కరోనా ఎఫెక్ట్.. భార్య కళ్లముందే భర్త ప్రాణాలు తీసుకున్నాడు

ABN , First Publish Date - 2021-05-30T01:40:40+05:30 IST

కొవిడ్ మహమ్మారి దెబ్బకు ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పిల్లలకు తల్లిదండ్రులను దూరం చేసిన మహమ్మారి.. పిల్లలను పొట్టన పెట్టుకుని తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. భార్యాభర్తలను

కరోనా ఎఫెక్ట్.. భార్య కళ్లముందే భర్త ప్రాణాలు తీసుకున్నాడు

అబుధాబి: కొవిడ్ మహమ్మారి దెబ్బకు ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పిల్లలకు తల్లిదండ్రులను దూరం చేసిన మహమ్మారి.. పిల్లలను పొట్టన పెట్టుకుని తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. భార్యాభర్తలను కూడా విడగొట్టిన కరోనా.. తాజాగా భార్య కళ్లముందే భర్త ప్రాణాలు తీసుకునేలా చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 


ఆసియాకు చెందిన 42ఏళ్ల వ్యక్తి గత కొన్నేళ్లుగా తన భార్యతో కలిసి  యూఏఈలో నివసిస్తున్నాడు. ఓ సంస్థలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆ వ్యక్తి కొద్ది రోజుల క్రితం కరోనా బారినపడ్డాడు. దీంతో అక్కడి హెల్త్ అధికారులు అతని చేతికి క్వారెంటైన్ వ్రిస్ట్ బ్యాండ్‌ను తొడిగారు. ఈ నేపథ్యంలో సదరు వ్యక్తి గత ఐదు రోజులుగా ఐసోలేషన్‌లోనే ఉంటున్నాడు. ఉద్యోగానికి వెళ్లలేని పరిస్థితి వల్ల కుటుంబ పోషణ గురించి దిగులు పెట్టుకున్నాడు. భవిష్యత్తులో వచ్చే ఆర్థిక సమస్యలను ఊహించుకుని ఆందోళన చెందాడు. ఈ క్రమంలోనే ప్రాణాలు విడిచేందుకు సిద్ధపడ్డాడు. గురువారం రాత్రి భార్యతోపాటు అజ్మాన్ ప్రాంతంలోని అల్ రావ్డా బ్రిడ్జ్ వద్దకు చేరుకుని.. ‘పిల్లలను జాగ్రత్తగా చూసుకో’ అని చెబుతూ భార్య కళ్లముందే బ్రిడ్జ్‌పై నుంచి దూకి ప్రాణాలొదిలాడు. భర్త చావును కళ్లారా చూసిన.. భార్య శోకసంద్రంలో మునిగిపోయింది. తన భర్త ఏం చేస్తున్నాడో అర్ధమయ్యే సరికే.. ఘోరం జరిగిపోయిందంటూ గుండెలవిసేలా రోదించింది. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. క్వారెంటైన్ పీరియడ్ వల్ల ఉద్యోగం పోతుందని ఆందోళన చెంది సదరు వ్యక్తి ఆత్మహత్యకు పూనుకున్నాడని  భావిస్తున్నట్టు పేర్కొన్నారు. 


Updated Date - 2021-05-30T01:40:40+05:30 IST