విస్తరణవాదం తోక ముడవాలి

ABN , First Publish Date - 2020-07-04T07:02:05+05:30 IST

ప్రధాని వెళ్లిన ప్రాంతం సింధు నది ఒడ్డున జస్కర్‌ శ్రేణిలో ఉంటుంది. ప్రధాని అక్కడ.. మన మహా దళాధిపతి బిపిన్‌ రావత్‌, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణేతో కలిసి ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్‌, ఐటీబీపీ బలగాలతో సంభాషించి గల్వాన్‌ లోయలో చైనా సైనికులతో జరిగిన హింసాత్మక ఘర్షణలో అమరులైన 20 మంది వీరజవాన్లకు నివాళులు అర్పించారు

విస్తరణవాదం తోక ముడవాలి

  • వేణుగానం చేసే కృష్ణుడే కాదు
  • సుదర్శన చక్రధారీ మాకు ఆదర్శమే
  • శాంతి మన బలహీనత కాదు
  • చైనాకు ప్రధాని నరేంద్రమోదీ హెచ్చరిక
  • లద్దాఖ్‌లోని నీమూలో అనూహ్య పర్యటన
  • అక్కడి మన సైనిక దళాలతో సంభాషణ
  • మీ ధైర్యసాహసాలు సమున్నతమైనవి
  • మీ సంకల్ప శక్తి పర్వతాలకన్నా దృఢమైనది
  • మిమ్మల్ని చూసి దేశమంతా గర్విస్తోంది
  • మీ గాథలే ఇంటింటా మోగుతున్నాయి
  • జవాన్ల స్థైర్యం పెంచేలా మోదీ ప్రసంగం


చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రగులుతున్న వేళ.. సైనికుల పదఘట్టనలు, సైనిక వాహనాల రొదతో గల్వాన్‌లోయ ప్రతిధ్వనిస్తున్న వేళ.. ప్రధాని మోదీ అనూహ్యంగా లద్దాఖ్‌లోని నీమూ ప్రాంతానికి వెళ్లారు. ముళ్లకట్టెలతో, ఇనుప కంచెలు చుట్టిన రాడ్లతో దాడిచేసిన డ్రాగన్‌ సైనికుల పీచమణిచిన మన జవాన్ల ధైర్యసాహసాలను కొనియాడారు! దేశం మొత్తం వారికి అండగా ఉంటుందంటూ వారిలో స్ఫూర్తిని నింపారు.


మన జవాన్లు ప్రదర్శించిన అసాధారణమైన సాహసంతో ప్రపంచానికి భారత సత్తా ఏమిటో తెలిసింది. గల్వాన్‌ లోయలో త్యాగాలు చేసిన భరత మాత పుత్రులను దేశం సగర్వంగా గుర్తుంచుకుంటుంది. అమరులైన వారు దేశంలోని అన్ని ప్రాంతాలకూ చెందినవారు.. భారతీయుల ధైర్య సాహసాలకు వారు ప్రతిబింబాలు. దుందుడుకుగా వ్యవహరించిన చైనా సైనికులకు తగిన బుద్ధి చెప్పారు. 

- లద్దాఖ్‌లో ప్రధాని మోదీ


న్యూఢిల్లీ, జూలై 3 (ఆంధ్రజ్యోతి): ‘‘విస్తరణవాద శకం ముగిసింది. ఇది అభివృద్ధి శకం. విస్తరణవాద శక్తులు అయితే ఓడిపోయాయి లేదా   తోకముడిచాయి’’ అని ప్రధాని నరేంద్ర మోదీ చైనా పేరు ప్రస్తావించకుండానే ఆ దేశంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘శాంతి, స్నేహం భారతదేశ సంస్కృతి. కానీ, మా శాంతికాముకత్వాన్ని బలహీనతగా భావించవద్దు’’ అని డ్రాగన్‌ దేశాన్ని హెచ్చరించారు. సరిహద్దుల్లో మన సైనికుల ఆగ్రహావేశాలను శత్రువులు చవిచూశారని.. మన జవాన్ల ధైర్యసాహసాల గాథలు దేశంలోని ప్రతి ఇంట్లో ప్రతిధ్వనిస్తున్నాయని కొనియాడారు. చైనా విషయంలో మెతకగా వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో.. ప్రధానమంత్రి శుక్రవారం ఆకస్మికంగా లద్దాఖ్‌లోని లేహ్‌ జిల్లాలో ఉన్న నీమూ ప్రాంతానికి వెళ్లి డ్రాగన్‌ దేశంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భారతదేశం చేతులు ముడుచుకుని కూర్చోదని సంకేతాలు పంపడమే కాక, సైన్యం మనోబలాన్ని పెంచుతూ వ్యాఖ్యలు చేశారు.


ప్రధాని వెళ్లిన ప్రాంతం సింధు నది ఒడ్డున జస్కర్‌ శ్రేణిలో ఉంటుంది. ప్రధాని అక్కడ.. మన మహా దళాధిపతి బిపిన్‌ రావత్‌, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణేతో కలిసి ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్‌, ఐటీబీపీ బలగాలతో సంభాషించి గల్వాన్‌ లోయలో చైనా సైనికులతో జరిగిన హింసాత్మక ఘర్షణలో అమరులైన 20 మంది వీరజవాన్లకు నివాళులు అర్పించారు. శాంతి, అభివృద్ధిని భగ్నం చేసేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే వారికి భారత్‌ ఎప్పుడూ బుద్ధి చెప్పిందని ఆయన గుర్తుచేశారు. ఇటీవలి కాలంలో మన జవాన్లు ప్రదర్శించిన అసాధారణమైన సాహసంతో ప్రపంచానికి భారత సత్తా ఏమిటో తెలిసిందని గుర్తుచేశారు. ‘‘మిత్రులారా.. మాతృభూమి సంరక్షణలో మీ అంకితభావం నిరుపమానం. ఇంతటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంటూ భారతదేశ సంరక్షణకు, సేవకు పాటుపడుతున్న మీతో ఈ ప్రపంచంలోనే ఎవరూ పోటీపడలేరు. మీరు చూపిన ధైర్యసాహసాలు.. భారతదేశ సత్తా గురించి ప్రపంచానికి ఒక సందేశం పంపాయి. మీరు విధులు నిర్వర్తిస్తున్న ఈ ఎత్తైన ప్రాంతం కంటే.. మీ ధైర్యసాహసాలే సమున్నతమైనవి. మీ సంకల్పశక్తి మనం చూస్తున్న ఈ పర్వతాల కంటే దృఢమైనది. అది మా అందరికీ మరింత స్ఫూర్తినిస్తోంది’’ అన్నారు. లేహ్‌-లద్దాఖ్‌ అయినా, కార్గిల్‌ లేదా సియాచిన్‌ గ్లేసియర్‌ అయినా, ఎటువంటి ఉన్నత పర్వత ప్రాంతాలు, మంచు ప్రవాహాలైనా మన భారతీయ సైనికులు అంతటా తమ వీరత్వాన్ని ప్రదర్శిస్తున్నారని మోదీ గుర్తుచేశారు.


మెరుగైన రక్షణ సామర్థ్యం 

‘‘నౌకా శక్తిలో, వైమానిక శక్తిలో, అంతరిక్ష శక్తిగా.. సైనిక బలిమి విషయంలో భారతదేశం నానాటికీ బలోపేతమవుతోంది. ఆయుధాల ఆధునికీకరణ, మౌలికసదుపాయాల అభివృద్ధి మనదేశ రక్షణ సామర్థ్యాన్ని ఎన్నో రెట్లు బలోపేతం చేశాయి’’ అని ప్రధాని పేర్కొన్నారు. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలపై ఖర్చును మూడు రెట్లు పెంచిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. జాతీయ భద్రతాయంత్రాంగాన్ని పటిష్ఠం చేసేందుకు, సైనిక సంక్షేమానికి తీసుకుంటున్న చర్యల్ని ఆయన వివరించారు. సర్వ సైన్యాధ్యక్షుడిని నియమించడం, మహత్తరమైన జాతీయ యుద్ధ స్మారక చిహ్నాన్ని నిర్మించడం, దశాబ్దాల తర్వాత ఒకే ర్యాంకు, ఒకే పింఛన్‌ను అమలు చేయడం, సాయుధ దళాల కుటుంబాల సంక్షేమానికి ఎన్నో చర్యలు తీసుకోవడం ఇందుకు ఉదాహరణ అని మోదీ పేర్కొన్నారు.


త్యాగాల భూమి!

లద్దాఖ్‌లో పర్యటించిన ప్రధాని మోదీ.. ఆ ప్రాంత సాంస్కృతిక ఔన్నత్యాన్ని గుర్తుచేసుకున్నారు. బౌద్ధ సన్యాసి కుషోక్‌ బకూలా రింపోచీ బోధల గురించి ప్రస్తావించారు. లద్దాఖ్‌ త్యాగాల భూమి అని.. ఎందరో దేశ భక్తులకు జన్మనిచ్చిందని ప్రశంసించారు. భారత ప్రజలు గౌతమబుద్ధుడి బోధనలకు నిత్యం ప్రేరితులవుతారని ఆయన అన్నారు.


రాజ్‌నాథ్‌ వెళ్లాల్సి ఉన్నా..

రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శుక్రవారంనాడు లేహ్‌ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కానీ, ఆయన ఆఖరు నిమిషంలో.. తానే స్వయంగా అక్కడికి వెళ్లి, మన సైనికులను కలవాలని ప్రధాని మోదీ నిర్ణయించుకున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం.


భారత్‌కు జపాన్‌ మద్దతు 

తూర్పు లద్దాఖ్‌లో చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదంలో జపాన్‌ భారత్‌కు బాసటగా నిలిచింది. విదేశాంగ కార్యదర్శి హర్షవర్థన్‌తో భేటీ తర్వాత జపాన్‌ రాయబారి సతోషి సుజుకీ ట్విటర్‌లో భారత్‌కు తమ మద్దతును తెలిపారు. ప్రస్తుత పరిస్థితిని హర్షవర్థన్‌ చక్కగా వివరించారని, భారత ప్రభుత్వ విధానాల్ని కూడా తెలిపారన్నారు. భారత్‌లాగే జపాన్‌ కూడా శాంతియుతంగానే సమస్య పరిష్కారమవ్వాలని కోరుకుంటోందన్నారు.


‘‘బలహీనులు ఎన్నటికీ శాంతిని సాధించలేరు. శాంతికి కావాల్సింది ధైర్యం. ప్రపంచయుద్ధాలైనా, శాంతి అయినా.. సందర్భాన్ని బట్టి మా వీరజవాన్ల విజయాలను, శాంతికాముకత్వాన్ని ఈ ప్రపంచం చూసింది. మేం మానవాళి పురోభివృద్ధికే ఎప్పుడూ కృషి చేశాం. వేణుగానం చేసే కృష్ణుణ్ని పూజించే మేమే.. సుదర్శన చక్రధారి అయిన కృష్ణుణ్ని ఆదర్శంగా తీసుకుంటాం.’’

- లద్దాఖ్‌లో ప్రధాని మోదీ

Updated Date - 2020-07-04T07:02:05+05:30 IST