపథ్యంలో విదేశీ ప్రయాణికుల విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రవాసులు గుర్రుగా ఉన్నారు. నిబంధనల విషయంలో క్లారిటీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తోంది. దీంతో అగ్రరాజ్యం సహా ప్రపంచ దేశాలు కొవిడ్ తీవ్రతకు అల్లాడుతున్నాయి. ఇండియాలో కూడా నిత్యం లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ప్రయాణ మార్గదర్శకాలను సవరించిన ప్రభుత్వం.. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు 7 రోజులపాటు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాల్సిందే అని స్పష్టం చేసింది. అయితే ఈ నిబంధన ప్రవాసులకు ఇబ్బందిగా మారింది. మెడికల్ ఎమర్జెన్సీ, అత్యవసర పనుల నిమిత్తం ఇండియాకు వచ్చే వారి పరిస్థితి ఏంటని ప్రవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో సాధ్యమైనంత త్వరగా స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. 



షార్జాలోని ఓ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్‌గా పని చేస్తున్న ఆనందియా దత్ మీడియాతో మాట్లాడుతూ.. తన తల్లి ఆరోగ్యం బాగోలేకపోవడంతో బుధవారం ఇండియా వచ్చేందుకు ప్లాన్ చేసుకున్నట్టు చెప్పారు. రెండు రోజులు అక్కడే ఉండి.. తిరిగి షార్జ్‌కు బయల్దేరాలని భావించినట్టు పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం విధించిన 7 రోజుల తప్పనిసరి క్వారెంటైన్ నిబంధన వల్ల తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నట్టు చెప్పారు. మరికొందరు ప్రవాసులు మాట్లాడుతూ.. ఏడు రోజుల క్వారంటైన్ నిబంధనను తప్పుబట్టారు. షార్ట్ ట్రిప్స్ కోసం ప్రవాసులు ఇండియాకు రాకూడదా? అని ప్రశ్నిస్తున్నారు. 




Updated Date - 2022-01-13T20:57:32+05:30 IST