Dubai: సెలవుల కోసం యజమానిని చంపేసిన ప్రవాసుడు.. అసలేం జరిగిందంటే..!

ABN , First Publish Date - 2022-04-26T18:01:31+05:30 IST

సెలవుల కోసం యజమానిని చంపేసిన ప్రవాస కార్మికుడికి దుబాయ్ కోర్టు జీవితఖైదు విధించింది.

Dubai: సెలవుల కోసం యజమానిని చంపేసిన ప్రవాసుడు.. అసలేం జరిగిందంటే..!

దుబాయ్: సెలవుల కోసం యజమానిని చంపేసిన ప్రవాస కార్మికుడికి దుబాయ్ కోర్టు జీవితఖైదు విధించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వాహనాల మరమ్మత్తులకు సంబంధించిన గ్యారేజ్‌లో ఆసియాకు చెందిన ఓ వ్యక్తి పని చేసేవాడు. ఈ క్రమంలో ఒకరోజు తాను స్వదేశానికి వెళ్లాలనుకుంటున్నానని, తనకు సెలవు కావాలని యజమానితో అన్నాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో కార్మికుడు గ్యారేజ్‌లోనే యజమానిని కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత యజమాని మిత్రులు కొందరు గ్యారేజ్‌కు వచ్చారు. రక్తపు మడుగులో పడి ఉన్న స్నేహితుడిని చూసి పోలీసులకు సమాచారం అందించారు. వారి సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహంపై ఉన్న గాయాలను చూసి అది కచ్చితంగా హత్యేననే నిర్ణయానికి వచ్చారు. 

 

అప్పటికే గ్యారేజ్‌లో పనిచేసే కార్మికుడు కనిపించకపోవడంతో పోలీసుల అనుమానం మరింత పెరిగింది. వెంటనే అతడికి కోసం వెతికారు. అప్పటికే అతడు దేశం విడిచిపెట్టి వెళ్లిపోయే ఏర్పాట్లలో ఉన్నాడు. ప్రయాణ పత్రాల కోసం అతడి దేశానికి చెందిన కాన్సులేట్ కార్యాలయానికి వెళ్లాడు. అప్పటికే తనిఖీలు ముమ్మరం చేసిన దుబాయ్ పోలీసులు అనుమానంతో కాన్సులేట్ కార్యాలయం వద్దకు వెళ్లారు. వారి అనుమానం నిజమైంది. అతడు అక్కడే ఉన్నాడు. దాంతో వెంటనే అరెస్ట్ చేశారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నిజాన్ని అంగీకరించాడు. సెలవుల విషయమై యజమానితో జరిగిన గొడవలో తానే అతడిని చంపేసినట్లు ఒప్పుకున్నాడు. 2020 జూన్‌లో ఈ ఘటన జరిగింది. తాజాగా ఈ కేసు దుబాయ్ క్రిమినల్ కోర్టులో విచారణకు వచ్చింది. విచారణలో తన నేరాన్ని అంగీకరించిన కార్మికుడికి న్యాయస్థానం జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది.     

Updated Date - 2022-04-26T18:01:31+05:30 IST