Kerala Assembly complex లోకి ప్రవాసభారతీయురాలి అక్రమ ప్రవేశం.. నలుగురు ‘సభా టీవీ’ ఉద్యోగులపై వేటు

ABN , First Publish Date - 2022-06-24T21:45:24+05:30 IST

కేరళ అసెంబ్లీ ప్రాంగణంలోకి అక్రమంగా ప్రవేశించడంలో ఓ ప్రవాస భారతీయురాలికి సహకరించిన నలుగురు ‘సభా టీవీ’ ఉద్యోగులపై వేటుపడింది.

Kerala Assembly complex లోకి ప్రవాసభారతీయురాలి అక్రమ ప్రవేశం.. నలుగురు ‘సభా టీవీ’ ఉద్యోగులపై వేటు

తిరువనంతపురం : కేరళ అసెంబ్లీ ప్రాంగణం(Kerala Assembly complex)లోకి అక్రమంగా ప్రవేశించడంలో ఓ ప్రవాస భారతీయురాలికి(Expatriate ) సహకరించిన నలుగురు ‘సభా టీవీ’(Sabha TV) ఉద్యోగులపై వేటుపడింది. నలుగురు కాంట్రాక్ట్ ఉద్యోగులను సర్వీసు నుంచి తొలగిస్తున్నట్టు కేరళ స్పీకర్ ఎంబీ రాజేష్ శుక్రవారం ప్రకటించారు. గతవారం కేరళ శాసనసభ ఆవరణలో ప్రవాసుల సమ్మేళనం ‘లోక కేరళ సభ’(Loka kerala sabha) జరిగింది. అయితే ఈ సభకు అనుమతి లేకపోయినా ఇటలీ(Italy) నుంచి వచ్చిన ప్రవాస భారతీయురాలు అనిత పుళ్లైయిల్(Anitha Pullayil) పాల్గొంది. అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రవేశ పాస్ లేకపోయినా చట్టవిరుద్ధంగా లోపలికి వెళ్లింది. ఈమెకు కేరళ శాసనసభ సెక్రటరియేట్‌ ఆన్‌లైన్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ‘సభా టీవీ’కి చెందిన నలుగురు కాంట్రాక్ట్ ఉద్యోగులు తోడ్పడ్డారు. ఉద్యోగులు చొరవ తీసుకోవడంతోనే ఆమె లోపలికి ప్రవేశించడంతో ఉద్యోగులకు స్పీకర్ ఉద్వాసన పలికారు.


కాగా నిందిత మహిళ అనితకు పురాతన వస్తుకళా వస్తువుల మోసం కేసులో నిందితుడిగా ఉన్న ఫ్రాడ్‌స్టర్ మాన్సన్ మవుంకల్‌‌(Monson Mavunkal)తో సంబంధాలు ఉన్నాయి. ఈ కేసులో అనిత పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు మాన్సన్ మవుంకల్‌పై చీటింగ్, పోక్సో కేసులున్నాయి. మైనర్‌ని లైంగికంగా వేధించడమే కాకుండా ఆమె పేరు, వివరాలను వెల్లడించినందుకుగానూ అతడిపై పోక్సో కేసు నమోదయ్యింది. అలాంటి వ్యక్తితో సంబంధాలు ఉన్న వ్యక్తి అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రవేశించడంపై స్పీకర్ ఈ కఠిన చర్యలు తీసుకున్నారు.


ఎలాంటి అనుమతి లేకపోయినా అనితా పుళ్లైయిల్ అసెంబ్లీ ప్రాంగణమంతా యధేచ్చగా కలియదిరిగింది. ఇందుకు సహకరించిన ఫజీలా, విధూ రాజ్, ప్రవీణ్, విష్ణులను సర్వీస్ నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ ఎంబీ రాజేష్ వెల్లడించారు. ఈ వైఫల్యంపై దర్యాప్తు జరపాలంటూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. లోక కేరళ సభలో అనిత పుళ్లైయిల్‌కి కనీసం సభ్యత్వం కూడా లేదన్నారు. కనీసం ప్రవేశ పాస్ లేకుండానే ఆమె అక్రమంగా ప్రవేశించారని అన్నారు. కాగా అనిల్ పుళ్లైయిల్‌ని సభా టీవీ ఉద్యోగులు ఇంటర్వ్యూ కూడా చేశారు. ఆమె ఇంటర్వ్యూని సంబంధిత ప్లాట్‌ఫాం నుంచి తొలగించాలని ఎడిటోరియల్ బోర్డ్‌కు ఆయన ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - 2022-06-24T21:45:24+05:30 IST